Side Effects of Drinking Beer Daily: పార్టీలు.. పండగలు.. అకేషన్ ఏదైనా, సిచుయేషన్ మరేదైనా ఆల్కాహాల్ ఉండాల్సిందే. బీరు ఉప్పొంగాల్సిందే. అయితే.. బీర్లు అతిగా తాగితే ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ బీరు తాగుతుంటే శరీరంలో పలు మార్పులు జరుగుతాయని చెబుతున్నారు. ఇంతకీ డైలీ బీరు తాగడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు పెరగడం పక్కా: డైలీ బీరు తాగడం వల్ల బరువు పెరుగుతారని తద్వారా ఊబకాయం తదితర సమస్యలు వేధిస్తుంటాయని హెచ్చరిస్తున్నారు. 2015లో అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజూ బీరు తాగితే బరువు పెరుగుతారని తర్వాత పలు అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో న్యూ యార్క్ నగరంలోని మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రొఫెసర్ ఆఫ్ న్యూట్రిషన్ డాక్టర్ డేవిడ్ జె. లూడ్విగ్ పాల్గొన్నారు. ఈ పరిశోధనలో 1,000 మందికి పైగా పురుషులు, మహిళలపై 4 సంవత్సరాల పాటు అధ్యయనం నిర్వహించారు. బీరులో ఎక్కువగా ఉండే కేలరీల వల్ల బరువు పెరుగుతారని పరిశోధకులు తేల్చారు.
కాలేయానికి ఎఫెక్ట్: మన శరీర అవయవాల్లో కాలేయం ముఖ్యమైనది. అయితే ఎక్కువగా బీరు తాగడం కాలేయం చెడి పోవడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. రోజూ తాగితే కాలేయ సంబంధిత వ్యాధులు అంటే కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోవడం, ఆల్కహాలిక్ హెపటైటిస్, కాలేయ వాపు వంటి వ్యాధులు వచ్చి.. చివరికి లివర్ పాడయ్యేలా చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
గుండె జబ్బుల ముప్పు: బీరు అధికంగా తాగితే గుండె జబ్బులు వెంటాడతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. యూరోపియన్ హార్ట్ జర్నల్ నివేదిక ప్రకారం.. రోజూ బీరు తాగడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు వస్తాయని.. ఇవి హార్ట్ ఎటాక్‌కి దారి తీస్తాయని సూచిస్తున్నారు.
నిద్ర కరవు: అతిగా ఏది తీసుకున్నా ప్రమాదమే. అలాగే నిత్యం బీరు తాగితే కంటి నిండా నిద్ర కరవవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. క్లినికల్ స్లీప్ మెడిసిన్ జర్నల్ ప్రకారం.. రాత్రి నిద్ర పోయే ముందు బీరు తాగితే సరిగ్గా నిద్ర పట్టదని.. నిద్రకు పూర్తిగా అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.
క్యాన్సర్‌కు వెల్కమ్: బీరు రోజూ తీసుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. నేషనల్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక ప్రకారం.. అతిగా బీరు తీసుకుంటే లివర్, ఛాతి, పెద్ద పేగు, అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇందులో ఉండే ఎథనాల్ అనే పదార్థం మనిషి డీఎన్ఏను పాడు చేసి.. క్యాన్సర్ త్వరగా రావడానికి కారణమవుతుందని కనుగొన్నారు.
ఇతర నష్టాలు:
- రోజూ బీరు తాగడం వల్ల రక్తపోటు పెరుగుతుందని, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
- రోజూ బీరు తాగడం వల్ల పురుషులలో వీర్య కణాల సంఖ్య, నాణ్యత తగ్గుతుందని అంటున్నారు.
- మహిళలలో, రోజూ బీరు తాగడం వల్ల గర్భం ధరించడంలో ఇబ్బంది, గర్భస్రావం, పిల్లలకు లోపాలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
- రోజూ బీరు తాగడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి, ఇన్ఫెక్షన్లకు గురయ్యే ప్రమాదం పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఎముక సాంద్రత తగ్గి, ఆస్టియోపొరోసిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని అంటున్నారు.
- ప్రతిరోజు బీరు తాగడం వల్ల ఆందోళన, నిరాశ, మానసిక స్థితి సమస్యలు పెరుగడంతో పాటు నిద్రలేమి, తలనొప్పి, వికారం, వాంతులు, అతిసారం వంటి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.