Tomatoes Health Benefits : ప్రతి వంటింట్లో టమాటాలు కచ్చితంగా ఉంటాయి. అయితే.. నిత్యం మనం కూరలు వండటానికి ఉపయోగించే టామాటాలను తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని సమస్యలు ఉన్న వారు వీటిని ఎక్కువగా తినకూడదని సూచిస్తున్నారు. మరి, రోజూ టమాటాలు తినడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? ఇప్పుడు చూద్దాం.
రోజూ తింటే ఎన్నో లాభాలు!
- టమాటాల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడతాయి.
- అలాగే టమాటాల్లో ఉండే లైకోపీన్, బీటా కెరోటిన్, విటమిన్ సి, ఫైబర్ వంటివి గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయని నిపుణులంటున్నారు. కాబట్టి, వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలని పేర్కొంటున్నారు.
- టమాటాల్లో ఉండే కొన్ని రకాల ఔషధ గుణాలు క్యాన్సర్‌ను కూడా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
- వీటిల్లో విటమిన్ సి, కె, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
- విటమిన్ కె రక్తం గట్టకట్టకుండా ఉండేలా చేస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
- టమాటాల్లో క్యాలరీలు తక్కువగా ఉండి, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిని రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుందట.
- అందుకే అధిక బరువుతో బాధపడేవారు వీటిని డైలీ ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పరిశోధన వివరాలు :
2019లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్' జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజుకు రెండు టమాటాలు తిన్న వారు బరువు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని 'హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్' లో పోషకాహార ప్రొఫెసర్ డాక్టర్ డానా సిమ్మోన్స్ పాల్గొన్నారు. రోజూ టమాటాలు తినడం వల్ల బరువు తగ్గుతారని ఆయన పేర్కొన్నారు.
టమాటాలు ఎక్కువకాలం ఫ్రెష్‌గా ఉండాలా? - ఇలా చేస్తే చాలా రోజులు ఉంటాయి!
టమాటాలు ఎక్కువగా తింటే నష్టమే!
- రోజూ టామాటాలు తినడం వల్ల ఎన్ని లాభాలున్నా కూడా.. వీటిని ఎక్కువగా తినడం వల్ల కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులంటున్నారు.
- టమాటాలు ఎక్కువగా తినడం వల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు వస్తాయట.
- అలాగే ఎక్కువగా తీసుకోవడం పోషకాహార అసమతుల్యతకు దారితీస్తుందని చెబుతున్నారు.
- కిడ్నీలో రాళ్లు, మూత్ర సంబంధిత సమస్యలతో బాధపడేవారు, అలాగే కొన్ని ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులు సూచించిన ప్రకారం టమాటాలను తినడం మంచిదని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.