These Problems Risk Higher In Womens : ఇంట్లో పని ఎక్కువ అవ్వడం, కాస్త బలహీనంగా ఉంటామనే ఉద్దేశంతో ఎలాంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా లైట్ తీసుకుంటుంటారు మహిళలు. కానీ, అలా నిర్లక్ష్యంగా ఉండడం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. కొన్ని ఆరోగ్య సమస్యలు పురుషలలో కంటే మహిళలనే ఎక్కువ పీడిస్తున్నాయట. వాటికి తక్షణమే చికిత్స తీసుకోకుంటే భవిష్యత్తులో ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చంటున్నారు. ఇంతకీ, మగవారి కంటే ఆడవారిని ఎక్కువ ఇబ్బందిపెడుతున్న ఆ సమస్యలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మానవ శరీర నిర్మాణం పురుషులు, మహిళలలో వేరువేరుగా ఉంటుంది. దీని కారణంగా ఆరోగ్యపరంగా ఇద్దరూ విభిన్న పరిస్థితులను ఎదుర్కొంటుంటారు. అయితే, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి కారణంగా పురుషుల కంటే మహిళల్లో వివిధ ఆరోగ్య సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుందట. మగవారితో పోల్చితే ఆడవారు ఒకింత ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారని ఇటీవల పరిశోధనలు కూడా వెల్లడిస్తున్నాయి. మహిళల్లో 70 శాతం ఆరోగ్య సమస్యలు ఒత్తిడి మూలంగానే వస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి.
ముఖ్యంగా.. హార్మొనల్ ప్రభావం, సున్నిత మనస్తత్వం, వివిధ రకాల బాధ్యతలుండటం, పెరిగిన వాతావరణంతో మహిళలు అధిక ఒత్తిడితో సతమతం అవుతారని క్లినికల్ సైకియాట్రిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి చెబుతున్నారు. అలాగే.. ఆడవారిలో ఈస్ట్రోజన్, పొజిస్ట్రాన్, బ్రెయిన్‌లో ఉండే కార్టికల్ స్ట్రక్చర్, న్యూరో కెమికల్, న్యూరో ఎండోక్రైన్ సిస్టం భిన్నంగా ఉంటాయంటున్నారు. అందుకే వారు తొందరగా ఒత్తిడికి లోనవుతారని చెబుతున్నారు. అలా.. పెరిగిన ఒత్తిడి వారిని వివిధ ఆరోగ్య సమస్యల బారిన పడేలా చేస్తుందంటున్నారు.
అలర్ట్ : థైరాయిడ్ ఉంటే గర్భం ధరించలేరా? - వైద్యులు ఏమంటున్నారో తెలుసా!
ఈ సమస్యలతో ఆడవారు జాగ్రత్త! : సాధారణంగా ఎప్పుడైనా ఒకసారి కాలు, చేయి నొప్పి వస్తేనే మగవాళ్లు అల్లాడిపోతుంటారు. కానీ, వెన్నునొప్పి, ఆస్టియో ఆర్థరైటిస్, తలనొప్పి, మైగ్రెయిన్.. వంటి దీర్ఘకాలిక నొప్పులు ఆడవాళ్లను అతలాకుతలం చేస్తున్నాయట. ఈ సమస్యలతో మగవారి కంటే ఆడవాళ్లే ఎక్కువ ఇబ్బందిపడుతున్నారట. అంటే.. పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఈ సమస్యల బారినపడుతున్నారట. దీర్ఘకాలంగా కొనసాగే ఈ ప్రాబ్లమ్స్‌తో ఆడవారు నాణ్యమైన జీవనాన్ని గడపలేకపోతున్నారట.
అంతేకాదు, లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన కొన్ని అధ్యయనాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు ఈ నొప్పులను పంటి బిగువన భరిస్తున్నారనీ, సరైన వైద్యం అందేవారు చాలా తక్కువ అని కూడా వెల్లడైంది! అయితే, ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో కుంగుబాటు, నిద్రలేమి, హృద్రోగాలు వంటి అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, మీరూ ఇలాంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఈ 5 రకాల బాడీ పెయిన్స్లో ఏది కనిపించినా అలర్ట్ కావాల్సిందే - గుండెపోటు సంకేతం కావొచ్చట!