Vitamin D for Child Growth : మనం శారీరకంగా ఆరోగ్యంలో ఉండడంలో విటమిన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి. అందులో 'విటమిన్ డి'ది ప్రత్యేక స్థానం. ప్రధానంగా బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు వివిధ అవయవ వ్యవస్థలు సక్రమంగా పనిచేయడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. అయితే, కేవలం పెద్దలకే కాదు.. పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్ డి చాలా అవసరమంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలోనూ పిల్లల ఎదుగుదలలో, ఎముకలు దృఢంగా మారడంలో డి విటమిన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడైంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పిల్లలు ఆటలు ఆడుతున్నప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగలడం కామన్. కానీ.. కొన్నిసార్లు ప్రమాదవశాత్తు చేయో, కాలో కూడా విరుగుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో చాలావాటికి సర్జరీల అవసరమూ ఉండకపోవచ్చు. అయితే, ఇదే సమయంలో ఆ చిన్నారికి డి విటమిన్ లోపం ఉంటే మాత్రం అది అతుక్కోవడానికి ఎక్కువ టైమ్ పట్టొచ్చట. ఇటీవల "అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నేషనల్" నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
ఈ అధ్యయనంలో భాగంగా 186మంది గాయాలు పాలైన పిల్లల్ని పరిశోధకులు పరీక్షించారట. ఆపై రేడియోగ్రాఫిక్ ఫలితాలతో పోల్చి చూడటం ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. దీంతో.. పిల్లల ఎదుగుదలలో, బోన్స్ దృఢంగా మారడంలో "విటమిన్ డి" కీలకపాత్ర పోషిస్తున్నట్లు మరోసారి ఈ పరిశోధన ద్వారా వెల్లడైంది. కాబట్టి.. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి పిల్లలకు డైలీ తగినంత మోతాదులో డి విటమిన్ అందేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
విటమిన్ 'డి' తక్కువైతే ఇన్ని సమస్యలా! సొల్యూషన్ ఏంటో తెలుసా?
డైలీ ఇలా చేస్తే విటమిన్ డి పుష్కలం :
పిల్లల ఎదుగుదలలో ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాబట్టి వారు ఆరోగ్యంగా, దృఢంగా ఎదగాలంటే పిల్లల డైలీ డైట్లో సరైన పోషకాహారం ఉండేలా చూసుకోవడం చాలా అవసరమంటున్నారు పోషకాహార నిపుణులు. అందులో ముఖ్యంగా విటమిన్ డి తగినంత అందాలంటే రోజూ వారికిచ్చే ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, కొన్ని రకాల పండ్లు, తృణధాన్యాలను తప్పక చేర్చాలంటున్నారు. ఎందుకంటే.. వీటిల్లో డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది.
అంతేకాదు.. రోజూ కచ్చితంగా కాసేపైనా చిన్నారులు ఆరుబయట ఆడుకునేలా చూడాలని చెబుతున్నారు. ప్రధానంగా ఎండలో చర్మం చురుక్కు మనేవరకూ ఉండనివ్వాలి. అంటే.. సుమారు ఇరవై నిమిషాల నుంచి గంట వరకూ సమయం పట్టొచ్చంటున్నారు. అప్పుడే.. శరీరానికి తగినంతగా విటమిన్ డి అందుతుంది. ఎముకలు బలం పుంజుకునేలా చేస్తుందంటున్నారు నిపుణులు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
విటమిన్-డి మాత్రలు ఎక్కువగా వాడేస్తున్నారా?.. ఆ '10' లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే!