Health Benefits of Soaked Walnuts : ఈరోజుల్లో చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా డైలీ డైట్లో వివిధ రకాల పండ్లు, నట్స్, సీడ్స్ ఉండేలా చూసుకుంటారు. వీటితో పాటు డ్రైఫ్రూట్స్ కూడా తీసుకుంటుంటారు. అందులో వాల్నట్స్ చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. పోషకాలు పుష్కలంగా ఉండే వీటిని తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే వీటిని డ్రై ఫ్రూట్స్‌లో రారాజు అని కూడా పిలుస్తారు.
అయితే, చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. వాల్నట్స్ నేరుగా తింటుంటారు. కానీ, అలాకాకుండా వాటిని నానబెట్టి తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. అందుకు గల కారణాలను వివరిస్తున్నారు. ఇంతకీ, వాల్‌నట్స్‌లో(Walnuts) ఎలాంటి పోషకాలుంటాయి? వాటిని నానబెట్టి ఎందుకు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వాల్ నట్స్‌లో ఉన్న పోషకాలు : వాల్‌నట్స్‌లో ఫైబర్, విటమిన్ ఇ, ఫోలేట్, మెగ్నీషియం, పాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పెంచడంలో, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందంటున్నారు. అంతేకాకుండా.. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లతో సహా మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే వీటిలో మొక్కల ఆధారిత ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.
అలాగే.. వాల్‌నట్స్‌లో ఉండే పోషకాలు జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా మంచివి అంటున్నారు నిపుణులు. ఇవి బరువు నిర్వహణలో సహాయపడుతాయని చెబుతున్నారు. ఈ గింజలలో ఉండే పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడంలో, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే వాల్నట్స్ ఎందుకు నానబెట్టి తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఎక్కువ మొత్తంలో పోషకాలు అందుతాయి : వాల్‌నట్‌లను నానబెట్టి తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ ప్రక్రియ వాల్నట్లలో ఉండే ఎంజైమ్ ఇన్హిబిటర్లు, ఫైటిక్ యాసిడ్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది. ఫలితంగా విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాల జీవ లభ్యత మెరుగుపడి ఎక్కువ మొత్తంలో పోషకాలు అందుతాయని సూచిస్తున్నారు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది : వాల్‌నట్‌లను నానబెట్టి తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపర్చడంలో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. నానబెట్టడం వల్ల వీటిలోని పోషకాల శోషణ పెరుగుతుంది. ఫలితంగా జీర్ణక్రియ రేటు మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. అలాగే.. వాల్‌నట్‌లను నానబెట్టి తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు తగ్గుతాయని, జీర్ణ రుగ్మతలను సరిచేస్తుందని అంటున్నారు.
2016లో 'Journal of Agricultural and Food Chemistry'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. వాల్‌నట్స్‌ను 24 గంటల పాటు నీటిలో నానబెట్టిన తర్వాత వాటిని తినడం వల్ల ఫైబర్ శోషణ, జీర్ణక్రియ మెరుగుపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో డాక్టర్ X. Wang పాల్గొన్నారు. వాల్నట్స్ నానబెట్టి తీసుకోవడం వల్ల పోషకాల శోషణ పెరిగి జీర్ణక్రియ మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.
అమ్మలూ ఇవి తినండి - మీరు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది! - Healthy Nuts For Women
చేదు తగ్గుతుంది : వాల్‌నట్‌లను నానబెట్టి తీసుకోవడం వల్ల కలిగే మరో ప్రయోజనమేమిటంటే.. ఈ ప్రక్రియ వాటి చేదును తగ్గించడంలో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అలాగే వాటిని తినడానికి మరింత రుచికరంగా చేస్తుందని సూచిస్తున్నారు. వాల్నట్స్ చేదుగా ఉంటాయని తినడానికి ఇష్టపడనివారికి ఇది చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు.
ఆకృతి మెరుగుపడుతుంది : వాల్‌నట్‌లను నానబెట్టడం వల్ల అవి మృదువుగా మారి నమలడం ఈజీ అవుతుంది. అలాగే జీర్ణక్రియ సులభం అవుతుంది. ముఖ్యంగా దంత సమస్యలు ఉన్నవారికి లేదా మృదువైన ఆకృతిని ఇష్టపడే వారికి ఇది ప్రత్యేకంగా సహాయపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
అలర్జీ కారకాలు తగ్గుతాయి : వాల్‌నట్‌లను నానబెట్టి తీసుకోవడం అలర్జీ కారకాలను తగ్గించడంలో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అంటే.. కొంతమందిలో వాల్‌నట్‌లను నేరుగా తీసుకోవడం వల్ల అందులో ఉండే టానిన్లు అలర్జీలను కలిగించవచ్చు. కాబట్టి వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల అవి తగ్గుతాయి. ఫలితంగా అలర్జీ ప్రతిచర్యలు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నెలరోజుల పాటు డైలీ నట్స్ తింటే - మీ శరీరంలో జరిగే మార్పులివే! - Benefits of Eating Nuts Daily