Lemon Balm Tea Benefits: మనలో చాలా మంది ఉదయాన్నే ఎంతో ఇష్టంగా టీ, కాఫీ సేవిస్తుంటారు. నలుగురు ఫ్రెండ్స్ కలిసినా.. ఇంట్లోకి అతిథులు వచ్చినా కూడా టీ, కాఫీలను అందిస్తుంటారు. అయితే, ఇందులోని కెఫెన్ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో.. చాలా మంది టీ, కాఫీలకు చెక్ పెట్టి ఆరోగ్యవంతమైన పానీయాల వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం చాలా రకాల హెర్బల్ టీ లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో లెమన్ టీ, పుదీనా టీ, అల్లం టీ, సోంపు టీ.. ఇలా ఎన్నో ఉన్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో టీ వచ్చి చేరింది. అదే లెమన్ బామ్ టీ. పుదీనా జాతికి చెందిన ఈ మొక్కతో చేసే టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది: లెమన్ బామ్‌లో ఒత్తిడి, ఆందోళనను తగ్గించే అనేక ఔషధ గుణాలు ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఒత్తిడి, ఆందోళనను తగ్గించి ప్రశాంతతను చేకూర్చేలా లెమన్ బామ్ టీ సహాయపడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. 2004లో జర్నల్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మకాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం లెమన్ బామ్ టీ తాగేవారిలో ఒత్తిడి, ఆందోళన(National Institute of Health రిపోర్ట్) తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో UK లోని Northumbria యూనివర్సిటీలో హ్యూమన్ కాగ్నిటివ్ న్యూరోసైన్స్‌లో ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ ఓవెన్ కెన్నెడీ(David Owen Kennedy) పాల్గొన్నారు. లెమన్ బామ్‌లోని రోస్మరినిక్ యాసిడ్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
సుఖ నిద్రను ఇస్తుంది: కెఫెన్ లాగా నిద్రకు భంగం కలిగించకుండా హాయిగా నిద్రపోయేందుకు లెమన్ బామ్ టీ ఉపయోగపడుతుందని తెలిపారు. నిద్రలేమి సంబంధిత వ్యాధులకు సహజ ఔషధంగా దీనిని వినియోగిస్తారని చెబుతున్నారు. లెమన్ బామ్ టీని తీసుకోవడం వల్ల నిద్రలేమి తగ్గి.. సుఖంగా నిద్రపోయినట్లు జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజంలో తేలిందని వివరించారు.
మెదడు ఆరోగ్యం మెరుగు: లెమన్ బామ్ టీ కేవలం మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా మెదడు చురుకుగా పనిచేసేందుకు సహాయపడుతుందని తెలుపుతున్నారు. సైకోస్మోటిక్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం లెమన్ బామ్ టీ.. జ్ఞాపకశక్తిని పెంచుతుందని.. వివరిస్తున్నారు. కెఫెన్ లేకుండా మెదడు చురుకుగా పనిచేసేందుకు లెమన్ బామ్ టీ చక్కటి ఔషధమని సూచిస్తున్నారు.
అజీర్తి, గ్యాస్‌లకు చెక్: జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు లెమన్ బామ్ టీ చక్కటి ఔషధంగా పనిచేస్తుందని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ లాంటి సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేస్తుందని తెలిపారు.
దీర్ఘకాలిక వ్యాధులు రావట: లెమన్ బామ్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లేమటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయని.. ఇవి అనేక దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుతాయంటున్నారు.
మెరుగైన గుండె ఆరోగ్యం: తరచుగా లెమన్ బామ్ టీని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. అధిక రక్తపోటును తగ్గించి.. రక్త ప్రసరణను పెంచుతుందని.. ఫలితంగా గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుందని వివరిస్తున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.