Walking Reduce Back Pain : తరచుగా నడుం నొప్పి మిమ్మల్ని వేధిస్తోందా? తగ్గిపోయిందనుకున్న ప్రతిసారీ మళ్లీ మళ్లీ వస్తూ ఏ పని కూడా చేయనివ్వకుండా చేస్తోందా? అయితే మీరు మీ దినచర్యలో వాకింగ్‌ను తప్పకుండా చేర్చాల్సిందే. సిడ్నీ యూనివర్శిటీ, మాక్వేరీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా చేసిన ఓ తాజా అధ్యయనం ప్రకారం ఒక నిర్ణీత పద్ధతిలో నడిచే నడక నడుం నొప్పిని చాలావరకు తగ్గిస్తుంది. వారానికి 5 రోజుల పాటు నడిస్తే చాలు, వెన్నునొప్పి రాకుండా చూసుకోగలరట.
నడకే మార్గం!
ది లాన్సెట్‌లో ప్రచురితమైన కొత్త అధ్యయనం ప్రకారం వారానికి మూడు నుంచి ఐదు సార్లు, సగటున 130 నిమిషాలు నడిచే వ్యక్తులు, ఎటువంటి చికిత్స తీసుకోని వారితో పోలిస్తే దాదాపు రెండు రెట్లు ఎక్కువ కాలం నడుం నొప్పి లేకుండా ఉంటారని అధ్యయనం చెబుతోంది. సాధారణ శారీరక శ్రమకు అంతరాయం కలిగించే నడుం నొప్పికి తక్కువ ఖర్చుతో కూడిన నివారణ మార్గంగా నడకను సూచిస్తోంది.
2019 నుంచి 2022 వరకు జరిగిన ఈ పరిశోధనలో సుమారు 700 మంది ఆరు నెలల పాటు ఆరు సెషన్లలో ఫిజియోథెరపిస్టుల మార్గనిర్దేశంలో వాకింగ్ చేశారు. రోజూ దాదాపు అరగంట పాటు నడిచారు. ఆరు నెలల తర్వాత వారంతట వారే నడిచారు. అయితే నిర్విరామంగా వాకింగ్ చేసిన వారికి వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభించింది. అధ్యయనంలో పాల్గొన్న వారెవరూ ఆ సమయంలో వెన్నునొప్పికి సంబంధించిన ఎలాంటి చికిత్సను తీసుకోలేదు. అయినా వారికి వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభించింది.
నొప్పి మాయమైంది!
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారు ఆరు నెలల పాటు నడకను కొనసాగించిన తర్వాత మూడేళ్ల నుంచి వారిని వేధిస్తున్న వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభించిందని తెలిపారు. ఇందులో పాల్గొన్న వారిని పరిశోధకులు కూడా నెల నెలా పరీక్షించారు. వాకింగ్ వారిలో మళ్లీ వెన్నునొప్పి వచ్చే ప్రమాదం కూడా 28 శాతం తగ్గినట్లు పరిశోధకులు తెలిపారు. తక్కువ వెన్నునొప్పితో డాక్టర్లను సంప్రదించే వారి సంఖ్య కూడా 43 శాతం తగ్గిందని వెల్లడించారు. 112 రోజులకు వెన్నునొప్పి మళ్లీ వచ్చే ప్రమాదం కాస్త తగ్గిందని, 208 రోజులకు నొప్పి చాలా వరకు లేకుండా పోయిందని తెలిపారు. అధ్యయనంలో పాల్గొన్నవారిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. వారి వయసు 43 నుంచి 66 ఏళ్ల మధ్య ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
నడుము నొప్పి విషయంలో నడక అనే చికిత్సను ఇన్నిరోజులు నిర్లక్ష్యం చేశామని కూడా ఈ అధ్యయనకర్తలు తెలిపారు. గతంలో చేసిన దాదాపు అన్ని అధ్యయనాలు కూడా వెన్ను నొప్పికి అనేక రకాల చికిత్సలు సూచించాయని, కానీ భవిష్యత్తులో వెన్నునొప్పి రాకుండా ఏం చేయాలో వెల్లడించలేదని వివరించారు. దానికి కూడా నడకే మంచిదని వెల్లడించారు. వ్యాయామం, తగినంత నడక గుండెకు మంచి ఆరోగ్యాన్ని, మెరుగైన మానసిక స్థితిని, సరిపోయేంత నిద్రను ఇస్తాయని తెలిపారు.
అయితే వెన్నునొప్పిని తగ్గించేందుకు నడక ఎందుకు ప్రభావవంతంగా ఉంటుందో తమకు కచ్చితంగా చెప్పలేమని అధ్యయనకర్తలు తెలిపారు. కండరాల కదలిక వల్ల నొప్పి తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. శరీరం, మెదడు మధ్య నొప్పి సంకేతాలను నిరోధించే "ఫీల్-గుడ్" ఎండార్ఫిన్‌లు విడుదలవ్వడం వల్ల నొప్పి తగ్గి ఉండొచ్చని తెలిపారు. వ్యాయామాలు కూడా వెన్నునొప్పిని నివారించడంలో ప్రభావవంతంగా ఉండవచ్చని వివరించారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా? ఇంట్లో ఉండే ఈ మూడు పదార్థాలతో చెక్! - Homemade Remedies For Acidity