Health Benefits of Spicy Foods : స్పైసీ ఫుడ్‌కు దూరంగా ఉండడం కన్నా.. వాటిని తినడం వల్లనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుందని చెబుతున్నారు. మిరపకాయల్లో ఉండే క్యాప్సైసిన్ ఇందుకు చాలా బాగా సహాయపడుతుందట. ముఖ్యంగా స్పైసీ ఫుడ్స్ బాడీలో కేలరీలను కరిగించడానికి చాలా బాగా సహాయపడతాయట. ఫలితంగా.. వెయిట్ కంట్రోల్లో ఉంటుందని చెబుతున్నారు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కాస్త నాలుకకు కారం తగిలిస్తే మంచిదని సూచిస్తున్నారు.
నొప్పి నివారణి : స్పైసీ ఫుడ్ మంచి పెయిన్ కిల్లర్‌గా పని చేస్తుందంటున్నారు నిపుణులు. మిరపలో ఉండే క్యాప్సైసిన్లో నొప్పి నివారణ లక్షణాలు కూడా ఉంటాయట. అదేవిధంగా మిర్చిలో ఉండే పోషకాలకు వాపును తగ్గించే గుణం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా.. ఆర్థరైటీస్, కండరాల నొప్పి ఉన్నవారు తరచుగా కాస్త స్పైసీ ఫుడ్ తీసుకోవడం ద్వారా మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
పెప్టిక్ అల్సర్‌లను నివారిస్తుంది : స్పైసీ ఫుడ్ అల్సర్‌లకు కారణమవుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ, అది ఒక సాధారణ అపోహ మాత్రమే అంటున్నారు వైద్యులు. ఎందుకంటే.. క్యాప్సైసిన్ కడుపులో యాసిడ్ ఉత్పత్తిని నిరోధిస్తుందట. దీర్ఘకాలిక మందుల వాడకం, H. పైలోరీ బ్యాక్టీరియా వంటివి తరచుగా అల్సర్‌లకు కారణమవుతాయట. క్యాప్సైసిన్ ద్వారా వీటిని అడ్డుకోవచ్చని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఎడ్విన్ మెక్‌డొనాల్డ్ చెబుతున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది : కారంగా ఉండే ఆహారాలు మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని చెబుతున్నారు నిపుణలు. ఎందుకంటే.. వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడడమే అనేక వ్యాధుల నుంచి రక్షణను అందిస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది : మిరపలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, క్యాప్సైసిన్, కొన్ని పోషకాలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు. ఒక అధ్యయనం ప్రకారం.. క్యాప్సైసిన్ ఆరోగ్యకరమైన కణాలకు హాని కలిగించకుండా ఎలుకలలోని పెద్ద సంఖ్యలో ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలను విజయవంతంగా చంపేసిందట. అయితే.. క్యాప్సైసిన్ సామర్థ్యాన్ని పెంచడానికి మరింత పరిశోధన అవసరమని భావిస్తున్నారు.
ఆయుష్షును పెంచుతుంది : స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. 'హార్వర్డ్స్ టి.హెచ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్'.. ఏడేళ్లపాటు దాదాపు 5 లక్షల మంది మీద జరిపిన అధ్యయనంలో.. స్పైసీ ఫుడ్ తినేవారికి ఆయుర్దాయం ఎక్కువని తేలింది. అలాగని, మరీ ఎక్కువ కారం తిని సమస్యలు కొనితెచ్చుకోకండని సూచిస్తున్నారు నిపుణులు.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : ఆహారంలో తగినంత కారం చేర్చుకోవడం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మిర్చిలో ఉండే క్యాప్సైసిన్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో చాలా బాగా సహాయపడుతుందట. రక్తప్రసరణను మెరుగుపరచి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అయితే.. స్పైసీ ఫుడ్‌తో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదని చెబుతున్నారు. అలా తీసుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు నిపుణులు. కడుపులో మంట, అజీర్ణం, విరేచనాలు, గుండెల్లో మంట, అలర్జీలు వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
నోట్ : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బరువు తగ్గాలంటే - ఈ ఫుడ్ కాంబినేషన్స్ అస్సలు ముట్టుకోకండి! - Food Combinations Cause for Obesity