Can Pregnant Woman Eat Papaya And Pineapple : ప్రతిఒక్కరి జీవితంలో గర్భధారణ అనేది ఎంతో అద్భుతమైన క్షణం. గర్భధారణ నుంచి ప్రసవం వరకు ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనే కోరిక ప్రతి ఆడపిల్లకు ఉంటుంది. భార్యాభర్తల మానసిక పరిపక్వత, జీవన శైలి అనేవి రెండు గర్భధారణపై ప్రభావం చూపుతాయి. ఇదిలా ఉంటే గర్భధారణ తర్వాత బిడ్డ పెరుగుదలకు అనేక ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. రకరకాల టెస్టులు చేయించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో గర్భధారణకు ముందు, తర్వాత ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనే విషయాలను వివరంగా ఇప్పుడు చుద్దాం.
వీటిపై అవగాహన అవసరం!
గర్భధారణ తర్వాత సమస్య ఎక్కడ వస్తుందనే విషయంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలి. గర్భం ధరించాక తల్లి పూర్తిగా పోషకాహారం తీసుకోవాలి. ఇలా పూర్తిస్థాయిలో పోషకాలు తీసుకోకపోతే బిడ్డ ఎదుగుదల మీద ప్రభావం చూపుతుంది. గర్భధారణ సమయం నుంచి ప్రసవం వరకు పాటించాల్సిన అన్ని నియమాల గురించి వైద్యులను అడిగి తెలుసుకోవాలి. ఏమైనా అనుమానాలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ప్రీనేటల్ కేర్ అంటే?
గర్భధారణకు ముందే తల్లిని శారీరకంగా సిద్ధం చేయడానికి ప్రీనేటల్ కేర్ అవసరం అని ప్రముఖ గైనకాలజిస్ట్ డా.మానస బద్వేలి వెల్లడించారు. అయితే ప్రీనేటల్ కేర్‌లో భాగంగా ముందు కొన్ని రకాల బ్లడ్ టెస్టులు చేస్తారు. ఇందులో హిమోగ్లోబిన్, థైరాయిడ్, షుగర్ లెవల్స్ సహా మరి కొన్నింటిని పరీక్షిస్తారని డా.మానస తెలిపారు. అలాగే పిల్లలకు వంశపారంపర్యంగా కూడా కొన్ని వ్యాధులు రావచ్చు. ఇలాంటి వాటిని ముందే కనిపెట్టి జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ ప్రీనేటల్ కేర్ సాయపడుతుందని వైద్యులు వివరిస్తున్నారు.
గర్భధారణ టైంలో చేసే టెస్టులు ఇవే!
పిండం జన్యుపరంగా సరిగ్గా ఉందా లేదా అని టెస్ట్ చేయడానికి జెనిటిక్ టెస్టులు చేస్తారు. అయితే వీటిని మూడు నెలల్లోపే చేయించుకోవాల్సి ఉంటుంది. గతంలో గర్భధారణ అయిన మూడు నెలల తర్వాత ఆస్పత్రులకు వెళ్లేవాళ్లు. కానీ, ఇప్పుడు అలా కాదు. పీరియడ్ తప్పినప్పుడే కొన్ని రకాల రక్త పరీక్షలను చేస్తున్నారు. థైరాయిడ్, హిమోగ్లోబిన్ ఎలా ఉందని పరీక్షిస్తున్నారు. ఇక జెనిటిక్ టెస్ట్ ద్వారా జన్యుపరంగా తలెత్తే ఇబ్బందులతో పాటు ఏవైనా సిండ్రోమ్స్ సమస్యలు ఉన్నాయా అని పరీక్షిస్తారు.
పిండం ఏడు వారాలకు స్కాన్ ఒకటి ఉంటుంది. పిండం హార్ట్‌బీట్ సరిగ్గా ఉందా? లేదా? అని ఇందులో తేలుతుంది. 12 వారాల వరకు డౌన్‌సిండ్రోమ్ లాంటి జెనిటిక్ సమస్యలు కనిపించవు. అలాంటి వాటి కోసం 20 వారాలప్పుడు ఒక స్కాన్ చేస్తారు. 20 వారాల తర్వాత బిడ్డ ఎదుగుదల ఎలా ఉంది? హార్ట్‌బీట్ సరిగ్గా కొట్టుకుంటుందా? ఉమ్మనీరు సరిగ్గా ఉందా? బ్లడ్ సర్క్యూలేషన్ తల్లి నుంచి బిడ్డకు సరిగ్గా అవుతోందా? లేదా? అనేది చూస్తారు.
షుగర్ టెస్ట్!
అలాగే ప్రెగ్నెన్సీ షుగర్ టెస్ట్ ఒకటి చేస్తారు. దీనిని గ్లూకోజ్ నీళ్లు తాగించి చేస్తారు. అయిదో నెల తర్వాత ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఒకవేళ షుగర్ ఉంటే క్రమం తప్పకుండా మందులు వాడితే సరిపోతుంది. సాధారణంగా గర్భవతులకు బీపీ, షుగర్ అనేవి ఎక్కువగా ఉండవచ్చు లేదా రావచ్చు. ప్రసవం తర్వాత మళ్లీ మామూలు అయిపోతుంది. రక్తపోటు ఉంటే నెలకు ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి బీపీని చెక్ చేయించుకోవడం కాదు, రెగ్యులర్‌గా ఇంట్లోనే బీపీని చెక్ చేసుకుంటే మంచిది.
బిడ్డ బరువు తగ్గే ప్రమాదం!
షుగర్ ఉంటే వెంటనే ఆహారాన్ని తగ్గించకూడదు. ఆహారాన్ని మార్చి తినాలి, ఇలా చేస్తే బిడ్డ బరువు దెబ్బతినదు, డైటీషియన్ల సలహాలు తీసుకోవాలి. అన్నానికి బదులు కొర్రలు, చపాతీలకు బదులు జొన్నరొట్టె, రాగిరొట్టె తింటే సరిపోతుంది. బిడ్డ బరువు తగ్గకుండా షుగర్ నియంత్రణలోకి వచ్చేలాగా వైద్యుల సూచనల మేరకు గర్భవతులు ఆహారంలో మార్పులు చేసుకుంటే మేలు.
ఏవి తినాలి? ఏవి తినకూడదు?
Is Papaya Okay For Pregnancy : గర్భంతో ఉన్నవారు మితంగా సహజసిద్ధంగా ఉండే ఎలాంటి ఆహారాలనైనా తినవచ్చు. గర్భధారణ సమయంలో తినే వాటిపై, తినకూడని వాటిపై అనేక అపోహలు ఉన్నాయని, వాటి గురించి ఎలాంటి అనుమానం ఉన్నా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది గర్భధారణ సమయంలో బొప్పాయి, పైనాపిల్‌ను తినకూడదు అని అంటారు. కానీ అలాంటి నియమాలు ఏమీ లేవని డా.మానస చెబుతున్నారు. పండిన బొప్పాయిని మాత్రమే తింటారని, కాయగా తింటే ఇబ్బంది కలుగుతుందని వివరిస్తున్నారు. బొప్పాయి పండులో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయంటున్నారు. ప్రిజర్వేటివ్స్ ఉన్న ఎలాంటి ఆహారాలు అయినా తినకూడదు అని సలహా ఇస్తున్నారు.
వ్యాయామాలు చేయొచ్చు- కానీ!
గర్భధారణ తర్వాత వ్యాయామాలు చేయవచ్చా? లేదా? అని చాలామంది అడుగుతుంటారు. నిజానికి వ్యాయామాలు చేయవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. గర్భధారణకు ముందే వ్యాయామాలు చేసే వాళ్లు దానిని కొనసాగించవచ్చు అని అంటున్నారు. కానీ పొట్ట మీద ఒత్తిడి కలిగించే ఎలాంటి వ్యాయామాలు చేయకూడదని సూచిస్తున్నారు. అలాగే గర్భధారణ తర్వాత వ్యాయామం మొదలుపెట్టాలని అనుకునే వాళ్లు వైద్యుల సూచనల మేరకు చెయ్యాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అలాగే గర్భవతులు ధ్యానం చేయడం వల్ల ఎంతో మేలు కలుగుతుందని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ పిల్లలు బరువు పెరగట్లేదా? - ఈ ఫుడ్స్ తినకపోవడమే కారణం! - Weight Gain Foods For Children
ఆకుకూరలను ఇలా వండుతున్నారా? - పోషకాలన్నీ గాల్లో కలిపేస్తున్నట్టే! - How To Cook Leafy Vegetables