Cancer Risk Foods: ప్రాసెస్డ్ మీట్ తినేవారికి క్యాన్సర్ తప్పక వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాసేజ్‌లు, హాట్‌డాగ్, బర్గర్స్, బేకన్ వంటి ప్రాసెస్ చేసిన మాంసాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన మాంసాహారాలలో నైట్రేట్లు అధికంగా ఉంటాయని.. ఇవి నైట్రోసమైన్‌లు అని పిలువబడే కార్సినోజెనిక్ సమ్మేళనాలను ఏర్పరుస్తాయని అంటున్నారు. క్యాన్సర్‌కు కారణమైన వాటిల్లో ఇది ఒకటి. ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినడం పెద్ద పేగు క్యాన్సర్‌కు దారితీస్తుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి.
రెడ్ మీట్స్: అధిక ఉష్ణోగ్రతల వద్ద రెడ్ మీట్ ఉడికించడం వల్ల హెటెరోసైక్లిక్ అమైన్‌లు (హెచ్‌సిఎలు), హైడ్రోకార్బన్‌లు (పిఎహెచ్‌లు) వంటి క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయి. ఇది పెద్దపేగు, ప్రొస్టేట్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు.
అలర్ట్ : ఆ వస్తువులు వాడడం ఆపండి - స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది!
చక్కెర పానీయాలు: సోడాలు, ఎనర్జీ డ్రింక్స్, జ్యూసులు వంటి చక్కెర పానీయాలు ఊబకాయానికి దారితీస్తాయని.. అలాగే ఇన్సులిన్ నిరోధకతకు దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఇవి రొమ్ము, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్(National Library of Medicine రిపోర్ట్)తో సహా అనేక రకాల క్యాన్సర్లకు దారితీస్తాయని చెబుతున్నారు. అధిక చక్కెర వినియోగం శరీరంలో మంట,ఆక్సీకరణ ఒత్తిడిని కూడా ప్రోత్సహిస్తుందని హెచ్చరిస్తున్నారు.
2012లో "బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్స్టిట్యూట్లో న్యూట్రిషన్ ఎపిడెమియాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుసన్నా సి.లార్సన్ పాల్గొన్నారు.
శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు: వైట్ బ్రెడ్, పేస్ట్రీలు, చక్కెర తృణధాన్యాలు వంటి శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు బరువు పెరగడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిని ఎక్కువగా తినడం వల్ల ముఖ్యంగా రొమ్ము, కొలొరెక్టల్ క్యాన్సర్ల ప్రమాదానికి దోహదం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
వేయించిన ఆహారాలు: అధిక ఉష్ణోగ్రత వద్ద వేయించిన ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, డోనట్స్‌లు అక్రిలమైడ్ అనే రసాయనాన్ని కలిగి ఉంటాయి. ఇది కూడా వివిధ రకాల క్యాన్సర్ రిస్క్‌లను పెంచుతుందని అంటున్నారు.
అలర్ట్ : హీరోయిన్‌కు రొమ్ము క్యాన్సర్! - ఈ క్యాన్సర్ గడ్డను ఎలా గుర్తించాలో మీకు తెలుసా?
కృత్రిమ స్వీటెనర్లు: ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. కొన్ని ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు జీర్ణమయ్యేటప్పుడు పలు రసాయనాలను విడుదల చేస్తాయని.. ఇవి కణాలకు హాని కలిగించే అవకాశం ఉందని అంటున్నారు.
హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్: ప్యాకేజ్డ్ ఫుడ్స్ వంటి అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు అనారోగ్యకరమైన కొవ్వులు, అధిక చక్కెరలు కలిగి ఉంటాయి. ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయానికి దారితీస్తుందని.. తద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని వివరిస్తున్నారు.
అధిక సోడియం ఆహారాలు: ఇన్స్టంట్ సూప్‌లు, ఉప్పగా ఉండే స్నాక్స్ వంటి అధిక సోడియం ఆహారాలు.. అధిక రక్తపోటు, మూత్రపిండాలు దెబ్బతినడానికి దోహదం చేస్తాయని నిపుణులు అంటున్నారు. ఎక్కువ కాలం సోడియం తీసుకోవడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మద్యం: ఆల్కహాల్ డైలీ తాగడం వల్ల రొమ్ము, కాలేయం, అన్నవాహిక క్యాన్సర్‌తో సహా అనేక క్యాన్సర్‌ల ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఆల్కహాల్‌లో క్రియాశీలక భాగం అయిన ఇథనాల్.. సెల్యులార్ డ్యామేజ్‌ని కలిగిస్తుందని.. పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తుందని అంటున్నారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్ : అధిక బరువున్న మహిళలకు క్యాన్సర్ ముప్పు - వెంటనే ఇలా చేయాల్సిందే!