Diabetics Can Consume Alcohol?: డయాబెటిస్(Diabetes) ఉన్నవారు రోజూ మందులు వాడాల్సిందే. ముఖ్యంగా.. ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహారించాలి. కొన్ని ఆహారాలకు, పానీయాలకు దూరంగా ఉండాలి. మరి.. మద్యం తాగొచ్చా? అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. ఒకవేళ తాగితే ఏమవుతుంది? మద్యం తాగాక మందులు వేసుకోవచ్చా? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్నవారు మద్యం తాగొచ్చా?.. ఈరోజుల్లో ఎంతో మందికి మద్యం తాగే అలవాటు ఉంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. మందు తాగడం వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇక అదే మధుమేహం ఉన్నవారు మద్యం తాగితే మరికొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి డయాబెటిస్తో బాధపడుతున్నవారు వీలైనంత వరకు మద్యం తాగకపోవడమే మంచిది. ఎందుకంటే.. మద్యం తాగడం వల్ల నాడులు దెబ్బతింటాయి. మధుమేహులకు నార్మల్‌గానే నాడులు దెబ్బతినే ముప్పు ఎక్కువ. ఎంత ఎక్కువకాలం నుంచి డయాబెటిస్తో బాధపడుతుంటే అంత ఎక్కువగా నాడులు దెబ్బతినే ప్రమాదం ఉంది.
దీని కారణంగానే చాలామంది కాళ్లు చేతుల తిమ్మిర్లు, మంట పెట్టటం, సూదులతో పొడిచినట్టు అనిపించటం వంటి ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. దీనికి మద్యం కూడా తోడైతే సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇంకాస్త త్వరగా నాడులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాళ్లు మొద్దుబారి, పుండ్లు పడొచ్చు. పుండ్లు మానకపోతే వేళ్లు, పాదాలు, కాళ్లు తొలగించాల్సి రావొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణలు. ఇవేకాకుండా ఇంకొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అవేంటంటే..
డయాబెటిస్తో ఇబ్బందిపడుతున్నారా? - ఈ యోగాసనాలతో ఫుల్ బెనిఫిట్!
హైపోగ్లైసీమియా : సాధారణంగానే షుగర్ ఉన్నవారిలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండవు. అదే వారు ఆల్కహాల్ సేవించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలలో చాలా మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా మద్యం.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది హైపోగ్లైసీమియాకు దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా ఉండే పరిస్థితిని హైపోగ్లైసీమియా అంటారు. చెమటలు పట్టడం, వణుకు, ఆకలి, బలహీనత, మూర్ఛ వంటివి దీని లక్షణాలు. ఇక దీనిని నియంత్రించకుండా వదిలేస్తే.. ఆకస్మిక మరణానికి దారితీయవచ్చంటున్నారు నిపుణులు.
డీహైడ్రేషన్: ఆల్కహాల్ తాగడం డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరమైనది. ఎందుకంటే.. డీహైడ్రేషన్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్, యాసిడ్ రిఫ్లక్స్, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి డయాబెటిక్ రోగులు వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఈ సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఎప్పటికప్పుడూ రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు. అంటే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం, వైద్యులు సూచించిన మందులు వేసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చేయాలని సూచిస్తున్నారు.
నిద్రలేమితో క్యాన్సర్ - డయాబెటిస్, హార్ట్ ఎటాక్ బోనస్! ఇంకా
ఈ లక్షణాలు మీ బాడీలో కనిపిస్తున్నాయా? - అయితే మీకు టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లే!