Lung Cancer Causes in Non Smokers : క్యాన్సర్.. ప్రస్తుతం జనాలను భయపెడుతున్న ప్రాణాంతకమైన వ్యాధులలో ఒకటి. ఏటా ఎంతో మంది వయసుతో సంబంధం లేకుండా ఈ మహామ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిలో రకరకాల క్యాన్సర్లు ఉంటాయి. అందులో ఒకటైన ఊపిరితిత్తుల క్యాన్సర్ విషయంలో జాగ్రత్తగా ఉంటాలంటున్నారు నిపుణులు. అయితే, చాలా మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ అనగానే.. పొగ తాగే వారికి మాత్రమే వస్తుందనే భావనలో ఉంటారు. కానీ.. ఇప్పుడు పొగ తాగనివారిలోనూ దీని కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు.. ఇటీవల లాన్సెట్ ఇక్లినికల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం లంగ్ క్యాన్సర్‌కి సంబంధించి మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పొగతాగనివారిలో కూడా ఊపిరితిత్తి క్యాన్సర్ ముప్పు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా గాలి కాలుష్యం, ఇతరులు వదిలిన సిగరెట్ల పొగను పీల్చుకోవడం, పనిచేసే చోట హాని కారకాలు, ఇంట్లో వంటల నుంచి వెలువడే పొగలు, జన్యువుల వంటివన్నీ ఇందుకు తోడ్పడుతున్నాయి. అంతేకాదు.. పాశ్చాత్యదేశాల్లో లంగ్ క్యాన్సర్ 54-70 ఏళ్ల వయసులో నిర్ధరణ అవుతుండగా.. మనదేశంలో అంతకంటే పదేళ్ల ముందే దాడి చేస్తున్నట్టు ఇటీవల "లాన్సెట్ ఇక్లినికల్ మెడిసిన్ జర్నల్"లో ప్రచురితమైన ఓ అధ్యయనం తెలియజేస్తోంది.
అలాగే.. ఊపిరితిత్తి క్యాన్సర్ మనదేశంలో చిన్నవయసులో సగటున 28.2 సంవత్సరాల వయసులో బయట పడుతుండగా.. అమెరికాలో 38, చైనాలో 39 ఏళ్లు కావటం గమనార్హం. ముఖ్యంగా దక్షిణాసియా దేశాల్లో రోజురోజుకీ లంగ్ క్యాన్సర్ కేసులు పెరగటానికీ.. వాతావరణంలో నుసి పదార్థం (పీఎం 2.5) మోతాదులు ఎక్కువ కావటానికీ సంబంధం ఉంటోందని చెబుతున్నారు పరిశోధకులు. కాబట్టి.. ఊపిరితిత్తి క్యాన్సర్ కేసులు తగ్గుముఖం పట్టాలంటే ముందుగా వాతావరణంలో నుసి పదార్థం మోతాదు తగ్గించటానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
మీరు రోజూ పెరుగు తింటున్నారా? - శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
అన్నింటికంటే ముఖ్యంగా ప్రజలకు ఊపిరితిత్తి క్యాన్సర్ ముప్పు కారకాలపై అవగాహన కల్పించాలని పరిశోధకులు చెబుతున్నారు. అంటే.. ఇతరులు వదిలిన పొగ, కాలుష్య కారకాలను పీల్చితే ఎలాంటి అనర్థాలు సంభవిస్తాయో జనాలకు తెలిసేలా కొన్ని కార్యక్రమాలు చేపట్టాలంటున్నారు. తీసుకోవాలంటున్నారు. అదేవిధంగా.. ఊపిరితిత్తి క్యాన్సర్ ముప్పు అధికంగా గలవారు క్రమం తప్పకుండా ముందస్తు పరీక్షలు చేయించుకోవటమూ అవసరమే అంటున్నారు.
ఇది మాత్రమే కాదు.. 2019లో "Journal of the National Cancer Institute" అనే జర్నల్‌లోనూ పొగ తాగనివారిలో లంగ్ క్యాన్సర్ ముప్పు పెరిగిందని తేలింది. ఈ జర్నల్‌లో ప్రచురితమైన ఓ నివేదిక ప్రకారం.. స్మోక్ చేసే వారి పక్కన ఉండి ఆ పొగను పీల్చుకునే నాన్ స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 21% పెరిగిందని కనుగొన్నారు పరిశోధకులు. ఈ రీసెర్చ్‌లో టెక్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ అంకాలజిస్ట్ డాక్టర్ లియాంగ్ జౌ పాల్గొన్నారు. నాన్ స్మోకర్స్.. ధూమపానం చేసే వారితో కలిసి ఉండటం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
దగ్గుతున్నప్పుడు ఛాతి, భుజాల దగ్గర నొప్పిగా ఉందా? ఇది క్యాన్సర్ సంకేతం కావచ్చు!