Hair Colouring Side Effects : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్యతో బాధపడుతున్నారు. దీంతో జుట్టు నల్లగా కనిపించడానికి హెయిర్ కలర్స్ వేసుకుంటున్నారు. అలాగే కొందరు ఫ్యాషన్ పేరుతో కూడా రకరకాల కలర్‌లు జుట్టుకు వేసుకుంటారు. అయితే, ఇలా జుట్టుకు రంగు వేసుకుంటే చూడటానికి బాగానే ఉంటుంది. కానీ, ఇలా తరచూ వేసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హెయిర్ కలర్ వేసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ? అనేది ఇప్పుడు చూద్దాం.
జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్:
పొడిగా మారుతుంది : జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల హెయిర్‌లోని నాచురల్ ఆయిల్స్ తొలగిపోతాయని.. దీనివల్ల జుట్టు పొడిగా మారి నిర్జీవంగా తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు.
పెళుసుగా మారడం : ఎక్కువగా హెయిర్ కలర్స్ వేసుకోవడం వల్ల జుట్టు క్యూటికల్స్ దెబ్బతింటాయట. దీనివల్ల జుట్టు పెళుసుగా మారి తెగిపోతుందని.. అలాగే ఎక్కువగా రాలిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గుడ్లలో వీటిని కలిపి జుట్టుకు అప్లై చేస్తే చాలు- స్మూతీ హెయిర్ గ్యారెంటీ! - Eggs For Hair Health
చికాకు, అలర్జీ : దాదాపు మార్కెట్‌లో దొరికే చాలా హెయిర్ కలర్స్‌లో కెమికల్స్ ఉపయోగిస్తారు. అయితే, కొంతమందికి ఈ కెమికల్స్ పడకపోవచ్చు. ఇలాంటి వారు జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల చికాకు, దురద, చర్మం ఎర్రగా మారడం, వాపు, అలర్జీ వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 2007లో 'కాంటాక్ట్ డెర్మటైటిస్' జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. కొంతమందికి హెయిర్ కలర్స్‌లోని కెమికల్స్ వల్ల చికాకు, అలర్జీ వంటి సమస్యలు వస్తాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన డెర్మటాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జోహన్ హెచ్. డెల్లర్స్ పాల్గొన్నారు. తరచుగా జుట్టుకు రంగు వేసుకోవడం వల్ల కొంతమందిలో చికాకు, అలర్జీ వంటి సమస్యలు కనిపించాయని ఆయన పేర్కొన్నారు.
శ్వాసకోశ సమస్యలు : కొన్ని హెయిర్ కలర్స్‌లో అమ్మోనియా అనే కెమికల్‌ను వాడతారు. అయితే, దీనివల్ల కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది: దీర్ఘకాలికంగా హెయిర్ కలర్‌లను వేసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, హెయిర్ కలర్ వేసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : జిమ్‌లో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి - లేదంటే ప్రాణాపాయం తప్పదు! - Avoid These Gym Mistakes