Health Benefits Of Unpolished Rice : ప్రస్తుత కాలంలో మెజార్టీ జనాలు బాగా పాలిష్ చేసిన తెల్లటి బియ్యమే తింటున్నారు. నిజానికి ఈ రోజుల్లో మనం తింటున్న పాలిష్డ్ బియ్యంలో ఉన్నది కేవలం పిండి పదార్థాలు మాత్రమే. మన సంప్రదాయ ఆహారమైన దంపుడు బియ్యంతో పోలిస్తే.. రుచిలోగాని, పోషకాలలోగాని పాలిష్డ్ బియ్యం ఏమాత్రం పోటీనే కాదు. వరి ధాన్యంపై పొట్టు తొలగించగా వచ్చే బియ్యం గింజలనే.. దంపుడు బియ్యం అంటారు. అయితే, ఈ దంపుడు బియ్యం రోజూ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులంటున్నారు. వీటిని తినడం వల్ల కలిగే హెల్త్ బెన్ఫిట్స్ ఏంటో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు 'డాక్టర్ అంజలీ దేవి' వివరిస్తున్నారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పోషకాలు పుష్కలం : దంపుడు బియ్యంలో ఆరోగ్యానికి మేలు చేసే ఖనిజాలు, పోషకాలు, సమృద్ధిగా ఉంటాయి. వరి పొట్టుకింద ఉండే తవుడు పొరలో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. బియ్యాన్ని పాలిష్ పట్టినప్పుడు తవుడుతోపాటు ఇవన్నీ తొలగిపోతాయి.
షుగర్ అదుపులో : ప్రస్తుత కాలంలో చాలా మంది జనాలు షుగర్‌తో బాధపడుతున్నారు. వీరు రోజూ దంపుడు బియ్యం తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులను అదుపులో ఉండేలా చూసుకోవచ్చు. ఎందుకంటే.. దంపుడు బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే షుగర్‌తో బాధపడేవారు దంపుడు బియ్యం తినాలని డాక్టర్ అంజలీ దేవి సూచిస్తున్నారు.
దంపుడు బియ్యం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయజనాలపై కొన్ని పరిశోధనలు కూడా జరిగాయి. అయితే, వారానికి ఐదు, అంతకన్నా ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవటం వల్ల డయాబెటిస్ ముప్పు పెరుగుతున్నట్టు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు కనుగొన్నారు. వైట్ రైస్‌ని 50 గ్రాములు తగ్గించి, వాటి స్థానంలో దంపుడు బియ్యాన్ని చేర్చుకుంటే షుగర్ ముప్పు 16 శాతం వరకు తగ్గుతున్నట్టు వెల్లడించారు.
గుండె ఆరోగ్యంగా : దంపుడు బియ్యంలో ఉండే పీచు పదార్థం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. అలాగే శరీర బరువును అదుపులో ఉండేలా చూస్తుంది. ఈ బియ్యాన్ని డైట్లో భాగం చేసుకోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది : దంపుడు బియ్యంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు దీనిని డైట్లో భాగం చేసుకోవడం వల్ల సమస్య తగ్గుతుంది.
క్యాన్సర్‌ని నివారిస్తుంది : థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి, విశృంఖల కణాలను అడ్డుకోవటానికి తోడ్పడే సెలీనియం కూడా దంపుడు బియ్యంలో అధికంగా ఉంటుంది. ఇందులోని లిగ్నాన్లనే పాలీఫెనాల్స్ పేగుల్లోకి చేరిన తర్వాత.. ఫైటోఈస్ట్రోజన్ ఎంటెరోలాక్టేన్‌గానూ మారతాయి. ఇవి క్యాన్సర్ నివారకంగా పనిచేయటమే కాకుండా గుండె హెల్దీ ఉండటానికీ దోహదం చేస్తాయి.
- అధిక రక్తపోటుతో బాధపడే వారు ప్రతిరోజు దంపుడు బియ్యం తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అందుకే అధిక రక్తపోటుతో బాధపడేవారు దంపుడు బియ్యాన్ని తినాలని డాక్టర్ అంజలీ దేవి సూచిస్తున్నారు.
- దంపుడు బియ్యంలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా, దృఢంగా ఉంటాయి.
- దంపుడు బియ్యం కొద్దిగా తీసుకున్న కూడా పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల త్వరగా ఆకలి వేయదని డాక్టర్ అంజలీ దేవి చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
రెడ్ రైస్ గురించి మీకు తెలుసా? - అంత మంచిదా?