Home Remedies To Stop Runny Nose : వర్షాకాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల దగ్గు, జలుబు వంటి పలు ఆరోగ్య సమస్యలు రావడం సహజం. అందులో ముఖ్యంగా చాలా మందికి జలుబు(Cold) చేసినప్పుడు ముక్కు కారుతుంటుంది. పదే పదే ముక్కు కారడం వల్ల ఏ పనీ సక్రమంగా చేయలేం. అలాంటి టైమ్‌లో కొన్ని పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం, ఆవిరి పట్టడం.. మొదలైన వాటి వల్ల తొందరగా ముక్కు కారే సమస్య నుంచి ఈజీగా ఉపశమనం పొందవచ్చంటున్నారు నిపుణులు. 'వంటగదే మన ఫార్మసీ' అంటూ కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వేడి కాపడం : ముక్కు కారుతున్నప్పుడు వేడి కాపడం పెట్టడం వల్ల ఉపశమనం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం.. వేడినీటిలో మెత్తటి క్లాత్‌ను ముంచి గట్టిగా పిండేసిన తర్వాత.. ముక్కు, నుదురు, చెంపలపై కాపడం పెట్టాలి. తద్వారా శ్వాస తీసుకోవడం సులువై ముక్కు కారే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు. అలాకాకుండా వేడినీటితో స్నానం చేసినా కొంతమేర ఫలితం ఉంటుందంటున్నారు.
ఆవిరి పట్టడం : ఇది కూడా జలుబు నుంచి ఉపశమనం పొందడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక బౌల్లో కొన్ని వేడి వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు లేదా నీలగిరి నూనె/పెప్పర్మింట్ ఆయిల్ రెండు చుక్కలు వేసి ఆవిరి పట్టండి. అయితే, ఆవిరి పట్టేటప్పుడు ఫేస్‌కి, వాటర్‌కి కనీసం 10 ఇంచుల దూరం ఉండేలా చూసుకోవాలి. అలాగే ఐదు నిమిషాలైనా ఆవిరి పట్టేలా చూసుకోవాలని చెబుతున్నారు.
ఎక్కువ వాటర్ తాగడం : చాలా మంది వర్షాకాలం వాతావరణం కూల్‌గా ఉండడం వల్ల ఎక్కువ వాటర్ తాగడానికి ఇష్టపడరు. అలాగే.. జలుబు చేసినప్పుడు అంతగా వాటర్ తీసుకోవాలనిపించదు. కానీ, ఆ టైమ్‌లో నీళ్లు ఎక్కువగా తాగాలంటున్నారు నిపుణులు. అలా తాగడం వల్ల ఇన్ఫెక్షన్ త్వరగా తగ్గి ముక్కు కారే ప్రాబ్లమ్ నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు.
అల్లం టీ : మన పెద్దలు ఇప్పటికీ జలుబు, దగ్గు, గొంతునొప్పి లాంటి సమస్యలు ఎదురైనప్పుడు కొంచెం అల్లం టీ తాగమని చెబుతుంటారు. వారు చెప్పినట్టే ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఈ అనారోగ్య సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయంటున్నారు నిపుణులు. దీని కోసం కొన్ని అల్లం ముక్కలు తీసుకుని వాటిని బాగా దంచి.. నీటిలో లేదా పాలలో కలపిన తర్వాత బాగా మరిగించి తాగమంటున్నారు.
2016లో "జర్నల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. అల్లం టీలో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శ్లేష్మ ఉత్పత్తిని తగ్గించి జలుబు లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో దక్షిణ కొరియాలోని Daegu Haanyang Universityకి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ E.K. Choi పాల్గొన్నారు. అల్లంలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జలుబును నివారించడంలో తోడ్పడుతాయని ఆయన పేర్కొన్నారు.
సూపర్ న్యూస్: వర్షాకాలంలో జలుబు, తుమ్ములు తగ్గాలంటే - ఈ టిప్స్ పాటించండి!
తేనె టీ : ఈ హెర్బల్ టీ కూడా జలుబు నివారణకు చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక గ్లాసు మరిగించిన వాటర్ తీసుకొని అందులో చెంచా తేనె, అరచెక్క నిమ్మరసం పిండుకొని వేడివేడిగా తాగితే సరిపోతుందంటున్నారు. లేదంటే.. కొద్దిగా పసుపు, నల్లమిరియాలు, తేనె కలిపిన మిశ్రమం తీసుకున్నా ముక్కు కారే సమస్య నుంచి రిలీఫ్ పొందవచ్చంటున్నారు. అలాగే.. రోజుకు కనీసం 2-3 సార్లు తులసి నీరు/టీ తాగినా మంచి ఫలితం ఉంటుందంటున్నారు.
ఇవేకాకుండా.. జలుబు చేసినప్పుడు కాస్త కారంగా ఉండే ఆహారాలు తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు. అలాగే.. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరి, పైనాపిల్, నిమ్మ, నారింజ, కివీ, స్ట్రాబెర్రీ మొదలైన పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. అదేవిధంగా వీలైనంతవరకు ఇంట్లో వండిన, తేలికగా ఉండే ఆహారానికే ప్రాధాన్యమివ్వాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు, అజీర్తి సమస్యలు వస్తాయా? - నిపుణులు ఏమంటున్నారంటే?