Mosambi Benefits for Health: వానాకాలం వచ్చిందంటే ఎన్నో రకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే.. పిల్లల నుంచి పెద్దల వరకూ ఎప్పుడో ఒకసారి అనారోగ్యం పాలవుతుంటారు. ఈ సమయంలోనే వ్యక్తిగత, పరిసరాల శుభ్రత ఎంత ముఖ్యమో.. వ్యాధుల నుంచి రక్షించే రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే ప్రకృతి ఈ కాలంలోనే రోగ నిరోధకశక్తిని పెంచి, వివిధ రకాల రోగాలను తగ్గించే పండ్లను మనకు అందిస్తుంది. అలాంటి పండ్లలో ఒకటి బత్తాయి. దీనిని తీసుకోవడం వల్ల ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు.. రోగ నిరోధక శక్తిని పెంచి, జలుబు వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయని 2012లో ప్రచురితమైన జర్నల్ ఆఫ్ ఆయుర్వేద అండ్ ఇంటగ్రేటివ్ మెడిసిన్లో (రిపోర్ట్) వెల్లడైంది. Immunomodulatory activity of Citrus limetta (Mosambi) juice on immune system అనే అంశంపై చేసిన అధ్యయనంలో డాక్టర్ ఎస్కే సింగ్, ఆర్కే వర్మ, ఏకే కుమార్, ఏకే సింగ్ పాల్గొన్నారు. కేవలం రోగ నిరోధక శక్తితో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం.
- బత్తాయిలో ఎక్కువగా ఉండే విటమిన్-సి పోషకాలు వివిధ అవయవాల పనితీరును మెరుగుపరుస్తుందని చెప్పారు. అంతేకాకుండా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే డిటాక్సిఫైయింగ్ ఏజెంట్‌లా పనిచేస్తాయని తెలిపారు.
- బత్తాయిలో ఉండే పీచు పదార్థం జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుందని వైద్యులు చెప్పారు. ఫలితంగా ఇది మలబద్ధకాన్ని దూరం చేస్తుందని వివరించారు.
- అంతేకాకుండా కండరాలు పట్టేయడం, తిమ్మిర్ల బారిన పడకుండా కాపాడతాయని తెలిపారు. అందుకే క్రీడాకారులకు వీటిని ఎక్కువగా వాడాలని నిపుణులు చెబుతుంటారు.
- ఇందులోని పోషకాలు ఎముకల ఆరోగ్యాన్నీ పరిరక్షిస్తాయని చెప్పారు. ఆస్థియో, రూమటాయిడ్ ఆర్థరైటిస్‌ల బారినపడకుండా కాపాడతాయని తెలిపారు.
- వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కళ్లను అంటువ్యాధుల నుంచి కాపాడుతాయని నిపుణులు వెల్లడించారు. ఫలితంగా కంటిలో శుక్లాలు పెరగకుండా చేస్తాయని తెలిపారు.
- ఇందులోని పోషకాలు శరీరానికి నీరసం, అలసటలను రాకుండా చేసి శక్తిని పుంజుకునేలా చేస్తాయని పేర్కొన్నారు. ఒత్తిడి, కాలుష్యాల ప్రభావాన్ని తగ్గించడానికి సాయపడతాయని చెప్పారు.
- బత్తాయిలోని విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయని నిపుణులు చెప్పారు. ఇవి మచ్చలు, ముడతలను తగ్గిస్తాయని.. అంతేకాకుండా కొల్లాజన్ ఉత్పత్తిని పెంచి చర్మం సాగకుండా చేస్తాయన్నారు.
- ఇవే కాకుండా చాలా మంది ఎదుర్కొంటున్న జుట్టు సమస్యకు బత్తాయిలు మంచిగా ఉపయోగపడతాయని నిపుణులు చెప్పారు. వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలని సూచించారు. ఇవి వెంట్రుకల చివర్లు చిట్లిపోకుండా చేసి జుట్టును మెరిసేలా చేస్తాయని తెలిపారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.