Side Effects Of Nail Polish Removing : ఎల్లప్పుడూ గోళ్లు నిత్య నూతనంగా ఉండేందుకు చాలా మంది నెయిల్ పాలిష్ వేస్తుంటారు. కాస్త షైన్ తగ్గగానే పాతది తొలగించి.. కొత్తది అప్లై చేస్తుంటారు. పాత పాలిష్ తొలగించడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ (Nail Polish Remover) ఉపయోగిస్తారు. ఇదే.. కొంప ముంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు.
నెయిల్ పాలిష్, జెల్ లేదా షెల్లాక్ వంటి సింథటిక్ ట్రీట్‌మెంట్‌లను తొలగించడం వల్ల.. గోరు కింది చర్మం దెబ్బతింటుందని, గోరుకు గాయం అవుతుందని చెబుతున్నారు. సహజంగా ఉండాల్సిన మీ గోళ్లపై పొరలు ఏర్పడతాయంటున్నారు. ఫలితంగా గోళ్లు పలుచగా మారి త్వరగా విరిగిపోతాయంటున్నారు. గోళ్ల చుట్టూ ఉన్న చర్మం పొడిబారి, బలహీనంగా మారుతాయని.. పగలడం, చిట్లడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
అలర్ట్ : గోళ్లు కొరకడం అలవాటు కాదు మానసిక సమస్య - ఈ టిప్స్‌తో వెంటనే మానుకోండి!
2015లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. నెయిల్ పాలిష్ రిమూవర్‌ను వారానికి రెండుసార్లు ఉపయోగించే వ్యక్తులలో.. ఉపయోగించని వారితో పోలిస్తే గోళ్లు పలచబడటం, విరిగిపోవడం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూఎస్ఏలోని న్యూయార్క్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ మాక్స్ బ్రౌన్ పాల్గొన్నారు. నెయిల్ పాలిష్ రిమూవర్ తరచుగా వాడడం వల్ల గోళ్ల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆయన పేర్కొన్నారు.
- అయితే.. మీరు ఇప్పటికే నెయిల్ పాలిష్‌ను తరచుగా తొలగించడం ద్వారా నష్టాన్ని పొందినప్పటికీ.. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.
- నెయిల్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో క్యూటికల్ కేర్ కీలకపాత్ర పోషిస్తుందంటున్నారు. అంతేకాదు.. 'క్యూటికల్ కేర్ అనేది నెయిల్ కేర్ హోలీ గ్రెయిల్' అని చెబుతున్నారు. అవి మృదువుగా మారడం కోసం రోజుకు రెండుసార్లు నూనెను అప్లై చేయాలంటున్నారు.
- నెయిల్ పాలిష్ ను రిమూవర్‌తో తరచుగా తొలగించకుండా.. ఇన్ని రోజులకు ఒకసారి రిమూవ్ చేసుకునే విధంగా ఒక టైమ్ టెబుల్‌ను ఫాలో అయితే మంచిదని చెబుతున్నారు.
- నెయిల్స్ ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరమంటున్నారు. ప్రధానంగా సిలికాన్ అనే ఖనిజం ఎక్కువగా లభించేలా చూసుకోవాలని చెబుతున్నారు. ఈ ఖనిజం గోర్లు వేగంగా పెరగడానికి, బలంగా మారడానికి సహాయపడుతుందంటున్నారు. ఇది కూరగాయలలో, ముఖ్యంగా వెల్లుల్లి, ఉల్లిపాయలలో లభిస్తుందని సూచిస్తున్నారు.
- అదేవిధంగా.. నెయిల్స్ కఠినమైన రసాయనాలు, నీటికి గురికాకుండా చూసుకోవాలంటున్నారు. ఏదైనా గోర్లకు సంబంధించిన పనులు చేస్తున్నప్పుడు హ్యాండ్ గ్లౌజ్ ధరించడం మంచిదని చెబుతున్నారు. అలాగే మెనిక్యూర్ చేయించుకోవడం వల్ల ఎలాంటి నెయిల్ పాలిష్ లేకుండా గోరు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ గోళ్లు తేలిగ్గా విరిగిపోతున్నాయా? - ఈ టిప్స్ పాటిస్తే బలంగా, పొడవుగా పెరుగుతాయి!