Outdoors Vs Treadmill Walking Which is Better: నడక.. సహజమైన వ్యాయామం. అన్ని వ్యాయామాల కన్నా సులభమైనది.. అందరికీ అనుకూలమైనది. అయితే.. టైమ్ లేదనే కారణంతో చాలామంది పట్టణాలు, నగరాల్లో ఉండేవారు ఎక్కువగా ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేస్తారు. మరికొందరు మైదానంలో వాకింగ్ చేస్తారు. మరి, ఈ రెండింటిలో ఏది మంచిది? ఈ రెండూ ఒకే రకమైన ఆరోగ్య ప్రయెజనాలను కలిగిస్తాయా? అనే ప్రశ్నలకు నిపుణుల సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం..
ఎక్కువ కేలరీలు:
- ఆరుబయట నడిచినప్పుడు గాలికి వ్యతిరేకంగా నడుస్తుంటారని.. ఇది మీ వ్యాయామాన్ని మరింత సవాలుగా మారుస్తుందని నిపుణులు అంటున్నారు. గాలిని నెడుతూ నడవడం వల్ల మీరు ఎక్కువ కేలరీలను ఖర్చు చేస్తారని.. దీని వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉందంటున్నారు.
- ట్రెడ్‌మిల్ వాకింగ్‌లో గాలి నిరోధకతకు వీలు ఉండదని.. ఆరుబయట వాకింగ్‌తో పోల్చితే ట్రెడ్‌మిల్ వాకింగ్‌లో తక్కువ కేలరీలను ఖర్చు చేస్తారని చెబుతున్నారు. ట్రెడ్‌మిల్‌పై నడచిన వారి కంటే ఆరుబయట నడిచిన వ్యక్తులు 10% ఎక్కువ కేలరీలు కరిగినట్లు పలు అధ్యయనాలు సైతం చెబుతున్నాయి.
మానసిక ఉత్సాహం:
- ట్రెడ్‌మిల్ ఉపయోగించడం కంటే ఆరుబయట నడవడం చాలా ఆనందదాయకంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. బయట నడిచినపుడు మనం నడకతో పాటు ప్రకృతిని ఆస్వాదించడం, విభిన్న దృశ్యాలను అనుభవించడం, వేరే వ్యక్తులతో కలిసి మాట్లాడుతూ నడవడం లాంటివి చేస్తుంటాం. ఆరుబయట నడకలో సహజమైన కదలికలు ఎక్కువ ఉంటాయి. అడుగులు, దూరం, నడక తీరులో ఇలా చాలా రకాల తేడాలు వస్తాయి. అంతేకాదు ఆరు బయట నడవడం వల్ల మానసిక సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
- ట్రెడ్‌మిల్ వాకింగ్‌లో పైన చెప్పినవి ఏవీ ఉండవని అంటున్నారు. ట్రెడ్‌మిల్‌పై నడకలో అంతా కృత్రిమంగానే ఉంటుంది. ఒకే రకమైన ఫ్లాట్ ఉంటుంది కనుక ఒకే రకమైన అడుగులు, ఒకే రకమైన దూరం ఉంటుందని అంటున్నారు.
- 2018లో జర్నల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ హెల్త్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ప్రతిరోజూ 30 నిమిషాలు ట్రెడ్‌మిల్‌పై నడిచిన వారి కంటే ఆరుబయట నడిచిన వ్యక్తులలో ఒత్తిడి, ఆందోళన తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో స్కాటిష్ మానసిక ఆరోగ్య పరిశోధకుడు, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌లోని పబ్లిక్ హెల్త్ సైన్సెస్ విభాగంలో సీనియర్ లెక్చరర్ డాక్టర్ అలెస్టైర్ స్టెవార్ట్ పాల్గొన్నారు.
స్వచ్ఛమైన గాలి: మీరు బయట నడిచినప్పుడు స్వచ్చమైన గాలి పీల్చుకుంటారని.. ఇది ట్రెడ్ మిల్ వాకింగ్‌లో సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు.
కదిలికలు: బయట నడవడం అనేది సహజమైన శరీర కదలికలను కలిగి ఉంటుందని.. ట్రెడ్‌మిల్ కండరాలను పట్టేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు.
ఏది మంచిది: వేర్వేరు ట్రెడ్‌మిల్స్‌పై వాకింగ్ చేయడానికి, ఆరుబయట వాకింగ్ చేయడానికి కచ్చితంగా చాలా తేడా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ట్రెడ్‌మిల్ వాకింగ్ మీకు అనుకూలమైనది అయినప్పటికీ.. బయట నడిచిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలను ఇవ్వదని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.