ICMR Soft Drinks Side Effects : బాగా దప్పిక వేసినప్పుడు, ఎండలో తిరిగినప్పుడు మనం కూల్‌డ్రింక్స్ తాగుతుంటాం. దీనివల్ల మనకు దప్పిక తీరినట్లు అనిపిస్తుంది. అయితే నీటికి, తాజా పండ్ల రసాలకు శీతల పానియాలు ప్రత్యామ్నాయం కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) స్పష్టం చేసింది. భారత ప్రజల ఆరోగ్య రక్షణ కోసం విస్తృతమైన పరిశోధనలు, నిపుణులతో సంప్రదింపులు, శాస్త్రీయ అధ్యయనం తర్వాత ఐసీఎమ్ఆర్ నూతన ఆహార మార్గదర్శకాలు తీసుకొచ్చింది. నీటికి, తాజాపండ్లకు శీతల పానియాలు ఎప్పుడు ప్రత్యామ్నాయం కాదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) కూడా వెల్లడించింది. ఎన్ఐఎన్ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం కార్బోనేటేడ్ పానీయాలలో ఫాస్పోరిక్ యాసిడ్ ఉన్నట్లు వెల్లడైంది. ఈ యాసిడ్ దంతాల్లోని ఎనామెల్ దెబ్బతీస్తుందని, ఆకలి కాకుండా చేస్తుందని సూచించింది. శీతల పానీయాలు, ప్యాక్ చేసిన కొబ్బరి నీరు, మిక్స్‌డ్ ఫ్రూట్, కార్బోనేటేడ్ పానీయాలు వంటి సింథటిక్ శీతల పానీయాలను తాగకపోవడమే మంచిదని సూచించింది. వీటికి ప్రత్యామ్నాయంగా వేడి వాతావరణంలో మజ్జిగ, లేత కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు తీసుకోవాలని సూచించింది.
ఆహార అలవాట్లలో మార్పులు
కొన్ని దశాబ్దాలుగా భారతీయుల ఆహారపు అలవాట్లలో గణనీయమైన మార్పులు వచ్చాయని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. రక్తపోటు, షుగర్, ఊబకాయం వంటి వ్యాధులు వస్తాయని ఆయన వెల్లడించారు. పోషకాహార లోపం ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉందని తెలిపారు. తాజాగా ఐసీఎమ్ఆర్ జారీ చేసిన ఈ మార్గదర్శకాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, అన్ని రకాల పోషకాహార లోపాన్ని నివారించడానికి ఉపయోగపడుతుందని పాల్ అశాభావం వ్యక్తం చేశారు. వేడి వాతావరణంలో తీవ్రమైన శారీరక శ్రమ చేస్తున్నప్పుడు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ఇలాంటి సమయంలో నీరు ఎక్కువగా తాగాలని, ఆరోగ్యవంతమైన వ్యక్తి పానీయాలతో పాటు రోజుకు సుమారు రెండు లీటర్ల నీరు తాగాలని ఎన్ఐఎన్ మార్గదర్శకాలు సూచించాయి.
లేత కొబ్బరి నీరు
లేత కొబ్బరి నీరు మంచి హైడ్రేటింగ్ పానీయం. ఇందులో అనేక ఖనిజాలు ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. కాబట్టి ఎక్కువగా కొబ్బరి నీరు తాగడం మంచిది.
కాచిన పాలు
పెరుగుదలకు బలాన్నిచేందుకు కాగబెట్టిన పాలు తీసుకోవాలి. పాలలో అనేక పోషకాలు ఉంటాయి. కాల్షియం, ఐరన్ ఉంటుంది. ఇందులోని పోషకాలన్నీ సులభంగా జీర్ణమవుతాయి. పాలు అప్పుడప్పుడు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కాచిన తర్వాతే ఉపయోగించాలి.
శీతల పానీయాలకు దూరంగా
శీతల పానీయాల్లో కార్బోనేటేడ్, ఆల్కహాలిక్ పానీయాలు ఉంటాయి. ఇందులో చక్కెర, కృత్రిమ స్వీటెనింగ్ ఏజెంట్లు, ఆమ్లాలు ఉంటాయి. తాజా పండ్ల రసాలతో పోలిస్తే, వాణిజ్యపరంగా లభించే చాలా పండ్ల రసాల్లో వివిధ రకాల పండ్ల గుజ్జు 7 శాతం తక్కువగా ఉంటుంది. కార్బోనేటేడ్ పానీయాలలో ఫాస్పోరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాల ఎనామిల్ దెబ్బతీస్తుంది. అధిక మొత్తంలో తీసుకుంటే ఆకలిని ప్రభావితం చేస్తుంది.
తాజా పండ్ల రసాలు
నారింజ, నిమ్మ, ద్రాక్ష, మామిడి, పైనాపిల్, ఆపిల్, దానిమ్మ పండ్ల రసాలు ఎక్కువగా తాగాలి. చక్కెర వేయకుండా తాజా పండ్ల రసాలు తాగాలి. ఈ పండ్ల రసాల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఇవి విటమిన్లు, మినరల్స్‌తోపాటు డైటరీ ఫైబర్‌ని అందిస్తాయి. రోజూ తాజా పండ్ల రసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వేసవిలో ఎక్కువగా తాగే చెరకు రసంలోలో చెక్కర ఎక్కువగా ఉంటుంది. 100 మిల్లీ లీటర్ల చెరుకు రసంలో చక్కెర 13 నుంచి 15 గ్రాములు ఉంటుంది. కాబట్టి దాని వినియోగాన్ని తగ్గించాలి.
మితంగా టీ, కాఫీ
టీ, కాఫీల్లో కెఫిన్ ఉంటుంది. ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. 150 ఎంఎల్ బ్రూ కాఫీలో 80-120 మిల్లీ గ్రాములు, ఇన్‌స్టంట్ కాఫీలో 50- 65 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుంది. టీలో 30- 65 మిల్లీ గ్రాముల కెఫిన్ ఉంటుంది. టీ, కాఫీని చాలా మితంగా తాగాలి. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆనారోగ్య సమస్యలు రావచ్చు. భోజనానికి గంట ముందు, ఆ తర్వాత టీ, కాఫీలకు దూరంగా ఉండాలి.
మద్యం మానాలి
ఆల్కహాలిక్ పానీయాలకు సంబంధించిన వాటిల్లో ఇథైల్ ఆల్కహాల్ వివిధ నిష్పత్తుల్లో ఉంటుంది. బీర్‌లో 2- 5 శాతం, వైన్‌లో 8- 10 శాతం ఆల్కహాల్ ఉంటుంది. బ్రాందీ, రమ్, విస్కీలో 30-40 శాతం ఇథైల్ ఆల్కహాల్ ఉంటుంది. దీని వల్ల నోరు, స్వరపేటిక, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె, కాలేయం, మెదడు పనితీరును దెబ్బతిస్తుంది.
మెట్లు ఎక్కడం వల్ల ఇన్ని ప్రయోజనాలా! తెలిస్తే అసలు లిఫ్ట్ వైపే చూడరు!! - Stair Climbing Benefits