Health Benefits of Puffed Rice : మరమరాలను పలు ప్రాంతాల్లో.. వివిధ పేర్లతో పిలుస్తారు. పేలాలు, బొరుగులు, బొంగు పేలాలు, ముర్ముర్లు, మురీలు అని రకరకాల పేర్లతో పిలుస్తారు. బియ్యాన్ని(Rice) అధిక పీడనానికి గురిచేయడం ద్వారా ఈ మరమరాలను తయారు చేస్తారు. అందుకే.. వీటిని పఫ్డ్ రైస్ అని కూడా పిలుస్తారు. ఈ మరమరాలు సాధారణ బియ్యం కన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయని, తరచుగా తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ.. వీటిని తినడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కేలరీలు తక్కువ : మరమరాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గాలనుకునే వారికి, తక్కువ కేలరీల ఆహారం తీసుకోవాలనుకునే వారికి మంచి ఆరోగ్యకరమైన ఎంపిక అని చెబుతున్నారు నిపుణులు. వీటిని స్నాక్స్, టిఫిన్స్ రూపంలో తీసుకోవడం వల్ల ఆకలి తగ్గడమే కాకుండా బరువు కూడా పెరిగే ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు.
గ్లూటెన్-ఫ్రీ : సహజంగా పఫ్డ్ రైస్ గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఇవి గ్లూటెన్ తినడానికి ఇష్టపడని వారు లేదా ఉదరకుహర వ్యాధి ఉన్న వ్యక్తులకు చక్కటి ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరమరాలలో విటమిన్ డి, విటమిన్ బి, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.
కార్బోహైడ్రేట్లు అధికం : మరమరాలలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. గ్లైకోజెన్ నిల్వలు, కండరాలకు తిరిగి శక్తిని అందించడానికి వర్కౌట్‌లకు ముందు లేదా తర్వాత వీటిని తీసుకోవడం మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
అవిసె గింజెలు తినట్లేదా? - ఎన్ని ప్రయోజనాలు కోల్పోతున్నారో తెలుసా?
సోడియం తక్కువ : సాధారణంగా పఫ్డ్ రైస్‌లో సోడియం తక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి ఇది ఉప్పు లేకుండా ఉండే స్నాక్ ఐటమ్. సోడియం అధికంగా ఉండే ఇతర అనేక ప్యాక్ చేసిన స్నాక్స్‌తో పోల్చితే ఇవి ఆరోగ్యకరమైన ఎంపికగా చెప్పుకోవచ్చు. అయితే వీటిని ప్రతిరోజు తీసుకుంటే గనుక రక్తపోటు స్థిరంగా ఉండడమే కాకుండా గుండె జబ్బులు నుంచీ దూరంగా ఉంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది : మరమరాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పఫ్డ్ రైస్ తీసుకుంటే 17 గ్రాముల ఫైబర్ అందుతుందని చెబుతున్నారు నిపుణులు. అదే విధంగా ఇందులో ఉండే పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మలబద్ధకాన్ని తగ్గిస్తాయంటున్నారు నిపుణులు. ఇవి మరింత సులభంగా జీర్ణం కావడానికి వీటిని నీటిలో లేదా పాలలో నానబెట్టి తీసుకోవచ్చని చెబుతున్నారు.
ఇక ఈ మరమరాలను స్నాక్స్, డెజర్ట్‌లు, వివిధ రుచికరమైన వంటకాలతో కలిపి తీసుకోవచ్చు. అయితే వీటి రుచి, పోషక విలువలను మెరుగుపరచడానికి నట్స్, డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు వంటి ఇతర పదార్థాలను యాడ్ చేసి తీసుకోవచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ముద్దులొలికే చిన్నారులకు ముద్దు పెడుతున్నారా? - వారి ఆరోగ్యం డేంజర్లో పడ్డట్లే!