Ragi Health Benefits : మనం తినే ఆహారమే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే రోజూ సమతుల ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా ఉదయాన్నే పోషకాలు ఎక్కువగా ఉండే తిండి తినాలని సూచిస్తున్నారు. ఇందుకోసం రాగులు ది బెస్ట్ ఛాయిస్ అంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెన్‌ఫిట్స్ పొందవచ్చని తెలియజేస్తున్నారు. మరి.. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రొటీన్ పుష్కలం :
రాగులలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే బాడీకి శక్తిని అందిస్తుందని పేర్కొన్నారు.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది :
రాగులలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి రోజూ ఉదయాన్నే రాగులతో చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులంటున్నారు. వీటిని తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుందని తెలియజేస్తున్నారు.
ఆకుకూరలను ఇలా వండుతున్నారా? - పోషకాలన్నీ గాల్లో కలిపేస్తున్నట్టే! - How To Cook Leafy Vegetables
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో :
రాగులలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అనేది ఒక ఫుడ్ బ్లడ్‌లో చక్కెర స్థాయిలను ఎంత వేగంగా పెంచుతుందో సూచిస్తుంది. రాగులను షుగర్ పేషెంట్లు తీసుకోవడం వల్ల.. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. 2017లో ప్రచురించిన 'Journal of the American College of Nutrition' నివేదిక ప్రకారం.. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే వ్యక్తులు రాగులను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు కనుగొన్నారట. రాగులతో చేసిన ఆహార పదార్థాలను మధుమేహం ఉన్నవారు తినడం వల్ల షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయని డాక్టర్.శ్రీలత (డైటీషియన్) పేర్కొన్నారు.
ఎముకలు బలంగా :
రాగులలో కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో యాడ్ చేసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఆస్టియోపోరోసిస్ (బోలు ఎముకల వ్యాధి) వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందట.
గుండె ఆరోగ్యంగా :
రాగులలో అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి బాడీలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే వీటిని డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా :
- రాగులలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి, జుట్టుకు పోషణను అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి.
- రాగులను బాలింతలు తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
- ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యలతో సతమతమవుతున్న వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందట.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.