Does Diabetes Increase in Winter: కొన్ని రకాల వాతావరణ పరిస్థితులు.. పలు రకాల వ్యాధులను ఉద్ధృతం చేస్తూ ఉంటాయి. చలికాలంలో షుగర్ పెరగడం కూడా అలాంటిదే. క్రమం తప్పకుండా మందులు తీసుకుంటూ, అనేక జాగ్రత్తలు పాటిస్తున్నా రక్తంలో గ్లూకోజు శాతం ఎందుకు గాడి తప్పుతుందో తెలియక సతమతమవుతూ ఉంటారు. అయితే, చలికాలంలో షుగర్ పెరగటానికి వాతావరణ పరిస్థితులకు తోడు వైరల్ ఇన్‌ఫెక్షన్లు, ఇమ్యూనిటీ తగ్గడం లాంటి చాలా కారణాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో చలికాలంలో రక్తంలో గ్లూకోజు పెరగడానికి కారణాలు, నియంత్రణకు పరిష్కార మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కేవలం మందులతోనే కాకుండా శారీరక వ్యాయామాలు, ఆహారపు జాగ్రత్తలతో రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించుకోవచ్చని ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎం. గోవర్ధన్ సూచిస్తున్నారు. ప్రతిరోజూ తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. చలికాలంలో తగినంత వ్యాయామం లేకపోవడం గ్లూకోజ్ పెరుగుదలకు కారణమవుతుందని వివరిస్తున్నారు.
సాధారణంగా చలికాలంలో చాలా మంది వ్యాయామాన్ని దూరం పెడుతుంటారు. అయితే, ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరానికి చాలినంత శ్రమ లేకపోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగిపోతాయని అంటున్నారు. ఉదయం వీలుకాకపోతే సాయంత్రమైనా గంట సమయం కేటాయించుకుని వ్యాయామం చేస్తే మంచిదని సూచిస్తున్నారు.
చలికాలంలో సాధారణంగానే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని... ఇలాంటి టెంపరేచర్లో ఇన్సులిన్ పనితీరు తక్కువగా ఉంటుందంటున్నారు. ఫలితంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయని చెబుతున్నారు. వాతావరణం చల్లగా ఉండడంతో నీళ్లు కూడా తక్కువే తీసుకుంటామని.. ఫలితంగా నీళ్ల శాతం తక్కువై గ్లూకోజ్ బయటకు వెళ్లే అవకాశం ఉండదని తెలిపారు.
ఇంకా మిగిలిన కాలాలతో పోలిస్తే శీతాకాలంలో వచ్చే రోగాలే ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఈ కాలంలో సహజంగానే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని.. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయని చెబుతున్నారు. వీటన్నింటికి తోడు శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగి.. చాలా మంది మధుమేహం బారిన పడుతుంటారు. ఇప్పటికే మందులు వాడుతున్నా సరే.. రక్తంలో చక్కెర స్థాయులు పెరిగిపోయే అవకాశాలు ఉంటాయంటున్నారు.
ముఖ్యంగా చలికాలంలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడానికి విటమిన్ డి లోపం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చని నిపుణులు అంటున్నారు. శీతాకాలంలో ఎండ తక్కువ సమయం ఉంటుందని.. ఫలితంగా తగినంత ఎండ అందక డి విటమిన్ లోపం ఏర్పడుతుందని వివరిస్తున్నారు. దీనివల్ల ఇన్సులిన్ ప్రభావం తగ్గిపోయి.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయని చెబుతున్నారు. అందుకే మధుమేహులు చలికాలంలో ఎండలో కూర్చోవడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇంకా దాహం వేయకున్నా వీలైనంతగా నీళ్లు తాగాలని.. అప్పుడే చలికాలంలో షుగర్ అదుపులో ఉంటుందని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చిన్న బెల్లం ముక్కతో షుగర్ కంట్రోల్లో ఉంటుందట! మరి చక్కెరకు బదులుగా వాడొచ్చా?
విటమిన్ సప్లిమెంట్లు ఎవరైనా తీసుకోవచ్చా? ఈ మాత్రలు సురక్షితమేనా?