Tips to Keep Non Stick Pan Life Increase : ఇవాళ దాదాపుగా ప్రతి ఇంట్లోనూ నాన్ స్టిక్ పాన్ ఉంటుంది. ఈ వంట పాత్ర స్టైలిష్ లుకింగ్‌తో ఆకట్టుకోవడమే కాదు.. వంట మరకలేవీ అంటుకోకపోవడం దీని ప్రత్యేకత. మామూలు వంట పాత్రల్లో అయితే కూరలకు సంబంధించిన జిడ్డు అతుక్కుపోతుంది. వాటిని వదిలించడానికి గృహిణులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అందుకే.. అందరూ నాన్ స్టిక్ వైపు చూస్తున్నారు.
ఈ పాత్రలపై టెప్లాన్ కోటింగ్ ఉంటుంది. దీని కారణంగానే జిడ్డు మరకలు ఏవీ అంటుకోవు. అయితే.. ఆ కోటింగ్ అనేది క్రమంగా తరిగిపోతూ ఉంటుంది. ఇది పూర్తిగా కోల్పోయిన రోజున ఆ పాత్ర కూడా నార్మల్‌గా మారిపోతుంది. స్మూత్‌గా వంట చేయడానికి కుదరదు. అయితే.. కొన్ని వంటలు ఇందులో చేయడం వల్ల.. ఈ టెప్లాన్ కోటింగ్ త్వరగా దెబ్బ తినే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. అందువల్ల వాటిని నాన్ స్టిక్ పాత్రల్లో వండకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
నాన్ స్టిక్ పాత్రల్లో నిమ్మకాయ రసంతో కూడిన వంటలు చేయకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. టమాటాలు వేసే కర్రీలను కూడా ఇందులో ఉడికించకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. ఆమ్లత్వం ఎక్కువగా ఉండే వాటిని నాన్ స్టిక్ పాత్రల్లో వండడం వల్ల.. ఆ పాత్ర బేస్‌ను ఇవి త్వరగా దెబ్బ తీస్తాయట. ఈ ఆహారాలను ఎంత ఎక్కువగా ఈ పాన్‌పై ఉడికిస్తే.. పాన్ బేస్‌ను అంత వేగంగా పాడు చేస్తాయని చెబుతున్నారు.
వంట చేస్తున్నప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇతర పాత్రల్లో వంట చేసేటప్పుడు.. గిన్నె స్టౌ మీద పెట్టి, వేడెక్కిన తర్వాత నూనె వేస్తారు. కానీ.. నాన్‌స్టిక్ పాత్రలను మంట మీద ఖాళీగా పెట్టొద్దట. స్టౌ మీద పెట్టిన వెంటనే అందులో నూనె పోయాలని సూచిస్తున్నారు. ఇక కర్రీ కలపడానికి ఇనుప గరిటెలు కాకుండా చెక్కతో తయారైనవి సెలక్ట్ చేసుకోవడం బెటర్. దీనివల్ల పాత్రలపై గీతలు పడకుండా.. ఎక్కువ కాలం వస్తాయి.
ఇక నాన్ స్టిక్ పాత్రలను క్లీన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. వీటిని సింక్‌లో పడేసి ఇతర గిన్నెలను రుద్దినట్టు.. బలంగా రుద్దకూడదని చెబుతున్నారు. అదేవిధంగా.. అధిక గాఢత గల సబ్బులు, గరుకుగా ఉండే పీచులు కూడా వాడొద్దని సూచిస్తున్నారు. వీటివల్ల కూడా కోటింగ్ దెబ్బతిని పోతుందని సూచిస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే.. పాన్ చాలా రోజులు వస్తుందని చెబుతున్నారు.
ఐరన్ దోశ పెనం త్వరగా తుప్పు పడుతోందా? - ఇలా క్లీన్ చేస్తే ఆ సమస్యే ఉండదు!