Psoriasis Symptoms : మన దైనందిన జీవితంలో వ్యాధులు సర్వసాధారణం అయిపోయాయి. ఇందులో తాత్కాలికంగా ఇబ్బంది పెట్టే వ్యాధులు కొన్ని కాగా.. దీర్ఘకాలికంగా వేధించేవి మరికొన్ని. ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధుల కోవలోకి వచ్చేది సొరియాసిస్. దురదతో కూడిన వెండి రంగు పొలుసులు బాగా ఇబ్బంది పెడతాయి. మామూలు చర్మంపైనే కాకుండా వెంట్రుకల కింది చర్మ భాగంలో, చేతి గోళ్ల కిందా ఈ సొరియాసిస్ కనిపిస్తోంది. ఈ వ్యాధి వల్ల కీళ్ల నొప్పులతోపాటు గుండె సమస్యలు కూడా త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయని ప్రముఖ డెర్మటాలడజిస్ట్ డాక్టర్ చంద్రావతి వెల్లడించారు. సొరియాసిస్ను కేవలం చర్మం వ్యాధిలానే భావించకూడదని.. దీని వల్ల అనేక ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పారు. అయితే, దీనిని తగ్గించుకోవడం పెద్ద కష్టమేమి కాదని వైద్యులు చెబుతున్నారు. దీనిని నియంత్రించేందుకు మెరుగైన చికిత్సతో పాటు ఆరోగ్యకరమైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలోనే సొరియాస్ వ్యాధి ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? దీని వల్ల వచ్చే ఇతర ఆరోగ్య సమస్యలేంటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం.
ఎవరికి వస్తుంది?
సొరియాసిస్ వ్యాధి మహిళ, పురుషలనే సంబంధం లేకుండా అందరికీ వస్తుందని వైద్యులు చెబుతున్నారు. చిన్నారులతో పోల్చితే పెద్దల్లో ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుందన్నారు. బరువు ఎక్కువగా ఉన్న వారికి సొరియాసిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. ఇన్ఫెక్షన్లు, మలేరియా, గుండె సమస్యలు లాంటి వ్యాధులకు సంబంధించిన మందులను వాడడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. మద్యపానం, ధూమపానం చేసేవారిలోనూ ఈ వ్యాధి ప్రభావం ఉంటుందని వివరించారు.
ఎందుకు వస్తుంది?
సొరియాసిస్ వ్యాధి వాతావరణ సమస్యలు, జన్యులోపం వల్ల కూడా వస్తుందని తెలిపారు. వారసత్వం, రోగ నిరోధక శక్తిలో వచ్చే మార్పులు, తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల సొరియాసిస్ వస్తుందని చెప్పారు. రోగ నిరోధక వ్యవస్థలో ఉండే కణాలు పొరపాటున ఆరోగ్యంగా ఉన్న చర్మ కణాల మీదే దాడి చేస్తాయని.. అలాంటి సమయంలో సొరియాసిస్ సమస్య వస్తుందన్నారు.
సొరియాసిస్ వల్ల తలెత్తే వ్యాధులు..
- సొరియాటిక్ ఆర్థరైటిస్
- గుండె సమస్యలు
- మానసిక అనారోగ్యం
- ఆందోళన, ఒత్తిడి
- కాలేయ వ్యాధులు
- కిడ్నీ సమస్యలు
- కంటి సమస్యలు
- క్యాన్సర్
- ఊబకాయం
- డయాబెటిస్
- అధిక రక్తపోటు
- ఇన్ఫెక్షన్లు
సొరియాసిస్ లక్షణాలు..
- ఎర్రటి చర్మం
- దురద
- పొడి చర్మం
- రక్తస్రావం
- చర్మంపై పగుళ్లు
- సరిగ్గా నిద్రపోకపోవడం
సొరియాసిస్ పరిష్కారానికి తీసుకోవాల్సిన ఆహారం
- తాజా పళ్లు, కూరగాయాలు
- కొవ్వు తక్కువగా ప్రోటీన్లు ఎక్కువ ఉండే మాంసాహారం
- పొట్టు తీయని ధాన్యాలు
- యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆహారం
- విటమిన్ సీ, విటమిన్ ఈ
- బీటా కెరోటిన్, సెలీనియం ఉండే ఆహారం
- ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్
- ఆకుకూరలు
- చేపలు
- జీలకర్ర, అల్లం
- ఆలివ్ ఆయిల్, గింజలు
తీసుకోకూడని ఆహార పదార్థాలు
- కార్బోహైడ్రెట్ శాతం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోకూడదు
- ఫాస్ట్ఫుడ్, జంక్ ఫుడ్
- మిఠాయిలు
- పిజ్జా, బర్గర్
- బార్లీ, గోధుమలు
- ఆల్కహాల్ తీసుకోకూడదు
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.