How to Increase Children Weight : పిల్లలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులూ కోరుకుంటారు. వాళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే.. శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలి. అందుకోసం చిన్నప్పటి నుంచే వారికి మంచి పోషకాహారం అందించాలి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాన్ని తప్పక తినిపించాలి. అయితే నేటి కాలంలో పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారానికి బదులు.. చిప్స్, బర్గర్, పిజ్జా, మోమో, ఫాస్ట్ ఫుడ్స్‌కు ఎట్రాక్ట్ అవుతున్నారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావని తెలిసినా వాటిని తినడం మాత్రం మారరు. అయితే ఈ అలవాటును మాన్పించడానికి పిల్లలకు పోషకహారాన్ని అలవాటు చేయాలని.. తద్వారా జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటారని అంటున్నారు. ఇలా పిల్లలకు సరైన పోషకాహారం అందించడం వల్ల పిల్లలు ఎత్తు, బరువుతో పాటు మానసికంగా కూడా ఎంతో డెవలప్ అవుతారని చెబుతున్నారు. మరి ఆ ఫుడ్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ప్రతిరోజూ గుడ్లు: గుడ్లు ఆరోగ్యానికి చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో ప్రొటీన్లు, విటమిన్ డి, బి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫోలిక్ యాసిడ్‌తో పాటు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా పిల్లలకు తినపించడం.. వారి ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సహాయపడుతుందని అంటున్నారు. గుడ్డు పిల్లలను ఆరోగ్యంగా, ఫిట్‌గా మార్చడమే కాకుండా ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ పిల్లలను మానసికంగా దృఢంగా మార్చడంలో కూడా సహాయపడుతుందంటున్నారు. ఇదే విషయాన్ని మయో క్లినిక్ కూడా స్పష్టం చేసింది(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
పాలు తాగడం: పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి కోసం వారి ఆహారంలో పాలు చేర్చడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఇందులో కాల్షియం, విటమిన్ డి, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయని అంటున్నారు. ఈ కారణంగా, పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి రెండూ వేగంగా జరుగుతాయని చెబుతున్నారు.
రోజూ కొన్ని డ్రై ఫ్రూట్స్: పలు రకాల డ్రై ఫ్రూట్స్‌లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి చాలా ముఖ్యమైనవని.. అందువల్ల పిల్లలకు డ్రై ఫ్రూట్స్‌ను తినిపించడం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా బాదం, వాల్‌నట్స్, ఎండుద్రాక్ష, జీడిపప్పు, మఖానా వంటి డ్రై ఫ్రూట్స్‌ను పిల్లల డైట్‌లో చేర్చాలని చెబుతున్నారు.
అరటిపండు: ఎదిగే పిల్లలకు రోజూ అరటిపండు తినిపిస్తే ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. అరటిపండులో విటమిన్ బి6, సి, ఎ, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయని.. దీన్ని తినడం వల్ల పిల్లలకు తక్షణ శక్తి వస్తుందని అంటున్నారు. రోజూ అరటిపండు తింటే పిల్లల మానసిక ఎదుగుదల కూడా బాగుంటుందని సూచిస్తున్నారు.
ఆవు నెయ్యి : పిల్లలు శారీరకంగా ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలంటే వారి ఆహారంలో ఆవు నెయ్యిని కూడా చేర్చాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. నెయ్యి వల్ల పిల్లలకు మంచి కొవ్వు, DHA లభిస్తాయంటున్నారు. నిత్యం నెయ్యి తినడం వల్ల పిల్లల మెదడు కూడా షార్ప్ అవుతుందని.. నెయ్యిలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయకారిగా ఉంటాయని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తున్నారా ? అయితే తస్మాత్ జాగ్రత్త - వైద్యులు ఏం చెబుతున్నారంటే ?
పిల్లల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోందా? - విద్యార్థుల ప్రవర్తనపై తల్లిదండ్రుల నిఘా తప్పనిసరి!
చిన్నారుల్లో "ఊబకాయం" - ఈ ఆహారం తినిపిస్తే సమస్య తగ్గిపోతుందట!