Room Shifting Effect On Children : ఉద్యోగం కోసమో, పిల్లలను మంచి స్కూల్లో వేయాలనో.. ఇలా ఇతర కారణాల చేత చాలా మంది ఇళ్లు మారుతుంటారు. కొద్దిమైందేతే రోజుల వ్యవధిలోనే ఇళ్లు షిఫ్టవుతుంటారు. అయితే, ఇలా తరచూ ఇళ్లు మారడం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. ఓ అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. నమ్మలేకున్నారా? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
రీసెర్చ్ వివరాలు : పిల్లల బాల్యంలో.. తరచూ ఇళ్లు మారుతోంటే పెద్దయ్యాక వాళ్లు కుంగుబాటు బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ ప్లైమౌత్కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనా వివరాలు 2024లో "Social Science & Medicine" జర్నల్‌లో ప్రచురించారు. ఈ అధ్యయనంలో డెన్మార్క్‌లో 1981నుంచి 2001వరకూ జన్మించిన పది లక్షల మందిని ఎంపిక చేసుకుని, వారి మొదటి 15 సంవత్సరాల జీవితాన్ని పరిశీలించారు. వారినే పెద్దయ్యాక తిరిగి పరీక్షిస్తే, దాదాపు అందులో 35 వేల మందికి పైగా డిప్రెషన్ బారిన పడినట్లు గుర్తించారు.
ప్రధానంగా 10 నుంచి 15 ఏళ్ల మధ్యలో ఒక్కసారి నివాసం మారిన వారిలో 41 శాతం కుంగుబాటుకు గురవగా, రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు మారిన వారిలో ఆ రిస్క్ 61 శాతానికి పెరిగినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో ప్లైమౌత్ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ, పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ 'డాక్టర్ మార్క్ హౌలెండ్' పాల్గొన్నారు. "పిల్లల బాల్యంలో నివాసం మారడం వల్ల వారి మానసిక ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుంది. ఇళ్లు మారడం వల్ల పిల్లలు సామాజికంగా ఒంటరిగా ఉన్నట్లు భావిస్తారు. వారికి స్థిరత్వం లేకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతారు." అని డాక్టర్ మార్క్ తెలిపారు.
అంతేకాకుండా ఇది దుర్భర జీవన పరిస్థితులు ఎదుర్కొనే పిల్లల్లో ఉన్న డిప్రెషన్ శాతం కంటే అధికమట. అలాగే మానసిక అనారోగ్యానికి కారణాలు చాలా ఉన్నప్పటికీ, పెరిగే వయసులో పదేపదే వాతావరణాన్ని మార్చడమూ ఒక కారణమవుతుందట. అది ఎలా అంటే.. పిల్లలు ఆటలూ, రకరకాల యాక్టివిటీల ద్వారా అప్పుడప్పుడే స్కూల్లో తోటి విద్యార్థులతో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకోవడంతోపాటు చుట్టూ ఉండే వాతావరణానికీ అలవాటు పడుతుంటారు. ఈ క్రమంలో తరచూ నివాస ప్రాంతాన్ని మారుస్తుంటే వాళ్ల ఎదుగుదలకు అంతరాయం కలుగుతుంటుంది. అందుకే పిల్లలకు చిన్నతనంలో స్థిరమైన బాల్యాన్ని అందించాల్సిన అవసరం ఉందని.. తరచూ ఇళ్లులు మారేవారు పిల్లలు కుంగుబాటుకు గురికాకుండా ఉండటానికి ప్రత్యేక శద్ధ చూపించాలని పేరెంట్స్‌కు పరిశోధకులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.
ఇవి కూడా చదవండి :
రీసెర్చ్ : మీ ఒంట్లో షుగర్ ఎంత ఉన్నా- లవంగాలు ఇలా తీసుకుంటే చాలు! - దెబ్బకు నార్మల్ అయిపోతుంది!
వర్షాకాలంలో ఇళ్ల చుట్టూ పాములు తిరుగుతుంటాయ్ - కాటేస్తే వెంటనే ఇలా చేయండి!
ఇష్టంగా పాప్‌కార్న్ తింటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసుకోండి!