Jowar Roti Health Benefits : ప్రస్తుత రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చాలా మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది బరువు తగ్గాలని డైట్ పాటిస్తూ.. రాత్రిపూట చపాతీలు తీసుకుంటూ ఉంటారు. అయినా, ఫలితం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. అలాకాకుండా కొన్ని రకాల చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం మేలంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రత్యేకించి.. జొన్నలతో చేసే ఈ వంటకాన్ని తరచుగా తీసుకోవడం ద్వారా కొద్ది రోజుల్లోనే ఈజీగా బరువు(Weight) తగ్గొచ్చంటున్నారు. ఇంతకీ, జొన్నలలో ఎలాంటి పోషకాలు ఉంటాయి? బరువు తగ్గడానికి తోడ్పడే ఆ వంటకమేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జొన్నల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జొన్నల్లో గ్లూటెన్ ఉండదు. కాబట్టి ఇది అందరికీ మంచి ఆహారమని చెబుతున్నారు. ఫైబర్ పుష్కలంగా ఉండే ఇవి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు. అంతేకాదు.. రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రించడంలో ఇవి తోడ్పడతాయి. కాబట్టి, మధుమేహంతో బాధపడేవారికి జొన్నలతో చేసే ఆహారాలు మంచి ఎంపికగా చెప్పుకోవచ్చంటున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా.. బరువు తగ్గడానికి జొన్నలు చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. డైలీ చపాతీకి బదులుగా 'జొన్న రొట్టె' తినడం ద్వారా మంచి ఫలితం ఉంటుందంటున్నారు. ఎందుకంటే.. జొన్నల్లో సమృద్ధిగా ఉండే ఫైబర్, ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఉంటాయి. ఫలితంగా జొన్నరెట్టె తినడం ద్వారా ఎక్కువసేపు పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ తినాలనే కోరిక తగ్గుతుంది. దీంతో క్రమంగా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు.
2019లో "అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 12 వారాల పాటు జొన్న రొట్టె తినే వ్యక్తులు గోధుమ రొట్టె తినే వారి కంటే ఎక్కువ బరువు తగ్గారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో కెనడాలోని యూనివర్శిటీ ఆఫ్ టొరంటోకు చెందిన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జేమ్స్ పెర్రీ పాల్గొన్నారు. జొన్నరొట్టెలోని పోషకాలు బరువు తగ్గడానికి చాలా బాగా సహాయపడుతాయని పెర్రీ పేర్కొన్నారు.
ఎంత ట్రై చేసినా బరువు తగ్గట్లేదా? - ఇలా చేస్తే వారానికి అరకిలో తగ్గడం గ్యారెంటీ!
జొన్నలతో చేసిన రొట్టె తినడం ద్వారా మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. ఐరన్, మెగ్నీషియం, కాపర్, క్యాల్షియం, జింక్, విటమిన్ బి-3 లాంటి పోషకాలు పుష్కలంగా ఉండే జొన్నలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. అలాగే, జొన్నల్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందచ్చని సూచిస్తున్నారు.
అదేవిధంగా, జొన్నలలోని పోషకాలు రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయులను పెంచడంలో సహకరిస్తాయి. తద్వారా గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. అంతేకాదు.. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉంటాయి. ఇవి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడతాయంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
హెచ్చరిక : వేగంగా బరువు తగ్గాలని చూస్తున్నారా? - ఆరోగ్యానికి తీవ్ర ముప్పు - వారానికి ఇంతే తగ్గాలి!