Health Benefits Of Raw Papaya : బొప్పాయి.. సీజన్‌తో సంబంధం లేకుండా లభించే పండ్లలో ఒకటి. ఇది రుచిగా ఉండడమే కాదు.. దీనిలో విటమిన్లు, మినరల్స్ సహా మరెన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా.. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే, సాధారణంగా బొప్పాయి(Papaya)ని అందరూ పండిన తర్వాతనే తింటారు. కానీ, బొప్పాయి కాయ దశలో ఉన్నప్పుడు తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు అంటున్నారు. ఇంతకీ, పచ్చి బొప్పాయి వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది : పచ్చి బొప్పాయిలో ఉండే పాపైన్ వంటి ఎంజైమ్‌లు జీర్ణక్రియకు సహాయపడే గ్యాస్ట్రిక్ ఆమ్లాల స్రావాన్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అలా ఇందులో ఉండే ఎంజైమ్‌లు కడుపులోని వ్యర్థాలను బయటకు పంపివేయడంలో సహాయపడతాయి. ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడడమే కాకుండా అజీర్ణం, గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం వంటి సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు.
2010లో "జర్నల్ ఆఫ్ ఎథ్నోఫార్మాకాలజీ"లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. రోజుకు రెండుసార్లు 50 గ్రాముల పచ్చి బొప్పాయి ముక్కలు తిన్న వారిలో కడుపు నొప్పి, వాంతులు, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల లక్షణాలు గణనీయంగా తగ్గాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూనివర్సిటీ ఆఫ్ ది వెస్టిండీస్‌కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ డేవిడ్ జె. మార్టిన్ పాల్గొన్నారు. పచ్చి బొప్పాయిలోని పోషకాలు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
క్యాన్సర్ నివారిస్తుంది : పచ్చి బొప్పాయి తినడం వల్ల పురుషులలో ప్రోస్టేట్, పెద్దప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ పెద్దప్రేగులో ఉండే టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. ఈ రకంగా పెద్దప్రేగు క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడేలా చేస్తుందంటున్నారు.
గర్భవతులు బొప్పాయి, పైనాపిల్ తినొచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
కామెర్లు : కామెర్ల నివారణకు పచ్చి బొప్పాయి ఎంతో మేలు చేస్తుందంటున్నారు నిపుణులు. ప్రతి మూడు గంటలకోసారి అరగ్లాసు బొప్పాయి రసం తాగడం వల్ల జాండిస్ నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. బొప్పాయిలో పాపైన్ అనే ప్రొటీయోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది. దీని నుంచి మందులు కూడా తయారుచేస్తారట! ఇవి.. కామెర్లు చికిత్సలో కూడా సహాయపడుతాయని చెబుతున్నారు.
మలేరియా : పచ్చి బొప్పాయిలో ఉండే విటమిన్ ఎ, సి మలేరియా రోగి రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా సహాయపడుతాయని చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా.. బొప్పాయి ఆకుల రసం తీసుకోవడం వల్ల మలేరియా, డెంగ్యూ రోగులలో ప్లేట్‌లెట్ కౌంట్ పెరిగే ఛాన్స్ ఉంటుందట. అలాగే.. అద్భుతమైన యాంటీ మలేరియా ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.
బాడీలో మంట తగ్గిస్తుంది : పచ్చి బొప్పాయి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. గొంతు ఇన్ఫెక్షన్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్, ఋతు తిమ్మిరితో సహా శరీరంలో కలిగే అనేక రకాల నొప్పులు, మంట, వాపులను తగ్గించడంలో పచ్చి బొప్పాయిలోని పోషకాలు ప్రభావవంతగా పనిచేస్తాయంటున్నారు.
అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేమిటంటే.. పచ్చి బొప్పాయిలో రబ్బరు పాలు (Latex) ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది కొందరికి పడకపోవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ఇది సంకోచాలను ప్రేరేపిస్తుందని చెబుతున్నారు. అందుకే.. గర్భిణులు దీనిని తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు. అంతేకాదు.. ఎవరైనా పచ్చి బొప్పాయిని తినేముందు వైద్యుల సలహా తీసుకోవడం బెటర్ అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బొప్పాయితో వారంలో 2కిలోల వెయిట్ లాస్! ఇందులో నిజమెంత? డాక్టర్లు ఏమంటున్నారు?