Child Dental Care Tips : అందమైన, ఆరోగ్యకరమైన దంతాలు పూర్తి ఆరోగ్యానికి చాలా అవసరమైనవి. ముఖ్యంగా పిల్లలు తినడం, మాట్లాడటంలో ఇవి ముఖ్యపాత్ర పోషిస్తాయి. బలహీనమైన దంతాలు, అపరిశుభ్రమైన నోరు కారణంగా రకరకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులు, క్యావిటీస్ వంటి సమస్యలు వస్తుంటాయి. అలాగే దంతాలు ఊడిపోవడం, వాటి అరమరిక విషయంలోనూ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. నిజానికి బాల్యంలో క్యావిటీస్ అనేవి కామనే కానీ అవి వాళ్లతో పాటు పెరిగి పెద్దవకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఆరోగ్యకమైన దంతాలు, నోటి పరిశుభ్రత కోసం కొన్ని పనులను మీ పిల్లలకు అలవాట్లు చేస్తే వారు జీవితకాలం హాయిగా తినడానికి, అందంగా నవ్వడానికి, కాన్ఫిడెంట్‌గా మాట్లాడటానికి సహాయనడతాయి. ఇందుకు తల్లిదండ్రులు చేయాల్సినవి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
చిగుళ్లను తుడవాలి
మీ బిడ్డకు దంతాలు రాకముందే అంటే శిశువుగా ఉన్నప్పటి నుంచే నోటిని శుభ్రం చేయడం మొదలు పెట్టండి. తినిపించిన తర్వాత ప్రతిసారి శిశువు చిగుళ్లను శుభ్రంగా కడిగి, మృదువైన తడి క్లాత్‌తో తుడవటం అలవాటు చేసుకోండి.
బ్రష్, పేస్టు విషయంలో
దంతాలు వచ్చిన తర్వాత అవి ఒకటి రెండైనా సరే వాటిని సున్నితమైన బ్రష్‌తో, తక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్‌తో శుభ్రం చేయాలి. పిల్లలకు బ్రష్ చేయించేందుకు పేస్టు కేవలం బియ్యం గింజ పరిమాణంలో తీసుకుంటే చాలు. రోజుకు రెండు సార్లు బ్రష్ చేయించండి.
ఫ్లాసింగ్
పిల్లల నోటి ఆరోగ్యం బాగుండాలంటే బ్రష్ చేయించడం ఎంత అవసరమో ఫ్లాసింగ్ కూడా అంతే అవసరం. టూత్ బ్రష్ చేరుకోలేని దంతాల మధ్య కూడా శుభ్రం చేయడానికి ఫ్లాసింగ్ చేయడం చాలా ముఖ్యం. ఇది దంతాల మధ్య ఉన్న ఆహార పదార్థాలు వంటి వాటిని తొలగిస్తుంది. ఫ్లాసింగ్ అలవాటు చిగురు వాపు, పీరియాంటీస్ వంటి వివిధ చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది.
ఆహారపు అలవాట్లు
పిల్లలను చక్కెరతో చేసిన స్నాక్స్, డ్రింక్స్ వంటి వాటికి వీలైనంత వరకూ దూరంగా ఉంచాలి. పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, పుష్కలమైన నీరు వంటి సమతుల్య ఆహారం తీసుకోవడం వారికి ముందు నుంచే అలవాటు చేయాలి.
ఫ్లోరైడ్
మీ పిల్లల దంతాలు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్లోరైడ్ తగినంతా ఉండాలి. దంత వైద్యుల సలహా మేరకు టూత్ పేస్ట్, ఫ్లోరైడ్ ట్రీట్మెంట్ వంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రతి ఆరు నెలలకు ఓ సారి దంత పరీక్షలు చేయించాలి. ఇది దంత సమస్యలను ముందే గుర్తించి తీవ్రతరం కాకుండా కాపాడుకునేందుకు సహాయపడుతుంది.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఏసీలో ఎక్కువసేపు ఉంటే చాలా డేంజర్! ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసా? - Too Much AC Side Effects