Benefits Of Pista Dry Fruit : హెల్దీ స్నాక్స్ అనగానే టక్కున గుర్తొచ్చేవి డ్రై ఫ్రూట్స్. ఈ మధ్య చాలా మంది డ్రై ఫ్రూట్స్‌ను మిస్ అవకుండా ప్రతి రోజు తీసుకుంటున్నారు. వీటిని రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే తినే వారు కొందరైతే, సాయంత్రం పూట స్నాక్స్‌గా తీసుకునే వారు మరికొందరు. డ్రై ఫ్రూట్స్ అన్నింటిలో పిస్తా పప్పులకు ప్రత్యేకత ఉంది. రుచితో పాటు ఎన్నో పోషక విలువలు కలిగిన పిస్తా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా పది నుంచి పన్నెండు పిస్తాలను తినడం వల్ల పూర్తి ఆరోగ్యానికి మేలు కలుగుతుందట.
పోషకాల గని!
పిస్తా పప్పుల్లో శరీరానికి అవసరమైన పోషకాలన్నింటితో పాటు ప్రొటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. విటమిన్-బి6 ఎక్కువ ఉన్నందున ప్రతి రోజు 10 నుంచి 12 పిస్తాలను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగై, రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే దీంట్లోని పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పూర్తి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.
గుండెకు మేలు!
మోనోసాచురేటెడ్, పాలీఅన్ సాచురేటెడ్ ఫ్యాట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు పిస్తాల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేందుకు తోడ్పడతాయి. ఫలితంగా గుండె జబ్బులకు దూరంగా ఉండచ్చు.
బరువు నియంత్రణ!
కేలరీలు తక్కువగా ఉండే పిస్తాలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీర బరువు ఎప్పుడూ నియంత్రణలో ఉంటుంది. ఇందులోని ప్రొటీన్లు, ఫైబర్ కడుపు నిండుగా ఉన్నట్టుగా చేసి అధిక ఆకలిని, అదుపు లేకుండా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది. తద్వారా కేలరీలు తక్కువ తీసుకుంటూ బరువు పెరగకుండా చేస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు!
పిస్తాల్లో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి పిస్తాలు మంచి స్నాక్స్‌గా పనిచేస్తాయి.
కంటి చూపు పదిలం!
కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయపడే లూటేన్, జియాంక్సితిన్, యాంటీ ఆక్సిడెంట్లు పిస్తాల్లో మెండుగా దొరుకుతాయి. ఇవి కంటిని నీలికాంతి నుంచి, వయసు సంబంధిత కంటి సమస్యల నుంచి కాపాడేందుకు, కంటి శుక్లాల ప్రమాదాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి.
జీర్ణ ఆరోగ్యం!
పిస్తాల్లో అధిక మొత్తంలో లభించే ఫైబర్ జీర్ణక్రియకు సహకరిస్తంది. క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. పేగుల కదలికలు మెరుగై మలబద్దకం సమస్య రాకుండా ఉంటుంది.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు!
శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు పిస్తాల్లో లభిస్తాయి. ఇవి శరీరంలో వచ్చే మంట, నొప్పి వంటి వాటిని తగ్గించేందుకు సహాయపడతాయి. ఆర్థరైటిస్, గుండె జబ్బులు వంటి దీర్థకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
కాగ్నిటివ్ ఫంక్షన్!
మెదడు ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్-బి6, యాంటీ ఆక్సిడెంట్లు పిస్తాల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అభిజ్ఞా పనితీరు మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరగి న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాలు తగ్గుతాయి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
జీడిపప్పు తెగ తినేస్తున్నారా? బరువు పెరిగిపోయే ఛాన్స్ ఉంది- జాగ్రత్త! - Side Effects Of Cashews