Can Pregnant Women Eat Guava: తల్లి అవ్వడం గొప్ప వరం. అందుకే చాలా మంది మహిళలు గర్భదారణ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కడుపులో పిండం దశ నుంచి బిడ్డ భూమ్మీదకు వచ్చే వరకు తినే తిండి నుంచి తాగే పానీయాల వరకు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటుంటారు. ఈ క్రమంలోనే తాజా పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటారు. అయితే చాలా మందికి ప్రెగ్నెన్సీ సమయంలో జామ పండ్లు తినవచ్చా? తింటే ఏం జరుగుతుంది? అనే డౌట్లు వస్తుంటాయి. మరి మీరు కూడా ఆ జాబితాలో ఉన్నారా? అయితే నిపుణుల సమాధానమేంటో ఈ స్టోరీలో తెలుసుకోండి.
పోషకాల గని: జామ పండ్లలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ ఎ, విటమిన్ బి6, పొటాషియం, ఫైబర్, లుటిన్ వంటి పోషకాలు ఉన్నాయి. అయితే ఈ పోషకాలు అన్నీ గర్భిణీలకు మేలు చేసేవి అని నిపుణులు అంటున్నారు. కాబట్టి గర్భిణులు జామ పండ్లు తినొచ్చని చెబుతున్నారు. అలా అని ఎక్కువ మోతాదులో కాకుండా రోజుకు 100 నుంచి 150 గ్రాముల వరకు జామ పండ్లు తినవచ్చని.. ఈ మోతాదులో జామపండ్లు తీసుకుంటే గర్భిణుల ఆరోగ్యం బాగుంటుందని అంటున్నారు. మరి తల్లైన వారు జామపండ్లు తింటే కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం..
రోగనిరోధక శక్తి: జామపండ్లలో విటమిన్-ఇ, సి, బి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండేలా చేస్తాయని.. బిడ్డకు ఆరోగ్యమని అంటున్నారు. అందుకే గర్భవతులకు జామపండ్లు తినమని చెబుతున్నారు.
డయాబెటిస్: ఈ మధ్యకాలంలో చాలా మంది మహిళలు గర్భం దాల్చిన తరువాత మధుమేహ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే.. గర్భం దాల్చిన తరువాత మధుమేహం రాకూడదంటే జామపండ్లు తినడం సరైన మార్గమని ఆహార నిపుణులు అంటున్నారు. 2017లో Nutrition and Health జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. గర్భవతులు జామపండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయని.. అలాగే కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తపోటు మెరుగుపడతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇరాన్‌లోని షిరాజ్ విశ్వవిద్యాలయంలో పోషకాహార నిపుణులు డాక్టర్ మెహ్దీ అలి అబ్దోల్లాహీ పాల్గొన్నారు.
హైడ్రేట్‌గా ఉండేందుకు: జామపండ్లలో ఉండే నీటి శాతం శరీరంలో ద్రవాలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు. గర్భవతులలో నీటి శాతం తగ్గకుండా చేయడంలో జామపండ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు.
ఐరన్: ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు ఐరన్ పుష్కలంగా అందడం చాలా ముఖ్యం. జామపండ్లలో ఐరన్ మంచి మొత్తంలో ఉంటుందని.. ఐరన్ లోపాన్ని అధిగమించాలన్నా, శరీరంలో ఐరన్ పుష్కలంగా ఉండాలన్నా జామపండ్లు తినాలని అంటున్నారు. ఇవే కాకుండా..
- జామపండ్లలోని ఫోలేట్ శిశువు నాడీ గొట్టు లోపాలను నివారించడంలో సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు.
- జామపండులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని, మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుందని అంటున్నారు.
- జామపండ్లలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయని చెబుతున్నారు.
- జామపండ్లలోని యాంటీ-బాక్టీరియల్, యాంటీ-వైరల్ లక్షణాలు అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడతాయని నిపుణులు తెలుపుతున్నారు.
- జామపండ్లు ఉద్రేకం, ఆందోళనను తగ్గించడంలో సహాయపడే విశ్రాంతి లక్షణాలను కలిగి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.