Symptoms Of Vitamin B12 Deficiency : ప్రస్తుతం ఎంతో మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా ఎన్నో ఆరోగ్య సమస్యలతో రోజూ సతమతమవుతున్నారంటున్నారు. ఈ విటమిన్ లోపం తలెత్తితే.. వెంటనే తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇంతకీ, విటమిన్ బి12(Vitamin B12) లోపం ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? దాని నుంచి ఎలా బయటపడాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శరీరానికి విటమిన్ ఎ, సి, ఇ మాదిరిగానే విటమిన్ బి12 కూడా చాలా ముఖ్యమని సూచిస్తున్నారు. దీనినే 'కోబాలమిన్' అని కూడా పిలుస్తారు. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో విటమిన్ B12 కీలక పాత్ర పోషిస్తుంది. కేంద్రనాడీ వ్యవస్థ మెరుగ్గా పని చేయడంలో, ఎముకలు, కండరాలను బలోపేతం చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతటి కీలకమైన విటమిన్ లోపిస్తే.. శరీరంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో పరిశీలిస్తే..
- అరికాళ్లలో మంట
- నోటి పూత, ఆకలి తగ్గడం
- అలసట, బలహీనత
- వికారం, వాంతులు కావడం
- కాళ్లు, చేతులు తిమ్మిర్లు రావడం
- మైకం కమ్మినట్లు అనిపించడం
- రక్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోవడం
- మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ఇబ్బందిపెడతాయి
- రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి గుండె వేగంగా కొట్టుకుంటుంది
- చిగుళ్లు, నాలుక వాపు రావడం.. దీనివల్ల నిరంతరం నొప్పిగా అనిపించడం
- చేతులు, పాదాలు, కండరాలలో నొప్పి అనిపించడం
- ఎర్ర రక్తకణాల ఉత్పత్తి సరిగ్గా లేకపోతే రక్తహీనత సమస్య ఏర్పడుతుంది
- కళ్లు, శరీరం కొంచెం పసుపు రంగులోకి మారతాయి
- కామెర్లు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంటున్నారు నిపుణులు.
మీకు విటమిన్ బి12 లోపం ఉందా? - ఇలా చేస్తే ఇట్టే భర్తీ అయిపోతుంది!
వెంటనే ఆ పరీక్ష చేయించుకోండి : కాబట్టి, మీలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబంధిత వైద్యులను సంప్రదించడం మంచిదంటున్నారు. అంతేకాకుండా.. "విటమిన్ బి12 పరీక్ష" చేయించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే.. ఈ విటమిన్ లోపాన్ని భర్తీ చేయడానికి పాలు, పాల ఉత్పత్తులు, కొవ్వు చేపలు, మాంసం, గుడ్లు, పాలకూర, బీట్రూట్, చీజ్ వంటి ఆహార పదార్థాలను డైట్లో చేర్చుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
2013లో "న్యూరాలజీ" జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. విటమిన్ బి12 లోపం ఉన్న వ్యక్తులు అరికాళ్లలో మంటకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో నార్వేలోని ఓస్లో విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ మోనికా క్రాస్ పాల్గొన్నారు. బాడీలో బి12లోపించడం వల్ల అరికాళ్లలో మంట, కాళ్లు, చేతులు తిమ్మిర్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.