Side Effects Of Hysterectomy : ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు చిన్నవయసులోనే వివిధ కారణాల వల్ల గర్భసంచిని తొలగించుకుంటున్నారు. అయితే, ఇలా ఎర్లీ ఏజ్‌లోనే గర్భసంచి తొలగించుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి ? గర్భసంచి తొలగించుకోకుండా ఎలాంటి పరిష్కార మార్గాలను అనుసరించవచ్చు? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పీరియడ్స్ టైమ్‌లో ఎక్కువ రోజులు రక్తస్రావం అవుతున్న వారు.. ముందుగా దీనికి గల కారణాన్ని తెలుసుకోవాలి. అలాగే వైద్యులను సంప్రదించి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి. దీని వల్ల ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా? గర్భాశయ పొర ఏమైనా పెరిగిందా? అనే విషయాలు తెలుస్తాయి. అయితే, కొంతమంది మహిళల్లో ఈ సమస్యలేవీ లేకపోయినా థైరాయిడ్ హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల అధిక రక్తస్రావం అవుతుంటుంది. అలాగే.. మరికొంత మందిలో గర్భాశయం లోపల పెల్విక్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంటుందట. కాబట్టి, వీటికి సంబంధించిన పరీక్షలతో పాటు బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల అసలు సమస్యను గుర్తించచ్చంటున్నారు నిపుణులు. అయితే, ఒకవేళ ఈ రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉంటే గర్భసంచి తొలగించుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు.
మీ వయసు 30 దాటుతోందా? - మీ బాడీలో ఈ విటమిన్స్ తగ్గిపోతే అంతే!
గర్భసంచి తీయించుకోవడం వల్ల ఈ అనారోగ్య సమస్యలు వస్తాయి:
చిన్నవయసులో గర్భసంచి తీయించుకోవడం వల్ల దీర్ఘకాలంలో అండాశయాల పనితీరు తగ్గిపోతుంది. ఫలితంగా మోనోపాజ్ త్వరగా వస్తుందని నిపుణులంటున్నారు.
2019లో 'జర్నల్ ఆఫ్ క్లైనికల్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం' జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. చిన్న వయసులో గర్భసంచి తీయించుకున్న మహిళల్లో సాధారణంగా మోనోపాజ్ త్వరగా వస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో యునైటెడ్ స్టేట్స్‌లోని 'బెయ్లర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్'లో పని చేసే డాక్టర్. జె. డబ్ల్యు. డోనాల్డ్సన్ పాల్గొన్నారు. చిన్నవయసులోనే గర్భసంచి తొలగించుకున్న మహిళలల్లో మోనోపాజ్ త్వరగా వస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ పరిష్కార మార్గాలను అనుసరించండి :
- పీరియడ్స్ టైమ్‌లో అధిక రక్తస్రావంతో బాధపడేవారు గర్భాశయంలో కాపర్-టిని అమర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనివల్ల రక్తస్రావం సమస్య 90 శాతం తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
- కొంతమంది మహిళల్లో అధిక రక్తస్రావం లేకపోయినా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటి వారు IUD వేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.