Health Benefits of Watermelon Seeds : ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో మెజార్టీ పీపుల్ ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడం కోసం పుచ్చకాయను తింటుంటారు. నిజానికి, ఈ సమ్మర్ స్పెషల్ ఫ్రూట్లో శరీరానికి చలువనిచ్చే గుణాలు పుష్కలంగా ఉంటాయి. కానీ, చాలా మంది ఈ పండును తినేటప్పుడు దీని గింజలను పక్కన పడేస్తుంటారు. మీరూ పుచ్చకాయను(Watermelon) తినేటప్పుడు ఇలాగే చేస్తున్నారా? అయితే, బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నట్లేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ, పుచ్చ గింజలతో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పోషకాల పవర్ హౌస్ : పుచ్చకాయలో ఉండే పోషక విలువల్లో ఎక్కువ భాగం వాటి గింజల నుంచే లభిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా వీటిలో ప్రొటీన్లు, విటమిన్స్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఐరన్, కాపర్, జింక్, మాంగనీస్, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయంటున్నారు. కాబట్టి వీటిని తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
గుండె జబ్బులను తగ్గిస్తాయి : పుచ్చకాయ గింజల్లో మోనో అన్‌శ్యాచురేటెడ్, పాలీ అన్‌శ్యాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వీటిని డైట్‌లో చేర్చుకోవడం ద్వారా గుండె నొప్పి, గుండెపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాకుండా, ఈ గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.
2020లో "Journal of the American College of Cardiology" అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. పుచ్చకాయ గింజలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయని వెల్లడైంది. ఈ పరిశోధనలో యూఎస్ఏలోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రముఖ పోషకాహార నిపుణుడు డాక్టర్ కి వాంగ్ పాల్గొన్నారు. పుచ్చకాయ గింజలను క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి : పుచ్చకాయ గింజలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా మీ జీర్ణక్రియను మెరుగుపరచుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తీసుకోవడం ద్వారా జీర్ణశక్తిని పెంచుకోవడమే కాకుండా గట్ సిస్టమ్ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చంటున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి : పుచ్చకాయ గింజలు జింక్, విటమిన్ సి వంటి రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఈ గింజలను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తినేసిన పుచ్చకాయ ముక్కలతో - నోరూరించే సూపర్ చట్నీ- టేస్ట్‌కు ఫిదా అయిపోతారు!
జ్ఞాపకశక్తిని పెంపొందిస్తాయి : పుచ్చ గింజల్లో శరీరానికి శక్తినిచ్చే గుణాలు అధికంగా ఉంటాయి. ప్రత్యేకించి వీటిలోని ఫ్యాటీ యాసిడ్స్ ఆకలి కోరికలను అదుపు చేస్తాయి. కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. అలాగే.. మెదడు పనితీరు మెరుగుపడి జ్ఞాపకశక్తి పెంపొందడంలో ఈ గింజల్లోని ఫోలిక్ యాసిడ్ బాగా పనిచేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
చర్మ సంరక్షణకు తోడ్పడతాయి : ముఖంపై ముడతలు తొలగిపోయి మిలమిలలాడాలంటే పుచ్చకాయ గింజలను డైట్‌లో భాగం చేసుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ఇందులోని మెగ్నీషియం, జింక్, ఇతర ఖనిజ లవణాలు చర్మంలోని విష తుల్యాలను తొలగించి.. వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుపడతాయంటున్నారు. అంతేకాకుండా ఈ గింజల్లో చర్మమే కాదు.. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో పోషకాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
ఇవేకాకుండా.. క్రమం తప్పకుండా పుచ్చ గింజలను తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చంటున్నారు నిపుణులు. అలాగే ఇందులో ఉండే పోషకాలు కండరాలను దృఢంగా మార్చడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో, రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించడంలో చాలా బాగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వీటిని ఎలా తీసుకోవాలంటే.. చాలామంది సాధారణంగా పుచ్చకాయ గింజలను ఎండబెట్టి తింటుంటారు. అయితే, ఇలా డైరెక్టుగా తినడం ఇష్టం లేకపోతే వేయించుకుని తినచ్చంటున్నారు నిపుణులు. అలాగే వీటిని పొడిగా చేసుకుని వివిధ రకాల ఫ్రూట్ సలాడ్స్, సూప్స్, స్మూతీలలో కలుపుకొని తీసుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పుచ్చకాయ తింటే పురుషుడి సెక్స్ సామర్థ్యం పెరుగుతుందట- అసలేం సంబంధం?