How To prevent Forehead Wrinkles : ప్రస్తుత కాలంలో కొంతమందిలో చిన్న వయసులో ఉండగానే ముఖంపై ముడతలు, గీతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నుదుటి మీద కనిపించే గీతల కారణంగా చాలామంది వయసు పైబడిన వారిలా కనిపిస్తున్నారు. అయితే, ఇలా చిన్న వయసులోనే ముడతలు రావడానికి కారణాలు ఏంటి ? ముడతలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ? అనేది ఇప్పుడు చూద్దాం.
కారణాలు :
వయసు పెరిగే కొద్దీ స్కిన్ పొడిబారి మృదుత్వాన్ని కోల్పోతుంది. దీనివల్ల నుదుటిపై సన్నని గీతలు మొదలవడంతో పాటు.. కళ్ల చుట్టూ ఉండే చర్మం ముడుచుకుపోతుంటుందని నిపుణులంటున్నారు. అయితే.. ఈ లక్షణాలు కొందరిలో చిన్న వయసులోనే కనిపిస్తుంటాయి. వీటిని 'ప్రీమెచ్యూర్ రింకిల్స్' అంటారు.
- బాగా తెల్లగా ఉన్న వారిలో, స్కిన్ పల్చగా ఉన్న వారిలో ముడతలు చిన్న వయసులో వస్తుంటాయి.
- అలాగే ఎండలో ఎక్కువగా తిరిగే వారిలో, కొందరిలో వంశపారంపర్యంగానూ ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి.
- కొంతమంది చీటికీ మాటికీ నుదురు చిట్లిస్తుండడం, అదే పనిగా కనుబొమ్మల్ని పైకి ఎగరేయడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కూడా నుదుటి మీద గీతలు వచ్చే అవకాశం ఉంటుందట!
- అలాగే డ్రై స్కిన్ ఉన్నవారు, సౌందర్య పద్ధతుల్లో భాగంగా బ్లీచింగ్ ఎక్కువగా వాడే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందట!
నీళ్లు ఎక్కువగా తాగాలి :
మన శరీరానికి సరిపడా నీళ్లు తాగకపోతే చర్మం పొడిబారుతుంది. దీనివల్ల నుదుటి మీద పెద్ద పెద్ద గీతలు, ముడతలు ఏర్పడతాయి. అందుకే సరిపడా నీటిని తాగాలి. అలాగే వర్కవట్లు చేసే వారు ఇంకా ఎక్కువగా నీళ్లను తాగాలని నిపుణులు చెబుతున్నారు. వీలైతే నీటితోపాటు నిమ్మరసం, కొన్ని రకాల పండ్ల రసాలను తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
మెడపై ముడతలు ఎబ్బెట్టుగా కనిపిస్తున్నాయా? - ఇలా చేస్తే ఈజీగా తగ్గిపోతాయి!
సన్ స్క్రీన్ లోషన్ :
స్కిన్‌పై ఎండ ఎక్కువగా పడితే కొలాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీంతో నుదుటి మీది చర్మం కమిలిపోయి నల్లగా మారుతుంది. అలాగే ముడతలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి, బయటకు వెళ్లే ముందు తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం వల్ల ముడతలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.
2019లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ' జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. రోజూ సన్ స్క్రీన్ ఉపయోగించడం వల్ల ముఖంపై ముడతలు వచ్చే అవకాశం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డెర్మటాలజీస్ట్ 'డాక్టర్ క్రిస్టిన్ కింగ్' పాల్గొన్నారు.
ఒత్తిడి తగ్గించుకోండి :
విపరీతమైన ఆందోళన, ఒత్తిడి వల్ల కూడా నుదుటిపై ముడతలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని అదుపులో పెట్టుకోవడానికి యోగా, మెడిటేషన్ వంటి అలవాట్లను చేసుకోవాలి. అలాగే సమతుల ఆహారం తీసుకుంటూ రోజూ కనీసం ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి.
- రోజూ తీసుకునే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే గ్రీన్ టీ, పాలకూర, వాల్‌నట్స్, చిలగడ దుంప, బ్లూ బెర్రీ వంటి వాటిని తీసుకోవాలి.
- అలాగే ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా చర్మం పొడిబారకుండా చూసుకోవచ్చు. దీనివల్ల నుదుటి మీద ముడతలు ఏర్పడకుండా, ఒకవేళ వచ్చినా సమస్య పెరగకుండా కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
- స్మోకింగ్ అలవాటుకు దూరంగా ఉండాలి.
- కొన్ని ఫేషియల్ ఎక్సర్‌సైజులు, వర్కవుట్లతో చేయడం వల్ల ముడతలు పెరగకుండా జాగ్రత్త పడచ్చు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చూడండి :
అలర్ట్ : చర్మ సౌందర్యం కోసం ఐస్ ఫేషియల్ వాడుతున్నారా? - ఇది తెలుసుకోకపోతే అనర్థాలు తప్పవు!
పాపం ముఖం మీది ఈ మచ్చలు బాధిస్తున్నాయా? - ఈ నేచురల్ టిప్స్‌తో ముఖం మిలమిలా మెరిసిపోద్ది!