Side Effects of Placing Cooking Oil Bottle Beside Gas Stove: ఇళ్లలో గ్యాస్ స్టవ్ పక్కనే కుకింగ్ ఆయిల్ బాటిల్ ఉండటం కామన్. వందలో తొంభై మంది ఇలానే పెడుతుంటారు. కారణం.. తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సమయం ఆదా చేస్తుంది. అవసరమైనప్పుడు వెతకాల్సిన పని ఉండదు. మరి మీకు కూడా గ్యాస్ స్టవ్ దగ్గర వంటనూనె పెట్టే అలవాటు ఉంటే అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఈ అలవాటు అనేక ప్రమాదాలకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఆక్సీకరణ: గ్యాస్ స్టవ్ దగ్గర ఆయిల్ బాటిళ్లను ఉంచడం వల్ల నూనెలోని కొవ్వు ఆమ్లాలు గాలిలోని ఆక్సిజన్‌తో చర్య జరపడం వల్ల రాన్సిడ్ నూనెగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఇది క్యాన్సర్ కణాల పుట్టుకకు దారితీస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవే కాకుండా ఇతర సమస్యలు కూడా వస్తాయంటున్నారు.
వంట నూనెలు అధిక కొవ్వు పదార్థాలతో ఉంటాయి. మీరు బాటిల్ లేదా ప్యాకెట్ తెరిచిన వెంటనే నూనెలు రసాయన ప్రక్రియకు లోనవుతాయి. అధిక ఆక్సీకరణ కారణంగా దీనిలో మార్పులు వస్తాయి. మీ శరీరంలో రాన్సిడ్ ఆయిల్ చేరడం అకాల వృద్ధాప్యం, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, భారీగా బరువు పెరగడానికి దారితీస్తుందని అంటున్నారు. అలాగే స్టవ్ దగ్గర నూనె వదిలేస్తే టైప్-2 డయాబెటిస్, అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. 2016లో జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రాన్సిడ్ నూనె టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో న్యూట్రిషన్ ప్రొఫెసర్ డాక్టర్ జాన్ స్మిత్ పాల్గొన్నారు.
వంట నూనెను ఎలా నిల్వ చేయాలి? మీరు ఏ నూనెను వాడుతున్నారో దాన్నిబట్టి నిలువ చేసే పద్ధతులు ఆధారపడి ఉంటాయని నిపుణులు అంటున్నారు.
వెజిటబుల్ ఆయిల్స్: ఈ నూనెల నాణ్యతను కాపాడుకోవడానికి చల్లని ప్రదేశాల్లో ఉంచాల్సిన అవసరం ఉందని.. అలా అని దీనిని ఫ్రిజ్లో పెట్టాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. కిచెన్‌లో ఏ ప్రాంతంలో చల్లగా అనిపిస్తుందో... ఆ ప్రాంతంలో పెట్టమని.. కాస్త చీకటిగా ఉండే ప్రదేశంలో పెడితే మంచిదని అంటున్నారు. స్టవ్ పక్కన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదని.. గాలి, వెలుతురు ఈ నూనెలకు అధికంగా తగలకూడదని అంటున్నారు.
విత్తనాల నూనె: బాదం నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇవన్నీ కూడా గింజల నుంచి ఉత్పత్తి చేసినవి. అయితే ఈ నూనె ఎప్పుడైతే వేడికి గురవుతుందో అప్పుడు వాటిలో ఆక్సీకరణం, రాన్సిడిటీ ప్రారంభమవుతాయి. కాబట్టి వీటిని తాజాగా ఉంచడం కోసం రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయవచ్చని అంటున్నారు. ఈ నూనెలను గాలి చొరబడని కంటైనర్లలోనే ఉంచాలని.. కాంతి అధికంగా పడే చోట, వేడి అధికంగా తగిలేచోట కూడా ఉంచకూడదంటున్నారు.
ఆలివ్ నూనె: ప్రస్తుతం ఆలివ్ నూనె వాడే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. వీటిని కూడా స్టవ్‌కి దూరంగా చల్లటి చీకటి ప్రదేశంలోనే ఉంచితే మంచిదని అంటున్నారు. అలాగే దీన్ని మూత తీసాక మూడు నుంచి 6 నెలలలోపు వినియోగించాలని.. లేదంటే పాడైపోయే అవకాశం ఉందని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.