What to Eat to Stop White Discharge : పీరియడ్స్ మహిళలు ప్రతినెలా ఎదుర్కొనే సమస్య ఓ సమస్య. అయితే కొంతమందిలో నెలసరి సక్రమంగా వస్తే, మరికొద్దిమంది మాత్రం ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బ్లీడింగ్ సరిగా కాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. ఈ క్రమంలో పీరియడ్స్ టైమ్ టూ టైమ్ రాకపోవడానికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవ్వడం కూడా ఒక కారణమని భావిస్తుంటారు. అసలు, ఇది ఎంత వరకు నిజం? ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే ఎలాంటి ఆహారం, జాగ్రత్తలు తీసుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవ్వడం మాత్రమే పీరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి కారణం కాదంటున్నారు నిపుణులు. కానీ, ఇది కొన్ని సందర్భాల్లో పీరియడ్స్ సమస్యలకు దారితీయవచ్చనే విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు. నార్మల్‌గా మహిళల్లో అండం విడుదలయ్యే సమయంలో/నెలసరికి రెండు వారాల ముందు, కలయికలో పాల్గొన్నప్పుడు.. వైట్ డిశ్చార్జ్ అవడం సహజమే. అలా కాకుండా తరచుగా అవుతుంటే మాత్రం సంబంధిత వైద్యుల్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
ఇకపోతే మహిళల్లో వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ తల్లెత్తడానికి చాలా రకాల కారణాలు ఉంటాయంటున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్. అందులో కొన్నింటిని చూస్తే.. ముఖ్యంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే వైట్ డిశ్చార్జ్ తలెత్తే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే, ఫాస్టింగ్ షుగర్ ఎక్కువున్నా కూడా ఈ సమస్య కనిపిస్తుందంటున్నారు. ఊబకాయం ఉన్న వారికి బ్లడ్ షుగర్ కొంచెం ఎక్కువ కాబట్టి వీళ్లకి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందని సూచిస్తున్నారు.
ఇవే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం, కొన్ని సందర్భాల్లో పబ్లిక్ టాయిలెట్‌లో మూత్రవిసర్జన చేసినప్పుడు, పీరియడ్స్‌లో శుభ్రత పాటించనప్పుడు కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు. కాబట్టి, వైట్ డిశ్చార్జ్ తరచుగా అవుతుంటే మాత్రం వెంటనే జాగ్రత్త పడాలని చెబుతున్నారు.
నెల మధ్యలో మళ్లీ పీరియడ్స్ వస్తున్నాయా? - కారణాలు ఇవే - ఇలా చెక్ పెట్టండి!
ఇలా చేస్తే వైట్ డిశ్చార్జ్‌కి ఈజీగా చెక్!
- వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ రాకుండా ఉండాలన్నా, ఒకవేళ ఇప్పుడు ఉన్నవారిలో ఈ సమస్య తగ్గాలన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆహారపు అలవాట్లలో ఈ మార్పులు చేసుకోవాలంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకీ శ్రీనాథ్.
- ముందుగా ఫాస్టింగ్ షుగర్ చెక్ చేసుకుని దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా చక్కెరతో తయారుచేసే స్వీట్లతోపాటు ఐస్‌క్రీమ్, చాక్లెట్స్, పండ్ల రసాలను పూర్తిగా తగ్గించుకోవాలంటున్నారు.
- అదేవిధంగా మీ శరీరానికి అవసరమైన మేరకే ఆహారాన్ని తీసుకోవాలి. ప్రధానంగా మీ డైలీ డైట్లో సోయా ఉత్పత్తులు, గుడ్డు, విటమిన్ సి, పీచు ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. అలాగే ద్రవ పదార్థాలను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
- వీటితో పాటు ముఖ్యంగా లోదుస్తులను నెలకొక్కసారైనా వేడినీటిలో వేసి వాష్ చేసుకోవాలి. అదేవిధంగా వ్యక్తిగత శుభ్రతను పాటించడం ద్వారా వీలైనంత త్వరగా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్‌ను తగ్గించుకోవచ్చంటున్నారు డాక్టర్ జానకీ శ్రీనాథ్.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.