Tips to Prevent the Apple Slices from Colour Change: రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేదన్నది నిపుణుల మాట. కారణం.. ఇందులోని పోషకాలు అందించే ప్రయోజనాలే. అయితే యాపిల్‌ను కట్ చేసిన కొద్దిసేపటికే రంగు మారుతుంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం ఉండదు. అయితే యాపిల్ ఇలా రంగు మారడానికి కారణం.. దాని గుజ్జులోని పాలీఫినోల్ ఆక్సిడేస్ అనే ఎంజైమ్. ఈ ఎంజైన్ గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరిపి గుజ్జును బ్రౌన్ కలర్‌లోకి మారుస్తుంది. ఎంతో ఇష్టంగా తిందామని అనుకుంటే.. రంగు మారిన కారణంగా వాటిని అస్సలు తినాలనిపించదు. అలాంటి సమయంలో ఈ టిప్స్ పాటిస్తే గంటల పాటు రంగు మారకుండా తాజాగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. అవేంటంటే..
నిమ్మరసం: యాపిల్ ముక్కలు రంగు మారకుండా ఉండాలంటే నిమ్మరసం బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు అంటున్నారు. అందుకోసం.. కట్ చేసిన యాపిల్ ముక్కలపై కొన్ని చుక్కల నిమ్మరసాన్ని స్పే చేయాలి. నిమ్మరసంలోని సిట్రిక్ ఆమ్లం యాపిల్ ముక్కలను ఎక్కువసేపు తాజాగా ఉంచడమే కాకుండా.. వాటిని రంగు మారనివ్వదని అంటున్నారు.
ఈ పద్ధతి కూడా ట్రై చేయవచ్చు. కప్పు నీటిలో టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో యాపిల్ ముక్కల్ని ఐదు నిమిషాల పాటు ఉంచినా చక్కటి ఫలితం ఉంటుందని అంటున్నారు. నిమ్మరసం ప్లేస్‌లో పైనాపిల్ జ్యూస్‌ను ఉపయోగించినా అదే ఫలితాన్ని పొందవచ్చని సూచిస్తున్నారు.
2009లో జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం యాపిల్ ముక్కలపై నిమ్మరసం చల్లడం వల్ల ముక్కల రంగు మారలేదని.. 4 గంటల వరకు తాజాగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని Zhejiang University లోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న డాక్టర్ X. Wang పాల్గొన్నారు.
ఐస్:యాపిల్ ముక్కలను ఫ్రెష్‌గా ఉంచడంలో ఐస్ సూపర్‌గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి, కట్ చేసిన యాపిల్ ముక్కలను ఐస్ నీళ్లలో కొన్ని నిమిషాల పాటు ఉంచి, బయటకు తీయాలి. ఇలా చేయడం వల్ల యాపిల్ ముక్కలు కాసేపటి వరకు తాజాగా ఉంటాయని అంటున్నారు.
తేనె: ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే తేనె.. .యాపిల్ ముక్కల్ని రంగు మారకుండా తాజాగా ఉంచడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం ఒక కప్పు మంచి నీళ్లలో, రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. ఇప్పుడు ఈ నీటిలో యాపిల్ ముక్కలు వేసి కొన్ని నిమిషాల పాటు ఉంచి తీసేయాలి. ఇలా చేయడం వల్ల, యాపిల్ ముక్కలు ఎక్కువసేపు తాజాగా ఉంటాయంటున్నారు.
దాల్చిన చెక్క పొడి: దాల్చిన చెక్క పొడిని కట్ చేసిన యాపిల్ ముక్కలపై చల్లడం వల్ల ఆ ముక్కలు రంగు మారకుండా జాగ్రత్తపడచ్చని అంటున్నారు. ఇందుకు దాల్చిన చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లే కారణం. అలాగే దాల్చిన చెక్క పొడి వల్ల యాపిల్ ముక్కలకు మరింత రుచి చేకూరుతుంది.
జిప్‌లాక్ బ్యాగ్: కట్ చేసిన యాపిల్ ముక్కలు ఎర్రగా మారకుండా ఎక్కువసేపు తాజాగా ఉండాలంటే వాటిని జిప్‌లాక్ బ్యాగ్‌లో బంధించాల్సిందే అని అంటున్నారు. యాపిల్‌ని ముక్కలుగా కట్ చేసిన తర్వాత వెంటనే వాటిని జిప్ లాక్ బ్యాగ్‌లో పెట్టి అందులో గాలి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాగ్‌ను అలాగే ఫ్రిజ్‌లో పెట్టేయాలి. ఫలితంగా యాపిల్ ముక్కలు ఎర్రబడకుండా జాగ్రత్తపడచ్చు.