Type 2 Diabetes New Research: టైప్ 2 డయాబెటిస్ రోగులకు అద్భుతమైన శుభవార్త. ఇకపై ఇన్సులిన్ అవసరం లేకుండా డయాబెటిస్ తగ్గించే చికిత్స విధానాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ReCET (Re-Cellularization via Electroporation Therapy)తో పాటు semaglutideను కలిపి, ఈ కొత్త చికిత్స విధానాన్ని ఆవిష్కరించారు. టైప్ 2 డయాబెటిస్ రోగులపై చేపట్టిన ఈ పరిశోధనలో.. 86శాతం మందిలో సత్ఫలితాలు కనిపించినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. "UEG Week 2024" పేరిట నిర్వహించిన కార్యక్రమంలో.. ఈ కొత్త చికిత్స విధానాన్ని వెల్లడించారు.
ఈ పరిశోధన ఫలితాలు చాలా అనందాన్ని ఇచ్చాయని అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్ Celine Busch తెలిపారు. ReCET చికిత్స విధానం చాలా సురక్షితమైనదని, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్సూ ఉండవని.. దీంతోపాటు semaglutide ను కలిపితే అద్భుతమైన ఫలితాలను వచ్చాయని వెల్లడించారు. వీటిని సంయుక్తంగా ఉపయోగిస్తే ఇన్సులిన్ థెరపీ అవసరం లేకుండా చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ పరిశోధన ట్రయల్స్‌లో ఉందని.. పూర్తి స్థాయి ఫలితాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. విస్తృత స్థాయిలో మరిన్ని పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తునున్నామని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల కంటే ఇది చాలా ఉత్తమంగా పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు.
ఈ పరిశోధనలో భాగంగా 28-75 మధ్య వయసు, 24-40 kg/m2 BMI (Body Mass Index) గల 14 మందిపై ట్రయల్స్ నిర్వహించారట. ఇందులో ప్రతి వ్యక్తికీ మత్తు మందు ఇచ్చి ReCET చికిత్సను చేపట్టగా.. అద్భుతమైన ఫలితాలు వచ్చాయని పరిశోధకులు తెలిపారు. ఈ చికిత్సతో శరీరం తానంతట తానే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసుకుందని వివరించారు. ఆ తర్వాత 2 వారాలు లిక్విడ్ డైట్ పాటించగా.. semaglutide స్థాయులు క్రమంగా తగ్గినట్లు వెల్లడించారు. 6-12 వారాల తర్వాత పరిశీలిస్తే 86శాతం మందిలో ఇన్సులిన్ థెరపీ అవసరం లేకుండా పోయిందని చెప్పారు. 24 వారాల తర్వాత అందరిలోనూ గ్లైసిమిక్ అదుపులో ఉందని, HbA1c స్థాయులు 7.5 శాతానికి తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 422 మిలియన్ ప్రజలు టైప్ 2 డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారని అంచనా. వీరికి ప్రధానంగా ఉపయోగించే చికిత్సలో ఇన్సులిన్ థెరపీ ఒకటి. ఇది రోగుల రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. అయితే.. ఈ విధానం వల్ల ఊబకాయం లాంటి అనేక దుష్ప్రభావాలు వస్తుంటాయని నిపుణులు ఇప్పటికే తెలిపారు. ఈ కొత్త చికిత్స విధానం అందుబాటులోకి వస్తే.. షుగర్ బాధితులకు ఇన్సులిన్ కష్టాలు తొలగిపోతాయని చెబుతున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
డయాలసిస్ రోగులు ఏం తినాలి? - డాక్టర్లు సూచిస్తున్న డైట్ ఇదే!
హైబీపీతో బాధపడుతున్నారా? - రోజూ ఈ ఫుడ్ తీసుకుంటే రక్తపోటు కంట్రోల్ అవుతుందట!