Can People with Diabetes Stop Taking Medicine : డయాబెటిస్ బాధితుల్లో కొందరు.. షుగర్ లెవల్స్ నార్మల్కి రాగానే, అంతా బాగానే ఉందనే భావనతో మందులు తీసుకోవడం మానేస్తుంటారు. మరి.. మధుమేహ బాధితులు ఇలా మందులు మధ్యలో వేసుకోకపోవడం మంచిదేనా? అంటే "కాదు" కాదంటున్నారు ప్రముఖ జనరల్ ఫిజిషీయన్ 'డాక్టర్ శ్రీనివాస్'. మందులు వేసుకోవడం ద్వారానే షుగర్ కంట్రోల్లో ఉంటుందని తెలిపారు. డయాబెటిస్ మందులు వేసుకోవడం మానేస్తే బ్లడ్ షుగర్ స్థాయులు తప్పకుండా పెరుగుతాయని చెబుతున్నారు.
అది మన పొరపాటే!
దాదాపు షుగర్ ఉన్నవారందరిలో మెడిసిన్ తీసుకోవటం వల్లనే గ్లూకోజు మోతాదులు నియంత్రణలో ఉంటాయి. కొంతమంది కొన్ని నెలలు కంటిన్యుగా మందులు వాడడం వల్ల.. డయాబెటిస్ వెనక్కి మళ్లిందనీ భావిస్తుంటారు. కానీ, మధుమేహం వెనక్కి మళ్లటమనేది చాలా కొద్దిమందిలోనే జరుగుతుందట. అది కూడా జబ్బు నిర్ధరణ అయిన తొలి సంవత్సరాల్లోనే. రోజూ కచ్చితంగా మంచి జీవనశైలిని పాటించటం, బరువు తగ్గటం, మందులు వేసుకోవటం మూలంగా సాధ్యమవుతుందట. కాబట్టి, షుగర్ పూర్తిగా తగ్గిపోయిందని అనుకోవడం మన పొరపాటేనని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి వారు మధ్యలో ఆపేయవద్దు..
కొంతమంది షుగర్ బాధితులు ఆరోగ్యపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మెడిసిన్ తీసుకుంటేనే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అయితే, ఇలాంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ మందులు వేసుకోవడం మధ్యలో ఆపేయవద్దు. ఒకవేళ మందులు తీసుకోవడం ఆపేస్తే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
మందులు మానేస్తే ఏమవుతుంది ?
చాలామంది మధుమేహం ఉన్నవారిలో గ్లూకోజు నియంత్రణలో లేకపోయినా.. పైకి ఎలాంటి ఇబ్బందులూ కనిపించవు. దీంతో వారు మునుపటిలానే ఆరోగ్యంగా ఉన్నానని భావిస్తుంటారు. కానీ, ఇది పెద్ద పొరపాటు. ఒక్కసారి ఉన్నట్టుండి డాక్టర్ సూచించిన మందులు ఆపేస్తే గ్లూకోజు మోతాదులు వేగంగా పెరుగుతాయి. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు, రక్తంలో ఆమ్లాలు పోగుపడే (డయాబిటిక్ కీటోఅసిడోసిస్) ముప్పు పెరుగుతుంది.
మధుమేహం ఒక సైలెంట్ కిల్లర్ వ్యాధి. త్వరగా పైకి ఎలాంటి లక్షణాలూ కనిపించకపోయినా.. అన్ని అవయవాలపైనా దీని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా చూపు తగ్గిపోవడం, కిడ్నీ ఫెయిల్యూర్, కాళ్లకు పుండ్లు పట్టడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. కొంతమందిలో కాళ్లకు పుండ్లు పడి మానకపోతే తొలగించే పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి సమస్యలను గుర్తించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కాబట్టి, షుగర్ బాధితులు డాక్టర్ సూచించిన మందులు తప్పకుండా వేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
డయాబెటిస్ ఉన్నవారు మద్యం తాగితే ఏం జరుగుతుంది? - పరిశోధనలో తేలిందిదే!
మధుమేహంతో తీవ్రంగా బాధపడుతున్నారా? - పరిశోధకులు సూచిస్తున్న డైట్ ఇదే!