Cardio Exercise Benefits : కార్డియో వ్యాయామాలు అనే మాట మనం చాలా సార్లు వినే ఉంటాం. ముఖ్యంగా నిత్యం వ్యాయామం చేసేవారికి పరిచయం అక్కర్లేని పేరిది. సాధారణంగా ఇది గుండెకు మేలు చేసే ఎక్సర్ సైజులని చాలా మంది అభిప్రాయం. అందులో కొంత వరకు నిజమైనా, మరికొంత తెలుసుకోవాల్సి ఉంది. అసలీ కార్డియో ఎక్సర్ సైజులంటే ఏంటి?. అందులో ఏయే రకాల వ్యాయామాలు వస్తాయి? వీటిని చేయడం వల్ల కలిగే లాభాలేంటి? వివరాల్ని ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
అసలేంటీ కార్డియో ఎక్సర్ సైజులు?
పరుగెత్తడం, నడవటం, జాగింగ్ లాంటివి కార్డియో ఎక్సర్సైజ్ కిందకు వస్తాయి. అలాగే బరువులు ఎత్తకుండా చేసేవి కూడా కార్డియో వ్యాయామాల కిందకే వస్తాయి. ఈ వ్యాయామాలు చేసినప్పుడు మన ఏరోబిక్ సామర్థ్యం పెరగడమే కాకుండా గుండెకు, ఊపిరితిత్తులకు చాలా వరకు మేలు కలుగుతుంది.
"గుండె జబ్బులు రాకుండా, రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేందుకు ఈ ఎక్సర్ సైజులు చాలా ఉపయోగపడతాయి. వీటితో పాటు చాలా ఇతర ప్రయోజనాలు ఉంటాయి. వీటి వల్ల జ్ఞాపకశక్తి పెరిగి, అల్జీమర్స్ వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రెగ్యులర్గా ఈ రకమైన వ్యాయామాలు చేసే వారికి ఆస్టియోపోరిసిస్, మోకాళ్లకు సంబంధించిన జబ్బులు కూడా వచ్చే అవకాశం చాలా తక్కువ అని పరిశోధనల్లో తేలింది."
-- డా. MSS. ముఖర్జీ, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టు
మెదడుకు సంబంధించిన ఆరోగ్యం కూడా ఈ ఎక్సర్సైజ్ల వల్లే ఉంటుంది. బ్యాక్ పెయిన్స్ తక్కువగా వచ్చే అవకాశముంటుంది. కార్డియో అనగానే మనకు గుండెకు సంబంధించినవి మాత్రమే కాకుండా, ఊపిరితిత్తులు, నాడీ, గ్యాస్ట్రోకి సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మీరు రోజూ వ్యాయామాలు చేసేటప్పుడు కచ్చితంగా కార్డియో వ్యాయామాలు చేయడం తప్పనిసరి.
వీరు జాగ్రత్తగా ఉండాలి
సాధారణంగా అందరూ ఈ వ్యాయామాలు చేయొచ్చు. కానీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఊబకాయం లాంటి గుండె జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న వాళ్లు, ఈ వ్యాయామాలు చేయడం ప్రారంభించే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మంచిది.
అలాగే వ్యాయామాలు చేయడం ప్రారంభించిన మొదటి రోజే అధిక మొత్తంలో చేయడం కూడా మంచిది కాదు. వీటిని నెమ్మదిగా చేయడం ప్రారంభించి క్రమంగా స్థాయి పెంచుకుంటూ వెళ్లాలి. బాడీని కండిషనింగ్ చేసుకుంటూ వెళ్లాలి. వీటిని క్రమంగా చేస్తూ మధ్యలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే వాటిని తిరిగి మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. దీనికంటే ముందు డాక్టర్లను కూడా కలవాల్సి ఉంటుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">