How To Build Self Confidence in Children's : పిల్లల మనస్తత్వం సాధారణంగా చాలా సున్నితంగా ఉంటుంది. అయితే, చాలా మంది ఆత్మన్యూనతాభావంతో తమకు ఏదీ రాదని, ఏమీ చేయలేమని అనుకుంటూ.. అందరికంటే వెనుకంజలో ఉండిపోతారు. దాంతో ఏ పని చేయాలన్నా భయపడుతూ.. ధైర్యంగా ముందడుగు వేయడానికి సంకోచిస్తుంటారు. ఇందుకు ప్రధాన కారణం.. పిల్లల్లో ఆత్మవిశ్వాసం(Self Confidence) లోపించడమే అంటున్నారు మానసిక నిపుణులు. కాబట్టి, అలాంటి సందర్భాల్లో పిల్లలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ఉండాలంటే.. వారిలో ఆత్మవిశ్వాసం పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని అంటున్నారు. అంతేకాదు.. తల్లిదండ్రులుగా ప్రతి ఒక్కరూ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలంటే ఎలాంటి విషయాలను నేర్పించాలి, పాటించాలో కూడా సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అలా మాట్లాడటం నేర్పించాలి : చాలా మంది పిల్లలు నలుగురి ముందు మాట్లాడాలంటే భయపడుతుంటారు. ఇది కూడా వారి ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీ పిల్లలు అలా భయపడకుండా ఉండాలంటే వారికి 'ఆకట్టుకునేలా మాట్లాడటం' నేర్పించాలి. ఎందుకంటే.. అందంగా, ఆకట్టుకునేలా, నైపుణ్యంతో మాట్లాడే పిల్లలు ఎవరినైనా ఇట్టే ఆకర్షించగలుగుతారు. అలాగే నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా ఏ పనినైనా చేస్తాననే ధైర్యంతో ఉంటారు. అందుకే.. పిల్లలకు నలుగురిని ఆకట్టుకునేలా మాట్లాడటం నేర్పించాలంటున్నారు మానసిక నిపుణులు.
తప్పుల నుంచి నేర్చుకోవడాన్ని ప్రోత్సహించాలి : సాధారణంగా అందరూ ఏదో ఒక టైమ్‌లో తప్పులు చేస్తూనే ఉంటారు. కాబట్టి, పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వారిని నిందించకుండా ఉండండి. ముఖ్యంగా చేసిన తప్పులు మరల చేయకుండా.. వాటి నుంచి పాఠాలు నేర్చుకునే దిశగా వారిని ప్రోత్సహించాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇది కూడా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుందంటున్నారు.
మీ పిల్లలు దూకుడుగా వ్యవహరిస్తున్నారా? - ఈ టిప్స్‌తో సెట్ చేయండి - లేదంటే ఇబ్బందులే!
స్వేచ్ఛను అందించాలి : పిల్లలు ఎప్పుడూ మీపైనే ఆధారపడి ఉండకుండా.. వారే స్వయంగా కొన్ని సొంత నిర్ణయాలు, బాధ్యతలను తీసుకునేలా స్వేచ్ఛను అందించేలా చూసుకోండి. వారికి నచ్చిన డ్రెస్ కలర్‌ను ఎంపిక చేసుకోవడం, స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం, షూ పాలిష్ చేసుకోవడం వంటివి చేయడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఇలా సొంత పనులు చేసుకోవడం వల్ల వారు మంచి, చెడు విషయాలనూ నేర్చుకుంటారంటున్నారు.
రోల్ మోడల్ అవ్వాలి : పిల్లలు నిరంతరం పేరెంట్స్ తమ జీవితాలను ఎలా గడుపుతున్నారు.. వైఫల్యాలను ఎలా ఎదుర్కొంటున్నారు.. విజయాన్ని ఎలా పొందుతున్నారనే విషయాలను గమనిస్తూ ఉంటారు. కాబట్టి, మీరు(పేరెంట్స్) అత్యంత విశ్వాసంతో ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా జాబ్‌లో స్థిరపడినప్పుడు అది గమనిస్తారు. అప్పుడు, తాము(పిల్లలు) ఏ పనినైనా చేయగలమన్న భావన.. నా తల్లిదండ్రులే నా రోల్ మోడ్ల్ అనే ఆలోచన వారిలో వస్తుందంటున్నారు నిపుణులు.
అభిప్రాయాలు వినాలి : చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు చెప్పే మాటలు వినకపోవడం అటుంచితే.. 'నువ్వు చిన్న పిల్లవాడివి.. నీకేం తెలీదు.. పెద్దవాళ్లు చెప్పినట్టు విను' అంటూ కోపగించుకుంటుంటారు. మీరు చేసే ఈ పొరపాటు వారిని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి, అలాకాకుండా పలు విషయాల మీద వారికి ఉన్న అవగాహన, అనుభవాలు చిన్నవే అయినా ఏదైనా విషయం పట్ల పిల్లలు మాట్లాడుతుంటే వారి అభిప్రాయాలను ఓపికగా వినాలని సూచిస్తున్నారు.
ప్రశంసించాలి : పరీక్షల్లో పిల్లలు ఎక్కువ మార్కులు సాధించినా, అలాగే ఆటల్లో చురుకుగా పాల్గొన్న కూడా వారిని ప్రశంసించడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీరు వారి వెంట ఉన్నారని పిల్లలకు తెలుస్తుంది. అయితే.. కొన్నిసార్లు పిల్లలు ఫెయిల్ అయినా కూడా వారిని నిరుత్సాహపరచకుండా.. మరోసారి ట్రై చేయమని ప్రోత్సహించండని సూచిస్తున్నారు నిపుణులు. జీవితంలో గెలుపోటములు సహజమని.. కానీ, ప్రయత్నం మాత్రం ఎప్పటికీ విడవకూడదని చెప్పాలంటున్నారు.
పిల్లల ముందు ఈ పనులు చేస్తున్నారా? అయితే జాగ్రత్త అంటున్న నిపుణులు!