Health Benefits of Taking Honey with These Ingredients: తేనె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డైలీ ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి. అయితే, తేనెను విడిగా కాకుండా కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులంటున్నారు.
వెల్లుల్లితో: పొట్టు తీసిన వెల్లుల్లిని తేనెలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు. వెల్లుల్లి, తేనెలోని గుణాలు శరీరంలోని మంటను, వాపును తగ్గిస్తాయని.. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెంచుతాయని చెబుతున్నారు. అలాగే శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, విరేచనాల వంటివి రాకుండా వీటిలోని పోషకాలు కాపాడతాయని అంటున్నారు. ఉబ్బసం, గుండె జబ్బులు, మలబద్ధకం, అధిక రక్తపోటు, కీళ్లనొప్పులు, పంటి నొప్పి సమస్యలను నివారిస్తుందని పేర్కొన్నారు.
వేడి నీటితో: చాలా మంది ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా కప్పు వేడి నీళ్లలో టేబుల్ స్పూన్ తేనె కలుపుకుని తాగుతుంటారు. అలాగే కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకుంటారు. ఇలా ఖాళీ కడుపుతో తేనె నీటిని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ మెరుగుపడుతుందని అంటున్నారు. శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు.
దాల్చినచెక్క పొడి: కప్పు వేడి నీటిలో కొద్దిగా దాల్చినచెక్క పొడి, తేనెను కలిపి రోజూ ఉదయాన్నే తాగాలి. ఇలా తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా షుగర్ అదుపులో ఉంటుందని పేర్కొన్నారు.
2010లో "International Journal of Food Sciences and Nutrition" జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. టైప్-2 మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తుల రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో దాల్చినచెక్క, తేనె సమర్థవంతంగా పని చేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లాజిజ్ విశ్వవిద్యాలయానికి చెంది ప్రొఫెసర్ డాక్టర్ అహ్మద్ అల్-అగ్రా పాల్గొన్నారు.
పాలలో: గోరువెచ్చని పాలలో తేనెను కలిపి ప్రతిరోజు తాగడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుందని అంటున్నారు. అలాగే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే తేనె కలిపిన పాలను తాగడం వల్ల మహిళల్లో గర్భాశయ సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మహిళల్లో ఈ దశలో మలబద్ధకం గ్యారెంటీ.. నివారణకు ఇలా చేయాల్సిందే! - Menopause and Constipation Relation