Foods Avoid Before Going To Gym : నేటి ఆధునిక జీవితంలో.. చాలా మంది ఫిట్‌గా ఉండటానికి ఉదయాన్నే వాకింగ్, జాగింగ్ చేస్తుంటారు. మరికొందరు జిమ్ సెంటర్‌కు వెళ్తుంటారు. అయితే.. ఇలా జిమ్‌కు వెళ్లేవారు.. వర్కవుట్స్ చేయడానికి ముందు కొద్దిగా శక్తికోసం ఏదైనా తింటారు. అయితే.. ఏం తినాలనే విషయంలో క్లారిటీ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జిమ్‌కు వెళ్లే ముందు కొన్ని ఆహార పదార్థాలు అస్సలే తినకూడదని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక కొవ్వు పదార్థాలు:
జిమ్‌కు వెళ్లే ముందు అధిక కొవ్వు ఉండే ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్, పిజ్జా, బర్గర్‌లు, ఐస్‌క్రీమ్ వంటి వాటిని అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే నూనెతో చేసిన పదార్థాలను కూడా తినకూడదట. వీటిని తినడం వల్ల శరీరం తొందరగా అలసిపోయినట్లు అవుతుందని అంటున్నారు. అలాగే.. ఇవి అనారోగ్యకరమైన బరువును పెంచుతాయట. దీనివల్ల మీరు జిమ్‌లో చేసిన కఠోర శ్రమ అంతా వృథా అవుతుందని తెలియజేస్తున్నారు.
Workout Common Mistakes To Avoid : వ్యాయామం చేస్తున్నారా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఎక్కువ చక్కెర ఉండే ఫుడ్ ఐటమ్స్:
జిమ్‌లో సాధన చేసే ముందు హై షుగర్ కంటెంట్ ఉండే చాక్లెట్, కేక్స్, బిస్కెట్లు, స్వీట్లు, కూల్‌డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ వంటి వాటిని అస్సలు తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోతాయి. అప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో ఇన్సులిన్ విడుదల అవుతుందట. దీనివల్ల మనం జిమ్‌లో వర్క్‌అవుట్ చేస్తున్నప్పుడు హఠాత్తుగా పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
అధిక ఫైబర్ పదార్థాలు:
మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫైబర్ ఫుడ్ ఎంతగానో అవసరం. కానీ, జిమ్‌కు వెళ్లే ముందు ఫైబర్ ఎక్కువగా ఉండే బ్రోకలీ, బ్రస్సెల్స్ మొలకలు, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి జీర్ణమవడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల మనం వర్క్‌అవుట్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని అంటున్నారు.
కారంగా ఉండే ఆహారాలు:
జిమ్ వర్క్‌అవుట్ చేసే ముందు.. కారంగా, ఘాటుగా ఉండే ఆహార పదార్థాలకు సైతం దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిని తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, వికారం, వాంతులు, గుండెలో మంట, ఎసిడిటీ వంటి వివిధ రకాల సమస్యలు వస్తాయని అంటున్నారు.
పాల ఉత్పత్తులు:
జిమ్‌కు వెళ్లే ముందు పాలు, పెరుగు, చీజ్ వంటి పదార్థాలను తినకూడదు. ఎందుకంటే వీటిని తీసుకోవడం వల్ల కొంత మంది త్వరగా అలసటకు గురవుతారు. అలాగే ఇవి అన్‌హెల్దీ వెయిట్ గెయిన్‌కు దారి తీస్తాయని అంటున్నారు.
కొంతమంది జిమ్‌కు వెళ్లే ముందు స్మూతీస్‌ను తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే.. ఇందులో ఎక్కువ మొత్తంలో షుగర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి, వీటిని తీసుకోకూడదని చెబుతున్నారు. అలాగే షుగర్, కెఫిన్ ఎక్కువగా ఉండే ఎనర్జీ డ్రింక్‌లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.