Cancer Risks Food Items: గ్రిల్ పై కాల్చి తయారు చేసే.. వంటలు అంటే చాలా మందికి నోరూరుపోతుంది. ముఖ్యంగా తందూరిని అయితే ఎంతో ఇష్టంగా తింటుంటారు. గ్రిల్ చికెన్, పైనాపిల్ గ్రిల్, పన్నీర్ గ్రిల్, ప్రాన్స్ గ్రిల్.. ఇలా రకారకాల వంటకాలను లొట్టలేసుకుని మరీ తింటుంటారు. అయితే.. ఈ వంటకాలు రుచికి బానే ఉన్నా.. వాటి ద్వారా వచ్చే అనారోగ్యాలు చాలా డేంజర్ అని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
క్యాన్సర్‌కు ఎలా కారణం అవుతుంది?: మాంసాన్ని నేరుగా మంట మీద పెట్టి కాల్చడం వల్ల దాని పై పొరపై క్యాన్సర్ సమ్మేళనాలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. కండలు పెరిగేందుకు దోహద పడే ఆర్గానిక్ యాసిడ్ అధిక మంట మీద వేడి చేసినప్పుడు క్యాన్సర్‌కి కారణమయ్యే హెటెరోసైక్లిక్ అమైన్‌లుగా మారుతుందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే.. అవి కాలుతున్నప్పుడు వాటి కొవ్వు నిప్పు మీద పడుతుంది. ఇది పాలీ సైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లకి దారితీస్తుందని.. ఈ రసాయనాలు DNAని దెబ్బతీస్తాయని, క్యాన్సర్ కణాల ఏర్పాటుకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు.
అలర్ట్ : పొగ తాగకపోయినా లంగ్ క్యాన్సర్ - ఇవి చెక్ చేసుకోండి! - Lung Cancer Causes in Non Smokers
కాల్చిన మాంసం తినడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని 2018లో మిన్నేసోటా విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ అధ్యయనం "క్యాన్సర్ ఎపిడెమియాలజీ, బయోమార్కర్స్ అండ్ ప్రివెన్షన్" జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ పరిశోధనలో మిన్నేసోటా విశ్వవిద్యాలయంలోని పబ్లిక్ హెల్త్ స్కూల్ ప్రొఫెసర్, ఎపిడెమియాలజిస్ట్ డా. రాబర్ట్ బెర్నార్డ్ పాల్గొన్నారు.
ప్రతిరోజూ 50 గ్రాముల మాంసం కాల్చి తినడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20 శాతం పెరుగుతుందని పేర్కొన్నారు. మయి క్లినిక్ ప్రకారం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ దాని ప్రారంభ దశల్లో గుర్తించడం చాలా కష్టం. అది ఇతర అవయవాలకు వ్యాపించి ప్రాణాంతక దశకు చేరుకున్న తర్వాతే దీని లక్షణాలు తరచుగా బయటపడతాయట.
ఇదే కాకుండా.. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఇంటర్నేషనల్ (WCRF) 2018లో నిర్వహించిన ఒక సమీక్షలో.. గ్రిల్‌పై కాల్చిన మాంసం తినడం వల్ల కొలన్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని తేలిందట. ఈ సమీక్షకు WCRF లో ప్రధాన శాస్త్రవేత్త డా. మారియన్ కుల్లెన్ నాయకత్వం వహించారు. గ్రిల్ పై కాల్చిన మాంసం, ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల క్యాన్సర్ సహా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నోటి దుర్వాసనతో పెద్దపేగు క్యాన్సర్ ముప్పు - పరిశోధనలో నమ్మలేని నిజాలు! - Mouth Health Problems