How To Stop Biting Nails : కొంత మంది ఒంటరిగా ఉన్నప్పుడు, ఏదో ఒకటి ఆలోచిస్తూ.. తమకు తెలియకుండానే గోళ్లు కొరుకుతుంటారు. మరికొందరు ఒత్తిడి, ఆందోళనగా అనిపించినప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు. చాలా మందికి ఈ అలవాటు చిన్నప్పుడే మొదలైపోతుందని నిపుణులంటున్నారు. అయితే, ఎప్పుడో ఒకసారి గోళ్లను కొరికితే ఏమో గానీ.. అదే పనిగా గోళ్లను కొరకడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి.. గోళ్లు కొరకడం వల్ల వచ్చే సమస్యలు ఏంటీ? ఈ అలవాటు ఎలా మానుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఇదొక మానసిక సమస్య : గోళ్లు కొరకడం ఒక సాధారణ అలవాటు కాదని.. ఇది ఒక విధమైన మానసిక సమస్యేనని నిపుణులు చెబుతున్నారు. దీన్ని వైద్య పరిభాషలో 'ఒనికోఫాగియా' అని అంటారు. మెజార్టీ జనాలు స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు గోళ్లు కొరుకుతారు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను చూసి ఈ అలవాటును నేర్చుకుంటారట.
గోళ్లు కొరకడం వల్ల వచ్చే సమస్యలేంటి? :
- అదే పనిగా గోళ్లు కొరకడం వల్ల గోళ్లు పొట్టిగా అవుతాయి. కొందరైతే గోళ్లను మొదళ్ల వరకు కొరకుతారు. దీంతో గోరు కింద స్కిన్ ఎర్రగా మారి నొప్పి, వాపు మొదలవుతుంది.
- గోళ్లు కొరకడం వల్ల అవి పెళుసుగా మారి, వంకర టింకరగా పెరుగుతాయి.
- మన నోట్లో ఎన్నో రకాల బ్యాక్టీరియా, వైరస్‌లుంటాయి. గోళ్లను కొరకడం వల్ల ఇవి లాలాజలం ద్వారా వేలి కొసలకు, గోరు అడుగు భాగానికి చేరుకుంటాయి.
- దీనివల్ల చేతులకు, నోటికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రమోద్ కుమార్ (జనరల్ ఫిజీషియన్) చెబుతున్నారు.
- ఇంకా వైరల్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాల్ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుందట.
- కొన్నిసార్లు గోళ్లు కొరకడం వల్ల దంతాల చిగుళ్లకు ఇన్ఫెక్షన్ సోకి.. చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది.
- అదేపనిగా గోళ్లను కొరకడం వల్ల దంతాలపైన ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది.
- ఒకే దంతంతో గోళ్లను కొరకడం వల్ల దానిపై భారం పడుతుంది.
- అలాగే ఎక్కువగా గోళ్లు కొరికే వారిలో దంతాలు కూడా అరుగుతాయట.
- ఈ అలవాటు వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
గోళ్లు కొరికే అలవాటును ఇలా మానుకోండి :
- ఈ అలవాటు ఉన్నవారు కొన్ని రోజుల పాటు కఠినంగా కొన్ని పనులు చేయాలి.
- పెరిగిన గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. గోళ్లు పొట్టిగా ఉంటే కొరకటానికి అనువుగా ఉండవు. దీంతో గోళ్లు కొరకాలనే కోరిక క్రమంగా తగ్గుతుంది.
- అలాగే గోళ్లకు చేదు రుచితో ఉండే నెయిల్ పాలిష్‌ను అప్లై చేసుకోవాలి. దీంతో గోళ్లు కొరికినప్పుడు చేదుగా అనిపిస్తుంది.
- గోళ్లకు బ్యాండేజ్ వేసుకోవాలి. ఇంట్లో ఉన్నప్పుడు గ్లౌజులు వేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
- ఒత్తిడి, ఆందోళనలను తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటి వాటిని అలవాటు చేసుకోవాలి.
- గోళ్లను కొరకాలని అనిపిస్తే మెత్తటి బంతిని నొక్కటం, రూబిక్స్ క్యూబ్ ఆడటం వంటివి చేయాలి.
- ఈ అలవాటు ఉన్నవారు చూయింగ్ గమ్ నమలడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.