High Blood Pressure Patients Need To Avoid These Food : అధిక రక్తపోటుతో బాధపడే వారిని ఇతర ఆరోగ్య సమస్యలు కూడా చుట్టు ముడతాయి. గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాలు వెంటాడుతాయి. కాబట్టి.. హై-బీపీ పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో వారు తినకూడని ఆహార పదార్థాలను సూచిస్తున్నారు. ఏంటో ఇప్పుడు చూద్దాం.
రెడీ-టు-ఈట్ సూప్‌లు :
ఈ రోజుల్లో చాలా మంది మార్కెట్లో దొరికే రెడీ టు ఈట్ సూప్‌లను కొనుగోలు చేసి, ఇంట్లో వేడి చేసుకుని తాగుతున్నారు. అయితే.. అధిక రక్తపోటు ఉన్నవారు వీటిని అస్సలు తాగకూడదని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు మనం ఒక క్యాన్‌డ్ చికెన్ నూడుల్స్ సూప్ తీసుకుంటే అందులో అరకప్పులోనే 890 mg సోడియం ఉంటుందట. ఇది బీపీ పేషెంట్లకు ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు.
చీజ్ :
హై బీపీ పేషెంట్లు వారు తినే ఆహారంలో చీజ్‌ను తీసుకోకూడదు. ఎందుకంటే ఇందులో కూడా ఉప్పు ఎక్కువగా ఉంటుంది.
కూల్‌డ్రింక్స్ :
షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్‌కు అధిక రక్తపోటు ఉన్నవారు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి రక్తపోటుతోపాటు బరువు కూడా పెరిగేలా చేస్తాయి. బ్రిటిష్ మెడికల్ జర్నల్ ( BMJ) ప్రచురించిన నివేదిక ప్రకారం.. షుగర్ ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోవడం వల్ల బీపీ పెరిగే అవకాశం 20 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారట. ఈ అధ్యయనంలో 1,20,000 మందిని 12 సంవత్సరాల పాటు పరిశీలించారు.
వైన్ :
మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే.. రోజూ ఒకటి లేదా రెండు గ్లాసుల రెడ్ వైన్ మాత్రమే తాగాలట. అంతకంటే ఎక్కువ తాగడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉందని నిపుణులంటున్నారు.
ఫ్రెంచ్ ఫ్రైస్ :
చాలా మంది ఇష్టంగా తినే జంక్‌ఫుడ్‌లో ఫ్రైంచ్ ఫ్రైస్ ఒకటి. అయితే.. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు వీటిని అస్సలు తినకూడదు. వీటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది.
ఇంకా :
- అధిక రక్తపోటు ఉన్నవారు మటన్, చికెన్‌కు దూరంగా ఉండాలని.. ఫ్రై చేసిన మాంసాన్ని తినకూడదని హైదరాబాద్‌కు చెందిన పోషకాహార నిపుణులు డాక్టర్ అంజలీదేవి సూచిస్తున్నారు.
- దుంపల్లో కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా తీసుకుంటే కొవ్వు పేరుకుపోతుంది. ఇది బీపీ పేషెంట్లకు మంచిది కాదని సూచిస్తున్నారు.
- అధిక రక్తపోటు ఉన్న వారు పిజ్జా తినకూడదని చెబుతున్నారు. ఇందులో ఉప్పు, సంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది.
- ఎంతో ఇష్టంగా తినే పాప్‌కార్న్‌లో కూడా ఉప్పు అధికంగా ఉంటుంది. అందుకే హైబీపీ పేషెంట్లు బయట దొరికే పాప్‌కార్న్ తినకూడదు.
- మనం రోజూ తాగే మినరల్ వాటర్‌లో కూడా సోడియం ఉంటుంది. దాదాపు లీటర్ నీటిలో సోడియం 200 మి.గ్రా కంటే ఎక్కువగా ఉంటుందట. కాబట్టి, అధిక రక్తపోటు ఉన్న వారు మినరల్ వాటర్‌కు దూరంగా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
- ఇక ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే ఊరగాయలను.. బీపీతో బాధపడేవారు అస్సలు తినొద్దని నిపుణులు చెబుతున్నారు.
హైబీపీతో బాధపడుతున్నారా?.. ఇవి తింటే ఈజీగా తగ్గిపోతుంది!
మీకు హై బీపీ ఉందా? - ఈ ఆహారం అస్సలు తీసుకోకండి!
Prathidwani: గుండె గండం నుంచి గట్టెక్కేది ఎలా.. నివేదికలు, వైద్యులేం చెబుతున్నారు?