Psychiatrist Suggestions on Family Problems : ఆమె కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. కొడుకు, కోడలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు. అయితే.. కోడలు పుట్టింట్లో గారాబంగా పెరగడం వల్ల ఇప్పుడు అత్తింట్లో కూడా ఏ పనీ చేయడం లేదని అత్తగారు బాధపడుతోంది. కాస్త గట్టిగా చెప్తే.. వేరు కాపురం పెడతానంటోంది. అదే జరిగితే కొడుకును చూడకుండా తాను ఉండలేనని అత్త బాధపడుతోంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచడం లేదని ఆమె ఆందోళన చెందుతోంది. ఈ సమస్యకు మానసిక నిపుణురాలు డాక్టర్ మండాది గౌరీదేవి ఇలా సమాధానం చెబుతున్నారు. అదేంటంటే..
పరిస్థితులు మారాయ్..
కోడలు తనతో కలిసిపోయి ఇంట్లో అన్ని పనులూ చేయాలని ప్రతి అత్తా కోరుకుంటుంది. బాధ్యతలను తీసుకోవాలని ఆశిస్తుంది. అయితే.. ఇప్పుడు కాలం మారింది. నేటి జనరేషన్ ఆలోచన ఒకప్పటిలా లేదు. మెజార్టీ తల్లిదండ్రులు తమ పిల్లలను జెండర్ తో సంబంధం లేకుండా చదివిస్తున్నారు. పిల్లలకు చదువుపై ఏకాగ్రత ఉండాలని పేరెంట్స్ వారికి పనులు కూడా చెప్పడం లేదు. ఒక్కరే కూతురు ఉన్నా కూడా గారాబంగా పెంచుతూ పనులకు దూరంగా ఉంచుతున్నారు.
టైమ్ ఇవ్వండి..
మీ ఇంటి పరిస్థితులకు అలవాటు పడడానికి మీ కోడలికి కాస్త టైమ్ ఇవ్వండి. ఉద్యోగం చేస్తోంది కాబట్టి.. మళ్లీ ఇంటికి వచ్చి మొత్తం పనంతా చేయాలంటే ఇబ్బందిగా ఉండొచ్చు. ఎవరైనా సరే కుటుంబ బాధ్యతలను ఒకేసారి తీసుకోలేరు. కాబట్టి, కోడలు చేసే పనుల్లో తప్పులు మాత్రమే వెతక్కండి. మంచి చేస్తే మెచ్చుకోండి. అదేసమయంలో ఒకేసారి అన్ని పనులూ చెప్పకుండా.. కొంచెం కొంచెంగా బాధ్యతలు ఇస్తూ ఆమె నేర్చుకునేలా చూడండి.
ఫ్రెండ్లీగా సపోర్టు చేయండి..
మీ కొడుకు పెద్దవాడైన తర్వాత కూడా కుమారుడిని విడిచి పెట్టి ఉండలేనని మీరు చెబుతున్నారు. మీరు మీ అబ్బాయి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్టే.. అమ్మాయి తల్లిదండ్రులు కూడా అత్తవారింట్లో తమ అమ్మాయి ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి, కోడలితో అత్తగారిలా హుకుం జారీ చేయకుండా స్నేహితురాలిగా సపోర్ట్ ఉండండి.
అయినా మారకపోతే..
మీరు పైన చెప్పిన విషయాలన్నీ పాటించిన తర్వాత కూడా ఆమెలో మార్పు రాలేదంటే.. వాళ్లను వేరే ఇంట్లో ఉండమని చెప్పండి. ప్రతిరోజూ ఒకే ఇంట్లో ఉంటూ ఎడముఖం పెడముఖంగా ఉండడం కన్నా.. ఇది మంచిది. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ జాబ్స్ చేస్తున్నారు కాబట్టి.. మీ అబ్బాయి కూడా ఇంటి పనుల్లో సాయం చేస్తేనే ఒక్కరి మీదనే పూర్తిగా భారం పడకుండా ఉంటుంది. జీవితం సాఫీగా సాగుతుంది అని మానసిక నిపుణురాలు డాక్టర్ మండాది గౌరీదేవి సూచించారు.
Note: ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. మానసిక నిపుణుల సూచనల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత నిపుణుల సలహాలు తీసుకోవడమే మంచిది.