Things To Do Before 7 AM : మనలో చాలా మంది ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేవాలని అలారం పెట్టుకుంటారు. అది సరైన టైమ్‌కు మోగినా లేవాలని అనిపించదు. దీంతో అలారం కట్టేసి మళ్లీ నిద్రపోతుంటారు. తర్వాత మళ్లీ అలారం మోగితే ఎంతో బద్ధకంగా నిద్రలేస్తుంటారు. అయితే, జీవితంలో సక్సెస్ అయిన వారందరూ వేకువజామున నిద్రలేచిన వారేనని నిపుణులు చెబుతున్నారు.
కానీ.. ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది వివిధ కారణాల వల్ల తెల్లవారుజామున నిద్రలేవట్లేదు. అయితే.. ఇలాంటి వారు లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి ఉదయం 7 గంటలలోపు లేచి కొన్ని పనులు చేయాలని నిపుణులంటున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండటంతో పాటు, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని చెబుతున్నారు. మరి, ఉదయం 7 గంటలలోపు చేయాల్సిన పనులు ఏంటో మీకు తెలుసా??
నీళ్లు తాగండి : మెజార్టీ జనాలకు ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగే అలవాటు ఉండదు! కానీ, ఉదయం 7 గంటలలోపు కనీసం ఒక రెండు గ్లాసుల నీటిని తాగాలని సూచిస్తున్నారు. ఒకవేళ మీరు తొందరగా బ్రష్ చేసుకుంటే, గోరువెచ్చని నీటిలో నిమ్మరసం లేదా తేనె యాడ్ చేసుకుని తాగితే ఇంకా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే నీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని తెలియజేస్తున్నారు.
వ్యాయామం చేయండి : మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి ఉదయం 7 గంటలలోపు కనీసం 20 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. రోజూ ఇలా వ్యాయామం చేయడం వల్ల బాడీ ఫ్లెక్సిబుల్‌గా, ఫిట్‌గా ఉంటుందని నిపుణులంటున్నారు. అలాగే వ్యాయామం చేయడం వల్ల బరువు పెరగకుండా ఉండవచ్చని పేర్కొన్నారు.
ఇంటర్నెట్‌కు దూరంగా ఉండండి : కొంత మంది ఉదయం నిద్రలేవగానే ఫోన్‌లో వాట్సాప్ చూడటం, ఈమెయిల్స్ చెక్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే, ఇలా అస్సలు చేయకూడదని నిపుణులంటున్నారు. ఇలా ఫోన్ వాడటం కంటే కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడటం, కలిసి వ్యాయామం చేయడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. ఉదయాన్నే ఫోన్ ఎక్కువసేపు చూడటం వల్ల మానసిక ఆందోళన కలుగుతుందని చెబుతున్నారు.
యోగా, ధ్యానంతో ఎంతో లాభం : ఉదయాన్నే 7 గంటలలోపు కనీసం పది నుంచి 20 నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయాలి. ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి కావాల్సిన శక్తిని యోగా, ధ్యానం అందిస్తాయని తెలియజేస్తున్నారు. కాబట్టి, ఈ రోజు నుంచైనా యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి.
చదవండి : మీకు వీలైతే రోజూ ఉదయం 7 గంటలలోపు ఒక న్యూస్ పేపర్‌ను గానీ లేదా మీకు నచ్చిన పుస్తకాన్ని చదవండి. ఇలా ఉదయాన్నే చదవడం వల్ల ఆలోచన తీరు మారుతుందని నిపుణులు చెబుతున్నారు. పుస్తక పఠనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలియజేస్తున్నారు.
హెల్దీ బ్రేక్‌ఫాస్ట్ : మనం రోజంతా చురుకుగా, ఉత్సాహంగా ఉండటంలో బ్రేక్‌ఫాస్ట్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి, ఉదయం 7 గంటలలోపు మంచి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌ను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ఉదయాన్నే అల్పాహారం తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని పేర్కొన్నారు.
ప్లాన్ చేసుకోండి : ప్రతి ఒక్కరూ డైలీ ఎన్నో రకాల పనులు చేయాల్సి ఉంటుంది. అలాగే వారి ఉద్యోగ, వ్యాపార పనుల నిమిత్తం కొత్తకొత్త ప్రదేశాలకు వెళ్లాల్సి రావొచ్చు. అయితే, ఇలా రోజంతా బిజీ షెడ్యూల్ ఉండేవారు ఈ రోజు ఎక్కడికి వెళ్లాలి ? ఎవరెవరిని కలవాలి ? ఏ పని చేయాలి ? అని మొత్తం ప్రణాళికలను ఉదయం 7 గంటలలోపు సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల రోజంతా ఈజీగా ఉంటుందని చెబుతున్నారు.
ఇవండీ, ఉదయం 7 గంటలలోపు చేయాల్సిన పనులు! సాధ్యమైనంత వరకు మీరు పైన తెలిపిన వాటిని పాటిస్తే మీరు జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలుంటాయని నిపుణులంటున్నారు.