Side Effects Of Eating Execessive Almonds : అతి ఏదైనా అనర్థమే అన్నది ఓ సూక్తి. వ్యాయామం ఆరోగ్యానికి మంచిది. అలాగని అతిగా చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఇదేవిధంగా.. హెల్దీ ఫుడ్స్ తీసుకుంటే ఆరోగ్యం కదా అని అతిగా తినేస్తే నష్టమే అంటున్నారు నిపుణులు! ఎన్నో పోషక విలువలు కలిగిన బాదం పప్పుకు కూడా ఈ సూత్రం వర్తిస్తుందని నిపుణులంటున్నారు.
బాదం తీసుకోవడం వల్ల ఎంత మంచి జరుగుతుందో.. ఎక్కువ తీసుకుంటే కూడా ఆరోగ్యానికి అంతే ముప్పు వాటిల్లొచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా కిడ్నీలో సమస్యలు వస్తాయని అంటున్నారు! నిజంగానే బాదం పప్పును ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయా ? ఇంకా ఇతర సమస్యలు ఏవైనా చుట్టుముడతాయా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం పప్పును రోజూ ఒక గుప్పెడు తీసుకుంటే మెదడు సామర్థ్యం పెరుగుతుందని నిపుణులంటున్నారు. కానీ, పరిమితికి మించి తీసుకుంటే అనర్థాలను కొని తెచ్చుకున్నట్లేనని చెబుతున్నారు.
Side Effects Of Eating Almonds : బాదం పప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు..
దురద, అలర్జీ సమస్యలు..
కొంత మందిలో బాదం పప్పు తినడం వల్ల దురద, అలర్జీ వంటి సమస్యలు కలగవచ్చని నిపుణులంటున్నారు. అలాగే మరికొందరిలో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చట. ఇలాంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
జీర్ణ సంబంధిత సమస్యలు..
బాదం పప్పు తినడం వల్ల శరీరానికి పిండి పదార్థాలు పుష్కలంగా అందుతాయి. ఇది మన జీర్ణ శక్తిని పెంపొందించడంలో ఎంతో సహాయపడుతుంది. అయితే, ఎక్కువ మొత్తంలో బాదం పప్పును తినడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా విరేచానాల వంటి సమస్యలు కలగవచ్చని నిపుణులంటున్నారు. కాబట్టి, బాదం తగినంతనే తినాలని.. అది కూడా బాగా నమిలి తినాలని సూచిస్తున్నారు.
కిడ్నీల్లో రాళ్లు..
అన్ని రకాల గింజలు, విత్తనాల్లాగానే బాదంపప్పుల్లో కూడా ఆక్సాలేట్స్ అనే సహజ రసాయనాలున్నాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులంటున్నారు. అధికంగా బాదం పప్పును తీసుకున్న వారిలో కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని 2015లో యూరాలజీ జర్నల్ ప్రచురించింది. అలాగే ఆక్సలేట్ రసాయనాలు ఎక్కువగా ఉండే గింజలు, విత్తనాలను తీసుకున్న వారిలో.. కిడ్నీలో స్టోన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందని 2014లో అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ క్లినికల్ జర్నల్ వెల్లడించింది. కాబట్టి, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు తక్కువగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
బరువు పెరిగే అవకాశం..
బాదం పప్పులో పోషకాలు, క్యాలరీలు అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులంటున్నారు. కొన్ని రేర్ సందర్భాల్లో బాదంపప్పులో సాల్మొనెల్లా అనే హానికరమైన బ్యాక్టిరియా ఉండే అవకాశం ఉంది. కాబట్టి, మంచి నాణ్యమైన బాదం పప్పును కొనుగోలు చేయండి.
చివరిగా..
సాధారణంగా బాదం పప్పును తీసుకున్న వారిలో ఎటువంటి అనారోగ్య సమస్యలు కనిపించకపోవచ్చు. కానీ, ఎక్కువ మొత్తంలో బాదం పప్పును తీసుకోవడం మంచిది కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. మొత్తంగా రోజులో గుప్పెడు లోపే తినాలని సూచిస్తున్నారు.
పాలు తాగకపోతే కాల్షియం ప్రాబ్లమ్ - ఇలా భర్తీ చేసుకోండి!